కమలం కర్ణాటక ఆపరేషన్ షురూ….!

కర్ణాటకలో మిషన్ కమలం ప్రారంభమయింది. ఫార్ములా 20 పేరిట కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేక ప్రణాళికను కమలం పార్టీ రూపొందించనున్నారు. కర్ణాటకలో కమల వికాసానికి తీసుకోవాల్సిన చర్యల గురించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజుల పాటు కర్ణాటక బీజేపీ నేతలతో చర్చించనున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 20 సీట్లు గెలుపు లక్ష్యంగా పనిచేయాలని నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక ఒక్కటే కమలం పార్టీకి పట్టున్న రాష్ట్రం. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదు. అందుకోసమే వీలయినన్ని సీట్లు కర్ణాటక నుంచే గెలవాలన్నది పార్టీ కేంద్ర నాయకత్వం లక్ష్యంగా కన్పిస్తోంది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల సహకారం తీసుకోవాలన్నది వారి ఆలోచన.

దక్షిణాది రాష్ట్రాల్లో……

అందుకోసమే కర్ణాటక రాష్ట్రంపై అమిత్ షా ప్రధాన దృష్టి పెట్టారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సయితం బీజేపీ కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరరించింది. అధికారానికి కేవలం 8 సీట్ల దూరంలో ఆగిపోయింది. కాంగ్రెస్, జేడీఎస్ లు కలసి అధికారంలోకి వచ్చాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ లు కలసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సీట్ల పంపకంపై ఆ రెండు పార్టీల మధ్య తేడాలొస్తాయని కమలం పార్టీ గట్టిగా నమ్మకం పెట్టుకుంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన చోట జేడీఎస్, జేడీఎస్ పోటీ చేసిన చోట కాంగ్రెస్ నేతలు,క్యాడర్ కలసి పనిచేయరన్న విశ్వాసంతో కమలం పార్టీ ఉంది.

వడపోత పూర్తయింది……

కాంగ్రెస్, జేడీఎస్ ల సంగతి పక్కన పెడితే వచ్చే లోక్ సభ ఎన్నికలపై కమలం పార్టీ అభ్యర్థుల వడపోతను ప్రారంభించింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని ఇప్పటికే రాష్ట్ర నేతలను ఆదేశించింది. ఈ మేరకు ముగ్గురు రాష్ట్ర నేతలతో కమిటీని రూపొందించారు. యడ్యూరప్ప, ఈశ్వరప్ప, జగదీశ్ శెట్టర్ లతో నియమించిన కమిటీ ఇప్పటికే వివిధ వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. జేడీఎస్ ఏ స్థానంలో నుంచి పోటీ చేసే అవకాశముంది? కాంగ్రెస్ పోటీ చేసే చోట అభ్యర్థుల ఎవరు? అనేది ఇప్పటికే ఒక జాబితాను వీరు రూపొందించారు. ఈ జాబితాను కేంద్ర పార్టీ నాయకత్వం ఆమోదించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం పడిపోతే……

మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ లలో మొదలయిన ములసం పై కూడా అమిత్ షాతో ఈరోజు కర్ణాటక నేతలు చర్చించనున్నారు. లోక్ సభ ఎన్నికల వరకూ సంకీర్ణ ప్రభుత్వం ఏమీ కాకపోవచ్చని ముందుగా అనుకున్నప్పటికీ, బెళగావి ప్రాంతంలో కాంగ్రెస్ నేతల మధ్య తలెత్తిన విభేదాలు తమకు కలసి వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నేతలు తమకు టచ్ లో ఉన్నారని, ప్రభుత్వం కూలిపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయడంపైనా అమిత్ షా నుంచి యడ్యూరప్ప బ్యాచ్ ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తనంతట తాను పడిపోతే ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసినా ఆ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడదని కర్ణాటక బీజేపీ నేతలు భావిస్తున్నారు. అయితే ఇందుకు కేంద్ర నాయకత్వం మాత్రం ఓకే చెప్పాల్సి ఉంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*