కామినేని కాలు కదిపితే…??

మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు…ఆ గట్టా..ఈ గట్టా…? ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కామినేని శ్రీనివాసరావు తొలుత టీడీపీ నుంచే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అయితే స్థానిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన ప్రజారాజ్యం పార్టీ వైపు చూశారు. గత ఎన్నికలలో ఆయన ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి సూచనలతో కాషాయకండువా కప్పుకుని కైకలూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ ఎన్నికలలో టీడీపీ, బీజేపీ పొత్తు ఉండటంతో కామినేని విజయం సులభమయింది.

బాబును పొగడ్తలతో…

అయితే బీజేపీ, టీడీపీల మధ్య వచ్చిన గ్యాప్ కారణంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మంత్రివర్గంలోనూ కామినేనికి చంద్రబాబు అత్యంత ప్రధానమైన వైద్య ఆరోగ్యశాఖను అప్పగించారు. అనేకసార్లు మంత్రిగా కామినేని తీరును అసెంబ్లీలోనే చంద్రబాబు ప్రశంసించారు. కామినేని కూడా వివిధ సందర్భాల్లో చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. అయితే బీజేపీ, టీడీపీ మైత్రి చెడిపోయి దాదాపు ఆరు నెలలు కావస్తోంది. కామినేని మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు అలాగని బీజేపీనీ వీడలేదు.

బాబును కలవడంతో…..

తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కామినేని శ్రీనివాస్ కలుసుకున్నారు. ఉపాధ్యాయుల సమస్యపై కామినేని చంద్రబాబును కలసినట్లు చెబుతున్నప్పటికీ రాజకీయంగా ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. కామినేని చెప్పిన సమస్యను వెంటనే చంద్రబాబు పరిష్కరించడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. తాను పార్టీని వీడనని, బీజేపీలో కొనసాగుతానని మీడియాతో కామినేని చెబుతున్నప్పటికీ ఆయన మాటలు నమ్మశక్యంగా లేవంటున్నారు. వరుసగా పార్టీలు మారుతున్న కామినేని మళ్లీ టీడీపీలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా చంద్రబాబు బీజేపీపై కాలు దువ్వుతుండటంతో ఆ పార్టీ నేతను తమ దళంలో కలుపుకునేందుకే ఎక్కువగా ఉత్సాహం చూపుతారనడంలో ఆశ్చర్యకరమేమీకాదు.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా….

కామినేని ఆరు నెలలుగా పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. టీడీపీతో వైరం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడంతో ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికలలో బీజేపీని పెద్దగా పట్టించుకోరన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కామినేని ఖచ్చితంగా టీడీపీలోకి వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అక్కడ టీడీపీకి కూడా బలమైన అభ్యర్థి లేకపోవడం కామినేనికి కలసి వచ్చే అంశమే. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండటంతో ఇప్పుడే పార్టీని వీడే అవకాశం లేదు. పైగా పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ వచ్చిన తర్వాత కామినేని అక్కడ ఇమడలేకపోతున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఎన్నికల ముందు కామినేని గ్యారంటీ పసుపు కండువా కప్పుకుంటారన్నది కైకలూరు నియోజకవర్గంలో టాక్. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*