కాల్వకు పక్కలో బల్లెం…!

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు కూడా తిరుగుబాటు బెడద తప్పడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతుండటం అధిష్టానాన్ని కూడా కలవరపాటుకు గురి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రత్యర్థి పార్టీ నుంచి కాదు…సొంత పార్టీ వారే ఆయనకు ప్రత్యర్థులుగా మారారు. ప్రత్యర్థి కూడా సామాన్యుడు కాదు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు కావడతో కాల్వ కక్కలేక…మింగలేక అల్లాడిపోతున్నారు. కర్ణాటకకు సరిహద్దు నియోజకవర్గమైన రాయదుర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ కాల్వ శ్రీనివాసులు, జేసీ అల్లుడు దీపక్ రెడ్డిల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలను చేసుకుంటూ వెళుతున్నారు. దీంతో క్యాడర్ లో కూడా గందరగోళం నెలకొంది.

టిక్కెట్ వస్తుందని…..

2014 ఎన్నికలకు ముందు దీపక్ రెడ్డి రాయదుర్గం టీడీపీ ఇన్ ఛార్జిగా ఉండేవారు. 2012లోనే ఆయన రాయదుర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేసీ ఓడిపోయారు. అప్పటి నుంచి క్యాడర్ తో టచ్ లో ఉంటూ రాజకీయాలు నెరుపుతున్నారు. 2014 ఎన్నికల్లో తనకు ఖచ్చితంగా రాయదుర్గం టిక్కెట్ వస్తుందని దీపక్ రెడ్డి ఆశించారు. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు రాయదుర్గం టీడీపీ అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసులును అధిష్టానం ఖరారు చేసింది. అసంతృప్తిగా ఉన్న దీపక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పింది. తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇచ్చింది. అయితే దీపక్ రెడ్డికి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి శాసనసభలోకి అడుగుపెట్టాలన్న కోరికతో ఆయన రాయదుర్గం నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు.

దీపక్ రెడ్డి సుడిగాలి పర్యటనలు…..

గత కొన్ని నెలలుగా దీపక్ రెడ్డి రాయదుర్గం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంత్రి కాల్వకు సమాచారం లేకుండానే కార్యక్రమాలను నిర్వహిస్తుండటంతో కాల్వకు ఇబ్బందిగా మారింది. క్యాడర్ ను దగ్గరికి తీస్తూ వచ్చే ఎన్నికల్లో టిక్కట్ తనదేనని దీపక్ రెడ్డి చెబుతుండటం కాల్వ వర్గీయులకు మింగుడుపడటం లేదు. రాయదుర్గంలో నిజానికి టీడీపీకి పట్టుంది. అయితే వీరి మధ్య విభేదాలు పార్టీని దెబ్బతిస్తాయన్న ఆందోళన తెలుగుతమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. మంత్రిపై దీపక్ రెడ్డి పరోక్ష విమర్శలు కూడా చేస్తుండటంతో కాల్వ వర్గానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. రాయదుర్గం పట్టణంతో పాటు డీహీరేహల్, బొమ్మన హళ్లి, కణేకల్లు, గుమ్మగుట్ట మండలాల్లో దీపక్ రెడ్డి సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు.

కాల్వ మాత్రం కామ్ గా……

దీపక్ రెడ్డి జేసీ సోదరుల అండ ఉండటంతో కాల్వ వర్గం బహిరంగ విమర్శలకు దిగలేకపోతోంది. ఈ విషయాన్ని అధిష్టానానికి చెప్పాలన్నా కాల్వకు మొహం చెల్లడం లేదు. సీనియర్ నేతగా, మంత్రిగా ఉన్న కాల్వ తన నియోజకవర్గంలో ఉన్న విభేదాలను పరిష్కరించుకోలేకుంటే ఎలా అన్న ప్రశ్న అధిష్టానం నుంచి వస్తుందన్న భయంతో కాల్వ జంకుతున్నారు. అయితే దీనిని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. దీపక్ రెడ్డిని విమర్శించేకంటే తాను పర్యటనలు, ప్రజాకార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్లడమని కాల్వ భావించి నియోజకవర్గంలో విస్తృతంగా ఇటీవల కాలంలో పర్యటిస్తున్నారు. వందల కోట్ల నిధులను నియోజకవర్గంలో వెచ్చిస్తున్నారు. తుంగభద్ర డ్యాం పూర్తిగా నిండటంతో గత నెలలోనే హెచ్ ఎల్ సి కెనాల్ నీటిని విడుదల చేయడం, బీటీ ప్రాజెక్టుకు హంద్రీ-నీవా కాల్వ నుంచి నీటిని తీసుకెళ్లే పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇవి తమకు కలసి వస్తాయని కాల్వ భావిస్తున్నారు. మరి దీపక్ రెడ్డి ఎఫెక్ట్ కాల్వ విజయంపై ఎంతమేర పడనుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*