డమ్మీగా మారిపోయారే….!!!

kalavenkatrao-telugudesamparty-president

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రధాన పార్టీల అధ్యక్షులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేసి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్కక్షుడు రఘువీరారెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లు రాష్ట్ర మంతటా పర్యటించి తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. చివరకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సయితం తన పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నియోజకవర్గాల్లో పర్యటించారు. అయితే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం తన నియోజకవర్గానికే పరిమితం కావడం విశేషం.

కాపు ఉద్యమం నేపథ్యంలో….

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మారిన వేళ రెండు తెలుగురాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. తెలంగాణకు ఎల్. రమణ, ఆంధ్రప్రదేశ్ కు కళా వెంకట్రావు రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారు. ఈ నియామకం వెనక కూడా ఒక కారణం ఉందని చెబుతారు. కాపు ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో అదే సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావుకు ఈపదవి దక్కిందని చెబుతారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటుగా మంత్రి పదవిని చంద్రబాబు ఇచ్చారు.

ఎంపికలోనూ….

అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కళావెంకట్రావు పాత్ర ఏమీ లేదనే చెప్పుకోవాలి. అంతా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తానే చూసుకున్నారు. స్క్రీనింగ్ కమిటీల్లో కూడా కళా వెంకట్రావు లేరు. ఇక రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఏపీ అంతటా తిరగాల్సిన కళా వెంకట్రావు పోలింగ్ ముగిసేంత వరకూ ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని దాటి రాలేదంటే నమ్మండి. కళా వెంకట్రావుకు ఉణుకూరు, రాజాం నియోజకవర్గాల్లో మంచిపట్టుంది. ఉణుకూరు రద్దు కావడంతో ఆయన ఎచ్చెర్లకు షిఫ్ట్ అయి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఎచ్చెర్లలో ఈసారి కళావెంకట్రావుకు గట్టి పోటీ ఉండటంతో ఆయన ఆ నియోజకవర్గం పొలిమేర్లు దాటి రాలేకపోయారు. రెండురోజులు మాత్రం పాలకొండ నియోజకవర్గంలో ప్రచారం చేశారు.

పొలిమేర్లు దాటి రాలేదే…??

ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కళా వెంకట్రావు చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా గెలిచారనే చెప్పాలి. కళా వెంకట్రావు తన సమీప వైసీపీ అభ్యర్థి గొర్ల కిరణ్ కుమార్ పై కేవలం నాలుగువేల ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. ఈసారి కూడా గొర్ల కిరణ్ కుమార్ ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడం, కళా పైనా, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఆయన నియోజకవర్గం వదలిపెట్టి రాలేదంటున్నారు. కేవలం పార్టీ తరుపున కేసీఆర్, జగన్, మోదీలకు బహిరంగ లేఖలు రాసేపాత్రకే పరిమితమయ్యారు. గొర్ల కిరణ్ కుమార్ కు కొంత సానుకూలత వాతావరణం ఉందని గ్రహించిన కళా తన నియోజకవర్గంలోనే ఈ నెలరోజులు గడిపేశారు. అదండీ అధికార టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి పరిస్థితి.

Ravi Batchali
About Ravi Batchali 15695 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*