కన్నా గెలుస్తారా… అక్కడ ఏం జరుగుతోంది..!

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పొలిటికల్‌ ఫ్యూచర్‌ వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ? మూడు దశాబ్దాలకు పైగా తిరుగులేని రాజకీయ యోధుడుగా ఉన్న కన్నా గత ఎన్నికల్లో మాత్రమే ఓడారు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా వేసిన పిల్లిమొగ్గల నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి అనూహ్య పరిస్థితుల్లో బీజేపీలోకి రావాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ నుంచి వైసీపీలోకి వెళ్లేందుకు కన్నా అన్ని ఏర్పాట్లు చేసుకున్నా రాత్రికి రాత్రే జరిగిన అనూహ్య సంఘటనల నేపథ్యంలో ఆయన బీజేపీలోకి వచ్చారు. బీజేపీలో కూడా ఇమడలేని పరిస్థితుల్లో ఉండ‌గా ఆయ‌న్ను తృప్తి ప‌రిచేందుకు చివరకు ఆయనకు పార్టీ జాతీయ నాయకత్వం ఏపీ బీజేపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించింది. ఈ మార్పు పెద్ద సంచలనమే అనుకోవాలి. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా ? 2019 ఎన్నికల తర్వాత ఆయన పొలిటికల్‌ ఫ్యూచర్‌ ఎలా ఉండబోతుం ది? గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన గెలుపు సంక్లిష్టమేనా ? అసల కన్నా 2019లో ఏం చేస్తారన్న దానిపై తెలుగు పోస్ట్‌ ప్రత్యేక సమీక్షలో చూద్దాం.

ఓట్లు పడతాయనుకోవడం…….

ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఓట్లు పడతాయని ఆశించడం అత్యాశే. ఆ పార్టీ సొంతంగా పోటీ చేస్తే ఒక్క సీట్లో గెలవడం కాదు డిపాజిట్లు దక్కించుకుంటేనేె గొప్పన్నట్లుగా పరిస్థితి ఉంది. ఏపీ జనాల్లో బీజేపీపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ టైమ్‌లో కన్నాకు వచ్చే ఎన్నికల్లో తాను సొంతంగా పోటీ చేసి తన నియోజకవర్గంలో గెలవడమే పెద్ద సవాల్‌గా మారింది. గుంటూరు జిల్లాలో కన్నా ఒక్కప్పుడు కాకలు తీరిన రాజకీయ యోధుడే. పెదకూరపాడు నుంచి వరుస విజయాలు సాధించిన ఆయన 2009లో గుంటూరు వెస్ట్‌కు మారి అక్కడ ఐదో సారి గెలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కన్నా 23వేల పైచిలుకు ఓట్లు సాధించి కాంగ్రెస్‌పై అంత తీవ్ర వ్యతిరేకత ఉన్నా టైమ్‌లో కూడా డిపాజిట్లు సాధించిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు.

వైసీపీలోకి వెళ్లేందుకు…..

వాస్తవానికి బీజేపీలో చేరేముందు కన్నా వైసీపీలోకి వెళ్తారన్న వార్తలు వచ్చినప్పుడు ఆయన తిరిగి తన పాత నియోజకవర్గమైన పెదకూరపాడులోనే పోటీ చేస్తారని అందరు అనుకున్నారు. అయితే ఇప్పుడు బీజేపీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో గుంటూరు వెస్ట్‌ నుంచే పోటీకి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్ల బట్టీ చూస్తే గుంటూరు వెస్ట్‌లో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఇక్కడ నుంచి మార్చడం ఖ‌రారు అయ్యింది. టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది క్లారిటీ లేకపోయినా వైసీపీ నుంచి విశ్రాంత పోలీస్‌ అధికారి చంద్రగిరి ఏసురత్నం పేరు ఖ‌రారు అయ్యింది.

ట్రయాంగిల్ ఫైట్ తప్పేట్లు లేదు……

బీసీ వర్గానికి చెందిన ఏసురత్నం ఇటు కాపు వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణతో పాటు అటు టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మధ్య ట్రయాంగిల్‌ ఫైట్‌ ఉంటుందా ? కన్నా గట్టి పోటీ ఇస్తారా ? లేదా తేలిపోతారా అన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. టీడీపీ నాయకులు మాత్రం నిన్నటి వరకు ఇక్కడ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న లేళ్ళ అప్పిరెడ్డిని మార్చి చంద్రగిరి ఏసురత్నాన్ని పెట్టడం వెనుక పరోక్షంగా కన్నాకు లబ్దీ చేకూర్చేందుకే ఈ మార్పు అని… బీజేపీ, వైసీపీ మధ్య చీక‌టి ఒప్పందాన్ని కూడా ఇది సూచిస్తోందని విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ ఎలాంటి ఒప్పందాలు జరిగినా… ఎలా ఉన్నా బీజేపీ నుంచి పోటీ చేసి కన్నా గెలిస్తే ఓ సంచలనమే అవుతుంది అనడంలో సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*