కన్నబాబుపై కుట్ర అందుకేనా….??

కురసాల కన్నబాబు…. జర్నలిస్ట్ గా ఉండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి చేరువయ్యారు. అంతా ఆయనే చిరంజీవిని వెన్నంటి నడిపించారు. నేటికీ చిరంజీవితో సత్సంబంధాలను నెరిపే కన్నబాబును జనసేన అధినేత, చిరు ముద్దుల సోదరుడు పవన్ కల్యాణ్ ఎందుకు టార్గెట్ చేశారు. కన్నబాబుపై పవన్ చేసిన ఆరోపణల్లో నిజమెంత? ఇప్పుడు తూర్పు రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. కన్నబాబును టార్గెట్ చేయడం వెనక వైసీపీలో ఉన్న కొందరు నేతలతో పాటు, జిల్లాలోని కాపుసామాజికవర్గానికి చెందిన కొందరు ముఖ్యనేతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

జగన్ దగ్గరకు తీసి……

కన్నబాబు దక్షత, సమర్థతను గుర్తించి ఆయనకు ఏడాది క్రితం వైసీపీ అధినేత జగన్ జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. జ్యోతుల నెహ్రూ పార్టీని వీడిన తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కన్నబాబు కొనసాగుతున్నారు. దాదాపు రెండు నెలల పాటు తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర దిగ్విజయం అవ్వడానికి వెనక కూడా కన్నబాబు కృషి ఉందనడం కాదనలేని వాస్తవం. అందుకే జగన్ కూడా కన్నబాబుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నబాబుపై పవన్ ఆరోపణల వెనక కూడా కొందరు వైసీపీ నేతల హస్తం ఉందని చెబుతున్నారు.

నూరిపోసింది ఎవరంటే…..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కొందరు అసత్యాలను నూరిపోశారని కన్నబాబు వర్గీయులు కస్సుమంటున్నారు. నిజానికి కాకినాడ రూరల్ లో చంద్రబాబుకు మంచి పట్టుంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన కన్నబాబు రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ దాదాపు 40 వేలు ఓట్లు సంపాదించుకుని సత్తా చాటారు. అందుకే జగన్ కన్నాబాబును దగ్గరకు తీసి ముఖ్యమైన పదవిని ఇచ్చారు. అయితే ఈసారి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేనను గెలిపించుకోవాలని కొందరు కాపు సామాజిక వర్గం నేతలు కన్నబాబుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీలోనే ప్రచారం జరుగుతుండటం విశేషం.

రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారంటూ…..

గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయిన ఒక నేత పవన్ కు దగ్గరయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా ఇటీవల రాజ్యసభ పదవి కోసం ప్రయత్నించి భంగపడ్డారు. ఆయన పవన్ కు రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారంటున్నారు. మానసికంగా దెబ్బతీయడానికే కన్నబాబుపై ఆరోపణలు చేయించారని చెబుతున్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటున్నారు. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించి రాజకీయాల్లోకి వచ్చి, చిరంజీవి అండతో వందకోట్లు సంపాదించారని పవన్ చేసిన ఆరోపణల్లో పసలేదని, ఈ విమర్శలు ఒకరకంగా చిరంజీవికి కూడా మచ్చతెచ్చే విధంగా ఉన్నాయని ఆయన వర్గం ఆరోపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. మరి అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో కీలకంగా వ్యవహరించిన నేతలను పవన్ టార్గెట్ చేస్తున్నారన్న ది చర్చగా మారింది. మరి పవన్ కు ఇది ఏ మాత్రం ఉపయోగపడుతుందో తెలియదు కాని, రాంగ్ ఫీడ్ బ్యాక్ పక్కన ఉన్న నేతలను ఇస్తే ఒకసారి సరిచూసుకోవడం మంచిదని పవన్ కొందరు హితవు పలుకుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*