ఔను ..ఓకే అన్నారు….కానీ….?

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. వచ్చే నెల 10వ తేదీన మంత్రి వర్గ విస్తరణ చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ కర్ణాటక నేతలకు సూచించింది. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రివర్గంలో ఉన్న జాబితాను అధిష్టానం పెద్దలు పరిశీలిస్తున్నారు. జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశముంది. ఢిల్లీలో మరో మారు హైకమాండ్ కర్ణాటక మంత్రి వర్గ విస్తరణపై ఆ పార్టీ రాష్ట్ర నేతలతో చర్చించాలని నిర్ణయించింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, కర్ణాటక ఇన్ ఛార్జి వేణుగోపాల్ లను ఢిల్లీకి పిలిపించే అవకాశముంది. ఎవరికి పదవులు ఇవ్వాలి? సామాజిక సమీకరణలు, మంత్రి వర్గ విస్తరణ తర్వాత కూడా అసంతృప్తి తలెత్తే అవకాశముందా? అన్న దానిపై చర్చలు జరపనున్నారు.

జేడీఎస్ కు కూడా…..

ఈ మంత్రివర్గ విస్తరణలో జేడీఎస్ కు కూడా చోటు కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ కు నాలుగు, జేడీఎస్ కు చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనతాదళ్ ఎస్ ను కూడా ప్రతి అంశంలో కలుపుకుని వెళ్లాలన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా ఉంది. అందుకోసమే నిన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ వరకే పరిమితమవుతుందనుకున్న మంత్రి వర్గ విస్తరణలో జేడీఎస్ కు కూడా స్థానంకల్పించారంటున్నారు. జేడీఎస్ లోనూ కొందరు పదవులు రాక అసంతృప్తితో ఉండటంతో ఈ ఆలోచన చేసినట్లు కన్పిస్తోంది.

ఇరవై మంది వరకూ ఆశావహులు…

అయితే కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల దక్కలేదని దాదాపు ఇరవై మంది వరకూ అసంతృప్తితో ఉన్నారు. బెళగావి బ్రదర్స్ లో ఒకరికి ఇప్పటికే మంత్రి పదవి ఉండటంతో మరొకరికి ఇవ్వడం సాధ్యం కాదు. ఇక అసమ్మతి నేతల్లో ప్రముఖంగా ఉన్న వారికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశముంది. ఎంబీ పాటిల్ వంటి సీనియర్ నేతలకు చోటు కల్పించాలని భావిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ తరుపున నలుగురు లేదా ఆరుగురికి మించి మంత్రివర్గంలో స్థానం దక్కదు. అయితే మిగిలిన వారి సంగతేంటన్న చర్చ జరుగుతోంది. మిగిలిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది.

దక్కని వారిని……

మంత్రివర్గ విస్తరణ వచ్చే నెల 10వ తేదీన జరగుతుందని తెలియడంతో ఆశావహులు హస్తిన బయలుదేరే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కూడా కొందరు సిఫార్సు చేయించుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ సిద్ధరామయ్యకు హైకమాండ్ విలువ ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. లోక్ సభ ఎన్నికల బాధ్యతను సిద్ధరామయ్యకే దాదాపు అప్పగించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నుంచి ప్రచారం వరకూ అంతా సిద్ధరామయ్య దగ్గరుండి చూసుకోవాలని పార్టీ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య చెబితే హైకమాండ్ వింటుందన్న ఆశతో ఆయన వద్దకు ఆశావహులు క్యూ కట్టారు. మరి మంత్రి వర్గ విస్తరణ జరిగిన తర్వాత మిగిలిన వారి పరిస్థితి ఏంటన్నది చూడాల్సి ఉంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*