కరణం కవ్విస్తున్నాడే…!!!

karanam-balaram-telugudesamparty

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌పడుతున్న కొద్దీ.. ఆయా నియోజ‌కవ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల‌నే డిమాండ్లు టీడీపీలో అధిక‌మ‌వుతున్నాయి. వైసీపీ నుంచి గెలిచి త‌ర్వాతి కాలంలో సైకిలెక్కిన ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇది మ‌రింత తీవ్ర‌మ‌వుతోంది. వారు టీడీపీలో చేరే స‌మ‌యంలో తీవ్రంగా వ్య‌తిరేకించిన వ‌ర్గాలు ఇప్పుడు.. అస‌మ్మ‌తి గ‌ళం పెంచుతున్నాయి. ఫ‌లితంగా పార్టీలో వ‌ర్గ పోరు అధిక‌మ‌వుతోంది. ముఖ్యంగా ప్ర‌కాశం జిల్లాలో ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం, ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి.. మ‌ధ్య వ్యవ‌హారం పార్టీని అప్ర‌తిష్ట పాలు చేస్తోంది. బ‌లరాం వ్య‌వ‌హార శైలిపై పార్టీ క్యాడ‌ర్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఆయ‌న తీరు ప్ర‌కాశం జిల్లాలో గ్రూపు రాజ‌కీయాల‌కు ఆజ్యం పోస్తోంద‌ని ద్వితీయ శ్రేణి కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు.. క‌ల‌గ‌జేసుకుని వివాదానికి తెర దించేయాల‌ని లేనిప‌క్షంలో పార్టీకి తీవ్ర న‌ష్టం క‌ల‌గ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఇచ్చినా….

ప్ర‌కాశం జిల్లా టీడీపీ రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. గొట్టిపాటి, క‌ర‌ణం వ‌ర్గాల మ‌ధ్య పోరు ముదిరి పాకాన ప‌డింది. ఈ వ‌ర్గాల‌ మ‌ధ్య వివాదాలు ప‌రిష్క‌రించి రెండు క‌త్తుల‌ను ఒకే ఒర‌లో ఇమ‌డ్చాల‌ని సీఎం చంద్ర‌బాబు ఎంత‌లా ప్ర‌య‌త్నాలు చేసినా.. ఇవ‌న్నీ బూడిద‌లో పోసిన ప‌న్నీరులానే మారిపోతున్నాయి. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ టికెట్ కోసం ఇరు వ‌ర్గాలు ప‌ట్టుబ‌డుతున్న నేప‌థ్యంలో.. మ‌ళ్లీ పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం వేడెక్కింది. ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి పార్టీలో చేరిన ద‌గ్గ‌ర నుంచి ఇమ‌డ‌లేక‌పోతున్న క‌ర‌ణం బ‌లరాం వ‌ర్గం మండిప‌డుతోంది. గత ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్‌పై పోటీ చేసి ఓడిపోయిన కరణం బలరాం వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఎమ్మెల్సీ ఇచ్చినా శాంతించ‌క పోవ‌డంతో పాటు.. గొట్టిపాటి పార్టీ కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఆయనపై దాడికి ప్రయత్నించడం సంచలనం సృష్టించాయి.

గొట్టిపాటి మాత్రం…..

అయితే బ‌ల‌రాం ఎంత క‌వ్వించినా.. ర‌వి మాత్రం త‌న‌ప‌ని తాను చేసుకుంటూ సంయ‌మ‌నం పాటిస్తూ వ‌స్తున్నారు. అంతేగాక అధినేత చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. వారు బ‌ల‌రాంను ఎంత కంట్రోల్ చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా.. త‌న పంథా మాత్రం మార్చుకోవ‌ట్లేదు. ఒకానొక సంద‌ర్భంలో.. `బాబుకు నేనే రాజ‌కీయ భిక్ష పెట్టాను` అని కూడా అన్నారు. కానీ వీటిపై చంద్ర‌బాబు ఖండించ‌లేదు. ఇటీవ‌ల ఆయన తీరు మ‌రింత వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. త‌న కుటుంబానికి అద్దంకి సీటు ఇవ్వ‌క‌పోతే అభ్య‌ర్థిని ఓడిస్తామ‌ని బెదిరింపుల‌కు దిగుతు న్నారు. ప‌ర్చూరు, సంతనూత‌ల‌పాడు, ద‌ర్శి, ఒంగోలు త‌దిత‌ర ప్రాంతాల్లో పార్టీ ఎలా గెలుస్తుందో చూస్తామంటూ హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో పార్టీలో త‌మ వ‌ర్గాన్ని పెంచుకుంటూ వెళ్లి.. మూకుమ్మ‌డిగా వైసీపీలో చేరిపోతామనే లీకులు కూడా ఇస్తున్నారు. బ‌ల‌రాం తీరుతో పార్టీకి తీవ్ర నష్టం జ‌రుగుతుంద‌ని క్యాడ‌ర్ ఆందోళ‌న‌కు గుర‌వుతోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో ఇలాంటి వ్య‌హారాల‌కు చెక్ పెట్ట‌క‌పోతే.. పార్టీకి తీవ్ర న‌ష్టం క‌లుగుతుంద‌ని వివ‌రిస్తున్నారు. ఇప్ప‌టికైనా చంద్రబాబు క‌ల‌గ‌జేసుకుని వెంట‌నే ఆయ‌న దూకుడుకు క‌ళ్లెం వేయాల‌ని కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*