కరణం కు క్లారిటీ వచ్చింది….!

ఏపీ కేబినెట్‌లో ఓ మంత్రికి వచ్చే ఎన్నికల్లో ఓ కీలకమైన ఎంపీ సీటు ఖ‌రారు అయ్యిందా ? వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చెయ్యకుండా లోక్‌సభకు పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారా ? అంటే అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం అవుననే తెలుస్తోంది. ప్రకాశం జిల్లా దర్శి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అటవి శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు వచ్చే ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఈ మేరకు దాదాపు క్లారిటీ వచ్చేసింది. దీనిపై సీఎం చంద్రబాబు సైతం శిద్ధాకు సమాచారం ఇచ్చేశారు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో రెండు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న శిద్ధా రాఘవరావు గత ఎన్నికల్లో దర్శి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం చంద్రబాబు ఆయన్ను తన కేబినెట్‌లోకి తీసుకుని కీలకమైన రోడ్లు, భవనాల శాఖ అప్పగించారు.

ఎలాంటి వివాదాలు లేకుండా….

గత ఏడాది జరిగిన ప్రక్షాళ‌న‌లో ఆయన్ను అటవీ శాఖకు మార్చారు. నాలుగున్నర ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా నియోజకవర్గంలోనే కాకుండా తన శాఖల పరంగా కూడా శిద్ధా రాఘవరావు తన పని తాను చేసుకుంటు ముందుకు వెళ్తున్నారు. ఇక కొద్ది రోజులుగా వచ్చే ఎన్నికల్లో ఆయన గుంటూరు జిల్లాలోని నరసారావుపేట నుంచి లోక్‌సభకు పోటీ చేస్తార‌న్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఒకటి, రెండు సార్లు మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా ఆయన సమాధానం దాటవేశారు. నరసారావుపేటలో మీరు ఎంపీగా పోటీ చేస్తారని… అదే సమయంలో మీ కుమారుడు అసెంబ్లీకి పోటీ చేస్తారు అన్న వార్తలకు ఆయన చిరునవ్వుతో సమాధానం దాటవేస్తు వచ్చారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్ర‌కారం చంద్రబాబు శిద్ధాకు నరసారావుపేట ఎంపీ సీటు డిసైడ్‌ చేసేశారని తెలిసింది.

బయటపెట్టిన బాబు….

గుంటూరు మిర్చి యార్డ్ చైర్మ‌న్‌గా ఇప్పటి వరకు ఉన్న మన్నం సుబ్బారావును తప్పించి ఆ ప్లేస్‌లో కొత్తగా పార్టీ సీనియర్‌ నేత వెన్నా సాంబశివారెడ్డికి చైర్మ‌న్ గా భాధ్యతలు ఇచ్చారు. ఈ క్రమంలో జరిగిన గుంటూరు జిల్లా పార్టీ ముఖ్య నేత‌ల‌తో జ‌రిగిన సమావేశంలో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా శిద్ధా రాఘవరావు పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులంతా ఆయనకు సహకరించాలన్న‌ ఆదేశాన్ని జారీ చేశారు. ప్రస్తుతం దర్శి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న శిద్ధా వచ్చే ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసేందుకు బాబు ప్ర‌తిపాదించ‌గా సిద్ధా సైతం తన ఆసక్తిని వ్యక్తం చెయ్యడంతో బాబు సైతం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

దర్శి సీటును కరణానికి…..

ఇక ప్రకాశం జిల్లాలో అద్దంకి సమస్యను కూడా శిద్ధాకు ఎంపీ సీటుతో చెక్‌ పెట్టినట్టు తెలుసింది. శిద్ధా నరసారావుపేట ఎంపీగా పోటీ చేస్తే అద్దంకి సీటును గొట్టుపాటి రవికుమార్‌కు కేటాయించి, దర్శి నుంచి కరణం వెంకటేశ్‌ను బరిలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ‌ శిద్ధా కుమారుడు శిద్ధా సుధీర్‌బాబు సైతం అసెంబ్లీకి పోటీ చెయ్యాలనుకుంటే ఆయన్ను వైశ్య‌ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా (22 వేల వ‌ర‌కు) ఉన్న మార్కాపురం నుంచి బరిలోకి దింపే ఆలోచన కూడా అధిష్టానం చేస్తుంది. ఏదేమైనా నరసారావుపేట ఎంపీగా శిద్ధా పోటీ చెయ్యడం నూటికి నూరు శాతం ఖ‌రారు అయ్యినట్టే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*