బిడ్డా…. ఏమా..తొందర…?

తెలంగాణ రాష్ట్రసమితి నాయకత్వ వారసత్వ ఎంపికను ప్రస్తుతానికి పక్కన పెట్టేసినట్టే. గత కొంతకాలంగా పార్టీపగ్గాలు , ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు కేటీఆర్ కు అప్పగించాలంటూ పార్టీలో ఒత్తిడి పెరుగుతోంది. తమ అస్తిత్వం కాపాడుకొనే క్రమంలో భాగంగా వృద్ధతరం నాయకులు, భవిష్యత్ అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు యువతరం నాయకులు కోరస్ గా కేటీఆర్ జపం ఆలాపిస్తున్నారు. దీనిని ఎవరూ బహిరంగంగా ఖండించడం లేదు. మధ్యేవాదంగా తటస్థంగా ఉంటున్నవారు సైతం కేసీఆర్ కుమారునివైపు మొగ్గు చూపకతప్పని స్థితి ఏర్పడుతోంది. నిజానికి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సహజవారసుడే. సమర్ధుడే. అవసరమనుకుంటే నేరుగా తన వారసుని పేరు ప్రకటించి ప్రజల్లోకి పంపగల సత్తా కేసీఆర్ కు ఉంది. మధ్యలో నాయకుల గానాలాపన, సిఫార్సులు అవసరం లేదు. అయితే అధిష్ఠానం ప్రాపకం కోసం అంగలార్చుతున్న నాయకులు ముందుగా బయటపడిపోతున్నారు. దీనిని సాధ్యమైనంత తొందరగా నియంత్రించకపోతే పార్టీలో పెద్ద డిమాండుగా మారిపోతుందని కేసీఆర్ గ్రహించారు. పైగా అవసరం లేని హడావిడి ఎందుకనే ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈరకమైన డిమాండ్లను తెచ్చి ఏదో సాధించేస్తున్నామనుకుంటున్న నాయకులపై తెలంగాణ అధినేత గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

ముందే కూయవద్దు…

తెలంగాణ రాష్ట్రసమితికి, ప్రభుత్వ పీఠానికి ఇద్దరే ఇద్దరు పోటీదారులు. ఒకరు కేటీఆర్, రెండు హరీశ్ రావు. ముందుగా పార్టీ వర్కింగు ప్రెసిడెంటు రూపంలో ఎవరికి పగ్గాలు అప్పగిస్తే వారు భావి ముఖ్యమంత్రిగా స్థిరపడే అవకాశం ఉంది. గత ఏడాదికాలంగా కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించాలని చాలామంది నాయకులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. మీడియాలోనూ ఆ తరహా వార్తలు వెల్లువెత్తాయి. కానీ అందుకు సంబంధించి ఎటువంటి ముందడుగు పడలేదు. హరీశ్ రావును లోక్ సభకు పంపివేస్తారనే ప్రచారమూ సాగింది. క్యాడర్ తో గట్టి సంబంధాలున్న హరీశ్ ను ఢిల్లీకి పంపడమంటే పరోక్షంగా రాష్ట్రరాజకీయాలకు దూరం పెట్టినట్టే. ఒకవేళ కేంద్రంలో రాబోయే ప్రభుత్వంతో మైత్రి కుదుర్చుకుంటే కేంద్రమంత్రి పదవి దక్కే చాన్సు ఉంటుంది. కేంద్రంలో కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే సాకుతో హరీశ్ ను హస్తిన బాట పట్టిస్తారని టీఆర్ఎస్ లోని మెజార్టీ నాయకులు భావించారు. దీనిపై చాలా చోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేల స్థాయిలో చర్చ సాగింది. హరీశ్ రావు చాలా హుందాగా వ్యవహరించారు. అధినేత చెప్పింది పాటిస్తానని, తనకు ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తానని స్పష్టం చేశారు. ఆయన కొంత మనస్తాపానికి గురైనట్లు ఆయన అనుచర వర్గం మీడియాకు లీకేజీలు పంపించింది. మొత్తం విషయంపై కూపీ లాగిన కేసీఆర్ పెద్ద స్థాయి నాయకులను మందలిస్తూ వారసత్వంపై ఎటువంటి ప్రకటనలు చేయవద్దని హెచ్చరించారు.

ఎదగడానికెందుకురా తొందర…

వారసత్వం విషయంలో కేటీఆర్ గుంభనంగా వ్యవహరిస్తున్నారు. మరో 20 ఏళ్ల వరకూ తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేస్తారంటూ పైకి చెబుతున్నారు. కానీ గతంలో మాదిరిగా తన శాఖకే పరిమితం కాకుండా జిల్లాల్లో పర్యటనలు షురూ చేశారు. ఇతర మంత్రిత్వశాఖలకు సలహాలు, సూచనలు ఇచ్చేస్తున్నారు. దీనిపై కొందరు సీనియర్ మంత్రులు మానసిక క్షోభకు గురవుతున్నప్పటికీ బయటపడలేకపోతున్నారు. రేపొద్దున్న కేటీఆర్ తమ అధినాయకుడు కావచ్చన్న అంచనాతో వారంతా సర్దుకుపోతున్నారు. ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధ్యయనంతోపాటు పార్టీపై పట్టుకు కేటీఆర్ చురుకుగా కదులుతున్నారు. హరీశ్ తన శాఖాపరమైన బాధ్యతలకే పరిమితమవుతున్నారు. కేటీఆర్ జిల్లా పర్యటనలు విస్తృతం చేశారు. వెళ్లిన ప్రతిచోట క్యాడర్ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. కార్యకర్తలు, నాయకులు వివిధ పనుల నిమిత్తం వచ్చిన సందర్బాల్లో జెన్యూన్ అవసరాలను తీర్చాలని అధికారులకు సూచిస్తున్నారు. ఇదంతా ఒకరిద్దరు శ్రేయోభిలాషులు కేసీఆర్ చెవిలో వేసేశారు. దీనిపై కేటీఆర్ తో ఆయన చర్చించినట్లు సమాచారం. పార్టీ పర్యటనల విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిదే. ప్రభుత్వ కార్యకలాపాల్లో మంత్రులను ఇబ్బంది పెట్టవద్దని మందలించినట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ఏదేమైనప్పటికీ కేటీఆర్ వారసత్వానికి డోకాలేదు. కానీ తక్షణం జరగకపోవచ్చునంటున్నాయి పార్టీ శ్రేణులు.

కీలకం కావాలంటే…

ఫెడరల్ ఫ్రంట్ పేరిట జాతీయ రాజకీయ చిత్రంలో కీలకం కావాలని కేసీఆర్ తలపోశారు. అది కుదిరే వ్యవహారం కాదని తేలిపోయింది. దీంతో రాష్ట్రంలో ఏకచ్ఛత్రాధిపత్యం సాధించగలిగితే ఆటోమేటిక్ గానే జాతీయ ప్రాధాన్యం పెరుగుతుందని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు గాను 16 లేదా 15 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవాలనేది లక్ష్యం. హైదరాబాదు స్థానంలో ఎంఐఎంకు ఎటూ తిరుగులేదు. మిగిలిన 16 స్థానాల్లో ఒక్కటి కూడా కాంగ్రెసు, బీజేపీలకు రాకుండా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకుగాను పక్కా వ్యూహరచన చేస్తున్నారు. అసెంబ్లీలో 90 నుంచి 100 స్థానాలు టీఆర్ఎస్ సాధించగలిగితే అనాయాసంగా అన్ని లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోగలుగుతుందని లెక్కలు వేస్తున్నారు. అదే జరిగితే జాతీయంగా టీఆర్ఎస్ ప్రాబల్యం, ప్రాధాన్యం పెరుగుతుంది. దీనివల్ల కేంద్రంలో డిమాండ్లను సాధించుకోవడానికి నేషనల్ పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషించడానికి వీలవుతుంది. ఈ దిశలో సీఎం కేసీఆర్ పార్టీ పరమైన కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్