ఈసారి కాల్వకు కలసి రాదా…??

రాయదుర్గం విడిచి వెళ్లాలంటే పాపం మంత్రి కాల్వ శ్రీనివాసులుకు బెంగపట్టుకుంటోంది. మంత్రిగా తాను అన్ని జిల్లాలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ సొంత పార్టీ నేతలే ఆయనను రాయదుర్గానికే పరిమితం చేసేటట్లున్నారు. టీడీపీ నేతల నుంచే ఆయనకు ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి. నిజానికి రాయదుర్గంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ బలంగా ఉంది. అక్కడ కాపు రామచంద్రారెడ్డి వంటి బలమైన నేత ఉన్నారు. రాయదుర్గంలో ఇటీవల కాల్వ శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డిల మధ్య బహిరంగ చర్చ సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్తతలు తలెత్తడంతో పోలీసులు రెండు వర్గాలను శాంతింప చేసి చర్చ లేకుండా ఎవరి దారిన వారిని పంపించేశారు.

స్వల్ప మెజారిటీతో …..

నిజానికి గత ఎన్నికల్లో కాల్వ శ్రీనివాసులు చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా గెలిచినట్లే చెప్పాలి. వైసీపీ అభ్యర్థి కాంపు రామచంద్రారెడ్డి పై గత ఎన్నికల్లో కేవలం 1800 ఓట్ల స్వల్ప ఆధిక్యతతోనే గెలిచారు. అయితే ఈసారి అంత సులువుకాదని తేలడంతో కాల్వ శ్రీనివాసులు రాయదుర్గంలోనే ఎక్కువ సయమం గడపాల్సి వస్తోంది. ముఖ్యంగా జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లాలో పూర్తయిన తర్వాత వైసీపీకి మరింత జోష్ పెరగడంతో కాల్వ అప్రమత్తమయ్యారు. మంత్రిగా నియోజకవర్గానికి తీసుకురావాల్సిన నిధులను తీసుకొచ్చి రాయదుర్గం అభివృద్ధికి శక్తివంచనలేకుండానే కృషి చేస్తున్నారు.

ఇంటి శత్రువలతోనే…..

కానీ ఇదే సమయంలో కాల్వకు ఇంట్లో శత్రువులు ఎక్కువయ్యారు. ప్రధానంగా జేసీ అల్లుడు, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి రాయదుర్గం టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన కాల్వకు పోటీగా నియోజకవర్గంలో వివిధ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. సభలను నిర్వహిస్తున్నారు. తనకే ఈసారి టిక్కెట్ వస్తుందని దీపక్ రెడ్డి ధీమాగా ఉన్నారు. దీంతో పాటు మంత్రికి తెలియకుండానే జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి కూడా నియోజకవర్గంలో పర్యటిస్తుండటం కాల్వకు మింగుడు పడటం లేదు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం ఉండదని గ్రహించిన కాల్వ కామ్ గానే తనపని తాను చేసుకుపోతున్నారు.

మెట్టు దిగడం లేదు…..

ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి సయితం ఈసారి పోటీలో తానుంటానని ప్రకటించి కాల్వకు సవాల్ విసరుతున్నారు. 2004లో మెట్టు గోవిందరెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యేగా టీడీపీ తరుపున గెలిచారు. 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డిపై ఓటమి పాలయ్యారు. తాను ప్రాతినిధ్యం వహించననియోజకవర్గాన్ని కాల్వ కబ్జాచేశారంటున్నారు మెట్టు గోవిందరెడ్డి. రాయదుర్గంలో వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు అక్కడే తిష్టవేశారు. తన సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపుతానని గోవిందరెడ్డి సవాల్ విసురుతున్నారు. మొత్తం మీద కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం వదలాలంటేనే భయపడిపోతున్నట్లుగా ఉంది. మరి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కాల్వకు సీటిస్తారా? లేక నియోజకవర్గాన్ని మారుస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*