క‌ష్టాల్లో కేసీఆర్ కుమార్తె క‌విత‌

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ క‌విత‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిక్కులు త‌ప్పేలా లేవు. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక్క‌డు మూడు పార్టీలు హోరీహోరీగా త‌ల‌ప‌డ‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ క‌విత‌కు కాంగ్రెస్‌, బీజేపీల నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతుంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అదేస‌య‌మంలో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలోని అసెంబ్లీ స్థానాల్లో ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి. క్ర‌మంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది.

కొన్ని నెలలుగా…..

ఇదిలా ఉండ‌గా… సీఎం కేసీఆర్ కూత‌ురిగా, తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలిగా.. పార్టీ, ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో ఎంతో చురుగ్గా ఉండే క‌విత‌ను నిలువ‌రించ‌డం కాంగ్రెస్‌, బీజేపీల‌కు క‌ష్ట‌మేన‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ క‌విత జ‌గిత్యాల అసెంబ్లీ స్థానం నుంచి బ‌రిలోకి దిగుతార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. అయితే ఈ ప్ర‌చారాన్ని ఆమె తోసిపుచ్చుతున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణ‌యం మేర‌కే తాను ఎక్క‌డి నుంచి పోటీ చేసే విష‌యం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ఆమె అంటున్నారు. కానీ ఆమె మాత్రం కొన్ని నెల‌లుగా జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు.

జీవన్ రెడ్డిని ఓడించడమే…..

ప్ర‌భుత్వం నుంచి నిధులు కూడా భారీగా విడుద‌ల చేయిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె ఇక్క‌డి నుంచి బ‌రిలోకి దిగడం ఖాయ‌మ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డిని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ పావులు క‌దుపుతోంది. జ‌గిత్యాల జిల్లాలోని మూడు మునిసిపాలిటీలు అయిన జ‌గిత్యాల‌, కోరుట్ల‌, మెట్‌ప‌ల్లికి భారీ ఎత్తున నిధులు విడుద‌ల చేయించి అక్క‌డ అభివృద్ధి ప‌నుల‌పై ఆమె స్పెష‌ల్‌గా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు.

మధు యాష్కి మళ్లీ బరిలోకి….

ఇక నిజామాబాద్ లోక్‌స‌భ సీటు విష‌యానికి వ‌స్తే గ‌త‌ ఎన్నిక‌ల్లో క‌విత చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ నేత మ‌ధుయాష్కి మాత్రం మ‌ళ్లీ ఇక్క‌డి నుంచే బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే ఏఐసీసీ ప‌దవి ఉండ‌డంతో ఎక్కువ‌గా జాతీయ స్థాయిలోనే ప‌ర్య‌టిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి టీఆర్ఎస్ నేత డీఎస్ త‌న‌యుడు అర‌వింద్‌ బ‌రిలోకి దిగ‌డం దాదాపుగా ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో హోరాహోరీ పోరు త‌ప్ప‌ద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

గ్రూపులతో ఇబ్బందులే….

ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇటీవ‌ల డీఎస్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి స‌మావేశం కావ‌డం.. త‌మ‌కు స‌రైన గుర్తింపు ద‌క్క‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా.. అర్బ‌న్‌, రూరల్ టీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు ఏర్ప‌డి, విభేదాలు త‌లెత్త‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపుతాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. మ‌రోవైపు డీఎస్ మ‌రో త‌న‌యుడు, నిజామాబాద్ మాజీ మేయ‌ర్ సంజ‌య్ అర్బ‌న్ లేదా రూర‌ల్‌లో టీఆర్ఎస్‌లో సీటు రాక‌పోతే కాంగ్రెస్‌లోకి తండ్రితో స‌హా జంప్ చేయ‌వ‌చ్చ‌నే మ‌రో టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా నిజామాబాద్‌లో ఈ సారి మూడు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య ఓట్లు చీలి క‌విత‌కు గెలుపు అంత సులువుగా అయితే క‌న‌ప‌డ‌డం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*