కన్నడ కాంగ్రెస్ కొత్త చిట్కా….?

కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల వరకూ మంత్రివర్గ విస్తరణ జరపకూడదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కన్నడ నాట సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయిన సంగతి తెలిసిందే. జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా ముఖ్యమంత్రి పదవిని కుమారస్వామికి అప్పగించారు. ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పరమేశ్వరకు కట్టబెట్టారు. మంత్రి పదవుల్లోనూ కాంగ్రెస్ కే అత్యధిక స్థానాలు దక్కాయి. ప్రధాన శాఖలపై కూడా కాంగ్రెస్ పార్టీ పెత్తనమే ఉంది. మరో ఆరు వరకూ మంత్రి పదవులు భర్తీ చేయవచ్చు. కాని ఆషాఢం వెళ్లాక భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కుమారస్వామి భావించారు.

పోటీలో దాదాపు 20 మంది….

కాని ఆరు మంత్రి పదవుల కోసం దాదాపు 20 మంది పోటీ పడుతున్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టినా అసంతృప్తులు మాత్రం చల్లారవన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకోసమే కాంగ్రెస్ అధిష్టానం లోక్ సభ ఎన్నికల వరకూ విస్తరణ జరగపకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక కాంగ్రెస్ లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. విస్తరణ పై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా కొందరు కలసి ఆరా తీశారు. అయితే విస్తరణ ఇప్పట్లో ఉంటుందని తాను అనుకోవడం లేదని ఆయన ముఖానే చెప్పడంతో అసంతృప్త నేతలు తలలు పట్టుకుని వెళ్లారట.

నేతలు చేజారిపోకుండా…..

ఇదిలా ఉండగా అసంతృప్త నేతలు చేజారిపోకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ బాధ్యతను పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావుతో పాటు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, డీకే శివకుమార్ లకు అప్పగించారు. వీరు అసంతృప్త నేతల వద్దకు వెళ్లి వారి సమస్యను వినడమే కాకుండా తగిన హామీ కూడా ఇచ్చే విధంగా ప్లాన్ చేశారని చెబుతున్నారు. తొలుత స్థానిక సంస్థలు, తర్వాత లోక్ సభ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి గెలిపించుకుని వచ్చిన వారికే మంత్రిపదవి దక్కుతుందన్న ప్రచారం కూడా పార్టీలో జరుగుతోంది.

బుజ్జగించేందుకు పదవులు…..

ఈ నేపథ్యంలో అసంతృప్తితో రగలి పోతున్న పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంబీ పాటిల్ ను పార్టీ నేతలు తొలుత సముదాయించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎంబీ పాటిల్ తనకు మంత్రి పదవి దక్కలేదన్న కారణంతో కొంతకారణంగాదూరంగా ఉంటూ వస్తున్నారు. అసమ్మతి స్వరాన్ని విన్పిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకూ ఆయన దూరంగా ఉంటూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎంబీ పాటిల్ సోదరుడు అనిల్ పాటిల్ కు స్థానిక సంస్థల విధాన పరిషత్ అభ్యర్థిగా ప్రకటించాలని నిర్ణయించారు. గత ఎన్నికల ముందు వరకూ ఎంబీ పాటిల్ విధాన పరిషత్ సభ్యుడిగా ఉండే వారు. అయితే విధానసభ ఎన్నికల్లో ఎంబీ పాటిల్ గెలవడంతో దానికి ఆయన రాజీనామా చేశారు. దీంతో స్థానిక సంస్థల విధాన పరిషత్ ఉప ఎన్నికలో పాటిల్ సోదరుడికి అవకాశమివ్వాలని, తద్వారా ఎంబీ పాటిల్ అసమ్మతిని కొంతవరకూ తగ్గించవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరి ఈ చిట్కా ఎంతవరకూ పనిచేస్తుందో చూడాలి మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*