తెలంగాణ నేత‌ల‌కు ఊపిరిపోసిన క‌న్న‌డ కాంగ్రెస్

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విడుద‌ల చేసిన అభ్య‌ర్థుల జాబితా తెలంగాణ‌లో కొంత‌మంది నేత‌ల‌కు ఊపిరిపోసింది. ఆ పార్టీ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో అత్య‌ధికంగా క‌ర్ణాట‌క‌లోని 218 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ఏక‌కాలంలో ప్ర‌క‌టించింది. ఇందుకోసం ఐదురోజుల పాటు ఢిల్లీలో అధిష్టానం వ‌రుస స‌మావేశాల్ని నిర్వ‌హించి, ఎట్ట‌కేల‌కు జాబితాను ఆదివారం రాత్రి విడుద‌ల చేసింది. అయితే జాబితాను చూసి, కొంద‌రు తెలంగాన కాంగ్రెస్ నాయ‌కులు తెగ సంబుర‌ప‌డిపోతున్నార‌ట‌.

సంబురాలు చేసుకుంటున్న…..

అదేంటి క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితాకు తెలంగాణ‌లో కాంగ్రెస్ లీడర్ల సంబురాల‌కు లింకేంట‌నుకుంటున్నారా ? అక్క‌డ కాంగ్రెస్ లిస్ట్ అలా రిలీజ్ అయ్యిందో లేదో వెంట‌నే తెలంగాణ కాంగ్రెస్ లీడ‌ర్లు ఇక త‌మకు ఇబ్బందిలేద‌నీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ద‌క్కుతాయ‌న్న ధీమాతో ఉన్నార‌ట‌. ఇంత‌కీ క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ పార్టీ విడుద‌ల చేసిన అభ్య‌ర్థుల జాబితా ఇక్క‌డి నేత‌లకు సంతోష‌మెలా తెచ్చిందో తెలియాలంటే ఈ క‌థ‌నం మీరు చ‌ద‌వాల్సిందే.

75 ఏళ్లు దాటిన వారికి కూడా…..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాలో మొత్తం 224 సీట్లకు గాను.. సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు పరమేశ్వరన్‌ సహా 218 మంది పేర్లను ప్రకటించింది. అయితే ఈ జాబితా ప్రకారం సిద్దరామయ్య చాముండేశ్వరి నుంచి, ఆయన చిన్న కుమారుడు యతీంద్ర వరుణ నియోజవర్గం నుంచి బరిలో దిగనున్నారు. అయితే సీనియ‌ర్ల‌కు ఈసారి టికెట్లు ఇవ్వ‌బోమ‌ని ఇప్ప‌టివ‌ర‌కూ పార్టీ అధిష్టానం చెబుతూ వ‌చ్చినా కొంద‌రికి చోటు ల‌భించింది. 75ఏళ్లు దాటిన వ‌యోవృద్ధులు కాగోడు తిమ్మ‌ప్ప‌(సాగ‌ర‌), కేబీ కోళివాడ్‌(రాణిబెన్నూరు) శ్యామ‌నూరు శివ‌శంక‌ర‌ప్ప (దావ‌ణగెరె ద‌క్షిణం)కు టికెట్లు ఇచ్చారు.

ఐదుగురు సీనియర్లు…..

క‌న్న‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితాతో తెలంగాణ‌లోని ఐదారుగురు సీనియ‌ర్లు ఆనందంతో ఉన్నార‌ట‌. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు కూడా టికెట్లు వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం వ‌చ్చింద‌ట‌. తెలంగాణ‌లో జానారెడ్డి, గీతారెడ్డి, మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి, పొన్నాల ల‌క్ష్మ‌య్య త‌దిత‌ర సీనియ‌ర్ల‌కు ఈసారి టికెట్లు ద‌క్క‌వంటూ కొద్దిరోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన పార్టీ ప్లీన‌రీలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీనియ‌ర్ల‌ను కోరిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మాట‌ల్ని స్ఫూర్తిగా తీసుకుని ప‌లురాష్ట్రాల్లోని సీనియ‌ర్లు త‌మ ప‌ద‌వుల‌కు స్వ‌చ్ఛందంగా రాజీనామా చేశారు కూడా. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ల సేవ‌ల‌ను పార్టీకి వినియోగించుటారుగానీ టికెట్లు ఇవ్వ‌ర‌నే టాక్ వినిపించింది. అయితే తాజాగా క‌న్న‌డ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల జాబితో ఇవ‌న్నీ ఊహాగానాలేన‌ని తేలిపోయింది. అందుకే తెలంగాణ‌లోని ప‌లువురు సీనియ‌ర్లు లోలోప‌ల తెగ సంబుర‌ప‌డిపోతున్నార‌ట‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*