ఫార్ములా పనిచేయడంలేదే….?

కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్ కొత్త ఫార్ములా పార్టీలో మరోసారి చిచ్చుపెట్టేలా ఉంది. కాంగ్రెస్ ఫార్ములా ప్రకారం ప్రతి రెండేళ్ల కొకసారి మంత్రులను మారుస్తారు. ఈ ప్రకారం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లందరికీ దాదాపు మంత్రి పదవులు దక్కుతాయి. అయితే ఈ ఫార్ములాకు కూడా కొందరు సీనియర్ నేతలు అంగీకరించడం లేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం వెనక్కు తగ్గింది. రెండేళ్లకొకసారి శాఖలను మాత్రమే మారుస్తామని, మంత్రివర్గం నుంచి తప్పించమని నచ్చచెబుతోంది. కాని అసమ్మతి జోరు మాత్రం తగ్గలేదు. అదే ఫార్ములా అమలుపర్చేపనైతే ముఖ్యమంత్రికి కూడా అమలుపర్చాలన్న డిమాండ్ కూడా విన్పిస్తోంది.

పాటిల్ తగ్గడం లేదు…..

ఇప్పటికే అసమ్మతి నేత ఎంబీ పాటిల్ ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో కలసి చర్చించి వచ్చారు. అయితే చర్చలు ఫలప్రదం కాలేదని తెలుస్తోంది. అహ్మద్ పటేల్ వంటి సీనియర్ నేతలు నచ్చ జెప్పినా పాటిల్ ససేమిరా అంటున్నారు. తనకు ఉపముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. పాటిల్ శిబిరంలో దాదాపు పది మంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఉండటంతో సీనియర్ నేతలు కూడా ఆయన నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రేపు పాటిల్ తన వర్గ ఎమ్మెల్యేలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.

మండే…..మంట రేపుతుందా….?

మరోవైపు సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు బస్వరాజు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి నలభై మంది శాసనసభ్యులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా. దీంతో కాంగ్రెస్ నేతలు సోమవారం అంటేనే భయపడిపోతున్నారు. అసమ్మతి రోజురోజుకూ పెరిగిపోతుండటంతో వారిని చల్లార్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

పదవుల కేటాయింపులోనూ…..

ఇక ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కూడా అసంతృప్తి బయటపడటం కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. జేడీఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య మంత్రి పదవుల చిచ్చు రేపింది. డీకే శివకుమార్ విద్యుత్తు శాఖను కోరుకున్నారు. అయితే ఆయనకు నీటిపారుదల శాఖ ఇచ్చారు. విద్యుత్తు శాఖను కుమారస్వామి తన సోదరుడు రేవణ్ణ కూడా విద్యుత్తు శాఖ కోసం పట్టుబడుతున్నారు. జేడీఎస్ కు కీలకమైన మంత్రి పదవులు దక్కాయని కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తిలో ఉన్నారు. మొత్తం మీద కర్ణాటకలో రోజురోజుకూ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ సర్కార్ ఎక్కువ కాలం మనుగడ సాగించడం కష్టమేననిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*