కులాల కురుక్షేత్రంలో రాజు ఎవరు …?

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కులాల కురుక్షేత్రమే. ఇక్కడి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టే వారు సామాజిక వర్గాల సమీకరణాల్లో గట్టెక్కి వచ్చినవారే. 2009 ఎన్నికల్లోనూ, 2014 ఎన్నికల్లోనూ కులసమీకరణలు సెట్ అయినవారే విజేతలుగా నిలిచిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా రెండు సామాజిక వర్గాలే ఇక్కడి ఫలితాన్ని శాసించిన తీరు గమనించవచ్చు. కాపు, బిసి కులాలకు ప్రధాన రాజకీయపార్టీలు టికెట్ల పంపిణీలో ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి. హోరాహోరీ గా పోరు నడిచిన సందర్భం 2009, 2014 ఎన్నికల్లో నడిచినా ఈక్వేషన్ల కెమిస్ట్రీ ఫలిస్తేనే గెలుపుగుర్రం ఎక్కిన చరిత్ర కాకినాడ రూరల్ లో కనిపిస్తుంది. కరప, కాకినాడ రూరల్, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొంతభాగం ఓటర్లు కాకినాడ రూరల్ నియోజకవర్గంలోకి వస్తారు.

2009 లో పీఆర్పీ జయకేతనం ఇలా …

మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో ఇక్కడ విజయం సాధించడం విశేషం. నాటి ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ బిసి అభ్యర్థులకు టికెట్లు కేటాయించడం తో ఓట్ల చీలిక తో పీఆర్పీ అభ్యర్థి కురసాల కన్నబాబు 53494 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. ఆ నాటి ఎన్నికల్లో కన్నబాబు తరువాత ద్వితీయ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నులుకుర్తి వెంకటేశ్వర రావు 45457 ఓట్లు సాధించగా, అదే సామాజిక వర్గానికి చెందిన టిడిపి అభ్యర్థి పిల్లి సత్యనారాయణ మూర్తి 28691 ఓట్లతో మూడో స్థానం లో నిలిచారు. కన్నబాబు కాంగ్రెస్ అభ్యర్థి పై 8037 ఓట్ల మెజారిటీ తెచ్చుకున్నారు. ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం 2014 లో జరిగిన విభజన ప్రభావంతో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత గమనించిన కన్నబాబు తరువాత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.

2014 లో పల్టీ కొట్టిన కన్నబాబు వ్యూహం …

ప్రధాన రాజకీయ పక్షాలైన టిడిపి, వైసిపి బిసి శెట్టిబలిజ వర్గానికి చెందిన అభ్యర్థులనే బరిలోకి దింపడంతో కురసాల కన్నబాబు స్వతంత్రుడిగా పోటీ చేశారు. ఒకే సామాజిక వర్గం ఓట్లు చీలి తే తన విజయావకాశాలు ఉంటాయన్న లెక్కల్లో దిగిన ఆయనకు పలు అంశాలు పరాజయాన్ని కొనితెచ్చాయి. నాటి ఎన్నికల్లో జనసేన, బిజెపి టిడిపి తో జట్టు కట్టడంతో కాపు సామాజిక వర్గం ఓట్లు బిసి ఓట్లకన్నా అధికంగా చీలిపోయాయి. ఫలితంగా అంచనాలకు భిన్నంగా కన్నబాబు ఓటమి చవిచూశారు. టిడిపికి చెందిన పిల్లి అనంతలక్ష్మి 61144 ఓట్లను, వైసిపి అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ 52096 ఓట్లను స్వతంత్ర అభ్యర్థి కన్నబాబు 43742 ఓట్లను సాధించారు. టిడిపి అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి9048 ఓట్లతో విజేతగా నిలిచారు.

వైసిపి నుంచి కన్నబాబే, టిడిపి నుంచి పిల్లి ఖరారు …

2019 ఎన్నికల్లో వైసిపి నుంచి కురసాల కన్నబాబు కు టికెట్ ఖరారు అయిపొయింది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మినే చంద్రబాబు నిలపెడతారని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇక జనసేన తన అభ్యర్థిగా ఏ సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెడుతుంది అన్నది ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరం. దానిని బట్టి మాత్రమే ఇక్కడి ఫలితాన్ని వూహించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. టిడిపి అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మి ఆమె భర్త సత్తిబాబు కి నియోజకవర్గ ఓటర్లతో మంచి సంబంధాలే వున్నాయి. టిడిపిలో సీనియర్ నేతగా వున్న పిల్లి సత్యనారాయణ మూర్తి తన భార్య ఎమ్యెల్యే అయినా పెత్తనం మాత్రం వెనుక ముందు ఆయనే చేస్తారనేది అందరికి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో భార్య స్థానంలో సత్తిబాబు స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని టిడిపి క్యాడర్ భావిస్తుంది.

పవన్ కళ్యాణ్ బరిలోకి దిగే అవకాశాలు వున్న నియోజకవర్గం …

మరోపక్క జనసేన తరపున కూడా పెద్ద సంఖ్యలో ఆశావహులు ఉన్నప్పటికీ పవన్ ఎవరిని ఎంపిక చేస్తారు అన్న చర్చ నడుస్తుంది. కాపు సామాజికవర్గం అధికంగా వున్న ఇక్కడినుంచే పవన్ పోటీ చేసే అవకాశాలు లేకపోలేదన్న టాక్ వినవస్తుంది. గోదావరి జిల్లాల నుంచి పోటీ చేయడం ద్వారా అత్యధిక స్థానాలు జనసేన ఖాతాలో పడేలా చేయాలన్న ఆలోచన జనసేన వ్యూహకర్తలు చేస్తున్నారు. అనంతపురం నుంచే తాను బరిలోకి దిగుతానని గతంలో పవన్ ప్రకటించిన నేపథ్యంలో రెండో స్థానంగా గోదావరి జిల్లాలో ఎంపిక చేసుకునే నియోజకవర్గాల్లో కాకినాడ రూరల్ కూడా ఒకటని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేనాని స్వయంగా సీన్ లోకి దిగితే మరి అత్యధిక కాపు సామాజికవర్గం వున్న ఈ నియోజకవర్గం లో ఫలితం అంతా ఊహించినట్లే ఉండొచ్చంటున్నారు. అయితే అటు గ్రామీణం ఇటు అర్బన్ ప్రాంతాల సమ్మిళనం అయిన ఇక్కడ వుండే ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోకపోతే పాలకొల్లు లో చిరంజీవికి ఎదురైన పరాజయం వంటిది ఎదురుకావొచ్చని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు. మరి పవన్ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పవన్ స్వయంగా కాకినాడ నుంచి బరిలోకి దిగితే టిడిపి, వైసిపి లు సైతం ప్రత్యేక వ్యూహాలను అనుసరించడంతో బాటు ప్రస్తుతం వందశాతం గ్యారంటీ ఇచ్చిన అభ్యర్థుల స్థానంలో సెలబ్రెటీలనే రంగంలోకి దింపే అవకాశాలు మెండుగా వున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*