క‌ర్ణాట‌క అధికారం ఎవ‌రి ప‌రం..?

దేశంలో ఇప్పుడున్న చ‌ర్చ, ఇప్పుడున్న ఉత్కంఠ బ‌హుశ గ‌తంలో ఎన్నడూ క‌నీ, వినీ కూడా ఎరుగ‌రేమో!!? ద‌క్షిణాది రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు శ‌నివారం ముగిశాయి. సాధార‌ణంగా ఏ రాష్ట్రానికైనా ఐదేళ్లకోసారి ఎన్నిక‌లు కామ‌న్. అయితే, ఇక్కడ మాత్రం చాలా వెరైటీని సంత‌రించుకున్నాయి. దేశ‌వ్యాప్తంగా ప్రధాని మోడీ హ‌వా ప‌డిపోతోంద‌ని, ఆయ‌న తీసుకున్న విధాన ప‌ర‌మైన నిర్ణయాలు ప్రజ‌ల‌ను తీవ్ర ఇక్కట్ల పాల్జేస్తున్నాయ‌ని, సో.. ఇక‌, బీజేపీ క‌మ‌ల వాడిపోవడం ఖాయ‌మ‌నే వార్తలు హ‌ల్ చ‌ల్ చేస్తున్న నేప‌థ్యం దేశంలో కొన‌సాగుతోంది. ప్రధానంగా జీఎస్టీ, మైనార్టీల ప‌ట్ల దాడులు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీల రిజ‌ర్వేష‌న్లను పున‌ర్ నిర్వచించేలా ప్రయ‌త్నాలు.. వంటివి తీవ్ర వ్యతిరేక‌త సృష్టిస్తున్నాయి. ఇక‌, అదేస‌మ‌యంలో క‌ర్ణాట‌క‌లో క‌ల‌బుర్గిలో 2015న జ‌రిగిన దారుణ హ‌త్య.

ప్రకాష్ రాజ్ ప్రచారం…..

గ‌త ఏడాది ప్రముఖ జ‌ర్నలిస్టు గౌరీ లంకేష్‌ను దారుణంగా చంప‌డం, మైనార్టీలపై దాడులు వంటివి బీజేపీని మ‌స‌క బారుస్తాయ‌ని అంతా అనుకున్నారు. ఇప్పటికీ అనుకుంటున్నారు. ఇదిలావుంటే, మోడీకి వ్యతిరేకంగా కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని, నోటికి మైకు అంటించుకుని విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్ చేయ‌ని ప్రచారం లేదు. ఆయ‌న చేయ‌ని కామెంటూ లేదు. ఇక‌, ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ అవినీతి పాల‌న సాగిస్తోంద‌ని, సీఎం సిద్ధరామ‌య్య 10% క‌మీష‌న్ ప్రభుత్వాన్ని న‌డుపుతున్నార‌ని, ఆయ‌న పాల‌న‌లో శాంతి లోపించింద‌ని సాక్షాత్తూ ప్రధాని న‌రేంద్ర మోడీనే ఆరోపించారు. ఇక‌, కాంగ్రెస్ అధినేత రాహుల్ కూడా యడ్యూరప్పపై ఇదే త‌ర‌హా ప్రచారం చేశారు. దీనికితోడు మ‌రో ఏడాదిలోనే దేశంలో ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు ప్రాధాన్యం ఏర్పడింది.

దక్షిణాది రాష్ట్రాలతో……

ఇక‌, మిగిలిన ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోల్చుకుంటే క‌ర్ణాట‌క‌లో ప్రాంతీయ పార్టీలు ప‌ట్టుకోల్పోయాయి. ముఖ్యంగా గ‌తంలో తిరుగులేద‌ని భావించిన దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌.. స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప‌రిస్థితిలో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌-బీజేపీల మ‌ద్యే ప్రధాన పోటీ నెల‌కొంది. ఇక‌, ఇపుడు ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు కూడా విడుద‌ల‌య్యాయి. సాధార‌ణంగా దేశంలో జ‌ర‌గిన అన్ని ఎన్నిక‌ల్లోనూ ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు నిజ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో వీటిపైనా చ‌ర్చ సాగుతోంది. ప్రస్తుతం బీజేపీ వైపే మెజార్టీ ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు మొగ్గు చూపుతున్నాయి.

ఏపార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ…..

అయితే ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ వ‌చ్చే అవ‌కాశం మాత్రం క‌నిపించ‌డం లేదు. కానీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన రేంజ్‌లో మాత్రం బీజేపీకి మెజారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే, ఈ క్రమంలోనే ఇండిపెండెంట్లను మ‌చ్చిక చేసుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే.. ఇండిపెండెంట్లు క‌లిసినా ప్రయోజ‌నం ఉండే అవ‌కాశం లేదు. పోనీ.. జేడీఎస్ క‌లిస్తే.. అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌వ‌చ్చు. కానీ, ఇది సాధ్యమ‌య్యేలా లేదు. దీంతో ఇప్పుడు క‌ర్ణాట‌క రాజ‌కీయాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమవుతాయని కూడా భావించలేం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*