మళ్లీ…మళ్లీ…వాయిదాలతోనేనా?

కర్ణాటక కాంగ్రెస్ నేతల ఆశలు మళ్లీ నీరుగారిపోయాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణ మళ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో పార్టీ అధిష్టానం మంత్రివర్గ విస్తరణపై పునరాలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని హస్తిన నుంచి కబురు వచ్చిందని తెలియడంతో కాంగ్రెస్ నేతలు డీలాలో పడ్డారు. ముఖ్యంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణ ఈ నెల 10 లేదా 12వ తేదీన జరగాల్సి ఉంది. ఈ మేరకు ముహూర్తం కూడా నిర్ణయించారు. ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు.

ఉప ఎన్నికలను సాకుగా చూపి…..

మంత్రివర్గ విస్తరణ కు సంబంధించి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య న్యూఢిల్లీ వెళ్లివచ్చారు. సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావులు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి జాబితాను రూపొందించి హైకమాండ్ కు పంపారు. హైకమాండ్ రేపో, మాపో జాబితాను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఈదశలోనే మూడు పార్లమెంటు స్థానాలకు, రెండు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. బళ్లారి, శివమొగ్గ, మాండ్య పార్లమెంటు స్థానాలతో పాటు రామగిరి, జమఖండి అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్ విడదలకానుంది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

పెదవి విప్పని నేతలు……

డిల్లీ తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావులు మంత్రివర్గ విస్తరణపై పెదవి విప్పకవపోవడం దీనిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే విస్తరణకు, ఎన్నికల కోడ్ కు సంబంధం లేదని కొందరు వాదిస్తున్నారు. సాధారణంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చని ఆశావహులు అంటున్నారు. కానీ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపడితే అసంతృప్తులు పెరిగిపోయి ఆ ప్రభావం ఉప ఎన్నికలపై పడుతుందని కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన చెంది వెనక్కు తగ్గిందంటున్నారు.

అసంతృప్తుల్లో అసహనం……

అయితే మంత్రివర్గ విస్తరణ వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతుండటంతో అసంతృప్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నవంబరు 3న కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 3వ తేదీ అంటే దాదాపు నెల రోజులు ఆశావహులు వేచి చూడాల్సిన పరిస్థితి. కావాలనే కొందరు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తరచూ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయిస్తూ వస్తున్నారంటున్నారు. సీనియర్ నేత బిసిపాటిల్ తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. ఆయన సిద్ధరామయ్య, దినేష్ గుండూరావులను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇలా ఊరుకుంటే రాష్ట్ర నేతలు తమపై పెత్తనం చేస్తారని, తాడోపేడో తేల్చుకోవాలంటే ఢిల్లీ వెళ్లడమే మార్గమని కొందరు అసమ్మతి నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 6 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. అయితే దీనిపై దాదాపు పదిహేను మందికిపైగానే ఆశలు పెట్టుకున్నారు. వీరి ఆశలన్నీ ఉప ఎన్నికల పేరుతో నీరుగారి పోయేలా ఉన్నాయి. విస్తరణ ఉపఎన్నికల తర్వాతేనని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*