వారసులొస్తేనే గెలుపు సాధ్యమా?

భారత రాజకీయాల్లో వారసత్వం విస్మరించలేని విషయం. అంత తేలిగ్గా తోసిపుచ్చలేని అంశం కూడా. ఒకటి రెండు మినహా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల అధిపతులు ఆయా కుటుంబాల నుంచే వస్తున్నారు తప్ప ప్రజల్లో నుంచి రాకపోవడం ఇందుకు నిదర్శనం. పార్టీల అధినేతల పరిస్థితే అలా ఉన్నప్పుడుఅసెంబ్లీ స్థాయిలో వారసుల పోటీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (ఎస్), తదితర ప్రధాన పార్టీలు సైతం వారసులకు టిక్కెట్లు ఇచ్చి తలనొప్పిని తగ్గించుకున్నాయి. రాష్ట్రంలోఎక్కడ చూసినా సీనియర్ నాయకుల కూతుళ్లు, కుమారులు, ఇతర బంధువులు బరిలో హోరాహోరీగా పోరాడుతున్నారు.

కాంగ్రెస్ లోనే ఎక్కువగా……

వారసుల హోరు అన్ని పార్టీల్లో కన్నాఅధికార కాంగ్రెస్ లో ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచే ఇది మొదలయింది. కుమారుడి కోసం తన సొంత నియోజకవర్గాన్నే ఆయన వదులుకున్నారు. సొంత నియోజకవర్గమైన వరుణలో కుమారుడు యతీంద్రను బరిలోకి దించడం ద్వారా వారసత్వానికి తెరలేపారు. బీజేపీ నేత యడ్యూరప్ప తనకుమారుడు రాఘవేంద్రకు టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అధిష్టానం అంగీకరించలేదు. హోంమంత్రి రామలింగారెడ్డి తాను బెంగళూరు నగరంలోని బీటీ లే అవుట్ నుంచి పోటీ చేస్తుండటంతో పాటు తన కూతురు సౌమ్యరెడ్డి రాజకీయ అరంగేట్రానికి పునాదులు వేశారు. ఆమె బెంగళూరు నగరంలోని జయనగర నుంచి పోటీచేస్తున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి విజయకుమార్ రెండురోజుల క్రితం గుండెపోటుతో మరణించడంతో ఈ ఎన్నిక వాయిదా పడింది. రెండేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చిన సౌమ్యారెడ్డి పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. తుమకూరు జిల్లాలోని ‘‘సిర’’ నుంచి పోటీ చేస్తున్న రాష్ట్ర మంత్రి టీబీ జయచంద్ర తన కుమారుడు సంతోష్ జయచంద్రకు టిక్కెట్ ఇప్పించుకున్నారు. సంతోష్ బిక్కనాయకనహళ్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు అహర్నిశలూ పోరాడుతున్నారు.

మాజీ సీఎం కుమారుడు సయితం……

దావణగెరె ఉత్తర, దక్షిణ స్థానాల నుంచి మంత్రి మల్లికార్జున, ఆయన తండ్రి మాజీ మంత్రి శ్యామనూరు శివశంకరప్ప బరిలో ఉన్నారు. గత నాలుగు ఎన్నికల్లో వారు ఇద్దరూ గెలుస్తూ వస్తున్నారు. స్థిరాస్థి వ్యాపారి, గృహనిర్మాణ శాఖ మంత్రి ఎం.కిష్టప్ప, ఆయన తనయుడు ప్రియా కృష్ణ బెంగళూరు నగరంలోని విజయనగర, గోవిందరాజనగర లనుంచి పోటీ చేస్తున్నారు. లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కలబురగి జిల్లాలోని చితాపుర్ నుంచి ఎన్నికయ్యేందుకు పోరాడుతున్నారు. కలబురగి గ్రామీణ ఎమ్మెల్యే రామకృష్ణ కు అనారోగ్యం కారణంగా ఆయన వారసుడు విజయకుమార్ ను బరిలోకి దింపారు. ఇదే జిల్లాలోని జేవర్గి స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి దివంగత ధరమ్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్ బరిలో ఉన్నారు. చిక్కోడి లోక్ సభ సభ్యుడు ప్రకాశ్ హుక్కేరి కుమారుడు గణేష్ హుక్కేరి విజయం కోసం పోరాడుతున్నారు. ఆంధ్రపద్రేశ్ సరిహద్దుల్లోని కోలార్ లోక్ సభ సభ్యుడు కె.హెచ్. మునియప్ప కుమార్తె రూపా శశిధర్ కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) నుంచి పోటీచేస్తున్నారు. 2013లోనూ పోటీచేసిన రూపా శశిధర్ బీజేపీ అభ్యర్థి రామక్క చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి ఆమె తనయుడు సంపంగి బరిలో ఉన్నారు. గత నాలుగు దశాబ్దాల నుంచి కాంగ్రెస్ ఇక్కడ గెలవడం లేదు. అదే సయమంలో కె.హెచ్. మునియప్ప ఏడుసార్ల నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వస్తున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు కూడా తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకోలేక పోవడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ తన పుత్రుడు హర్ష మొయిలీకి టిక్కెట్ తెప్పించడంలో విఫలమయ్యారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ మార్గరెట్ ఆల్వా సైతం తన కుమారుడు నివేదిత ఆల్వాకు టిక్కెట్ సాధించ లేకపోయారు. రాజ్యసభ మాజీ డిప్యూటీ ఛైర్మన్ రహమాన్ ఖాన్ తన తనయుడు మన్సూర్ ఆలీఖాన్ కు టిక్కెట్ ఇప్పించలేక పోయారు. మంత్రి మహదేవప్ప తన కుమారుడు సునీల్ బోస్ కు కూడా టిక్కెట్ దక్కించుకోవడంలో విఫలమయ్యారు.

బీజేపీ కూడా తగ్గలేదు….

భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయ వారసులకు టిక్కెట్లు ఇవ్వడంలో వెనుకబడి లేదు. శశికళ జొల్లె, అన్నా సాహెబ్ జొల్లె దంపతులకు నిప్పానీ, చిక్కోడి సద్గల స్థానాలను కేటాయించింది. గాలి జనార్థన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డికి బళ్లారి నగర టిక్కెట్ ను పార్టీ కేటాయించింది. మరోసోదరుడు కరుణాకర్ రెడ్డికి సైతం స్థానాన్ని కేటాయించింది. పార్టీలో పట్టున్న గాలిజనార్ధన్ రెడ్డి అనుచరుడైన బి. శ్రీరాములు మొలకలూరు నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీరాములు మామ సన్న ఫకీరప్పకు బళ్లారి రూరల్ టిక్కెట్ ఇచ్చారు. శ్రీరాములు కొడుకు సురేష్ బాబుకు కంప్లి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు.

దేవెగౌడది షరా మామూలే…….

దేవెగౌడ కుటుంబ పార్టీగా ముద్రపడిన జనతాదళ్ (ఎస్) ఈ విషయంలోనూ ఏమీ వెనుకబడిలేదు. మొదటి నుంచీ దేవెగౌడకు బంధుప్రీతి ఎక్కువన్న పేరుంది. కుమారుడు కుమారస్వామి బెంగళూరు శివార్లలోని రామనగర, చెన్నపట్టణ నుంచి పోటీ చేస్తున్నారు. సిద్ధరామయ్య మాదిరిగా కుమారస్వామి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండటం విశేషం. టిక్కెట్ల కేటాయింపులో జేడీఎస్ లో తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. దేవెగౌడ కుమారులు కుమారస్వామి, రేవన్నలతో పాటు వారి భార్యలు అనిత, భవానీలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించినా వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వలేదు. గౌడ మనుమళ్లు ప్రజ్వల్, నిఖిల్ తదితరులు సైతం టిక్కెట్లకోసం పోటీ పడ్డారు. కానీ కుటుంబం నుంచి ఇద్దరే ఇద్దరు కుమారస్వామి, రేవన్న మాత్రమే పోటీ చేస్తారని దేవెగౌడ ప్రకటించారు. చివరికి రేవణ్న కుమారుడు ప్రకాశ్ హసన్ నుంచి పోటీ చేస్తున్నారు. కుమారస్వామి రెండు చోట్ల నుంచి బరిలో ఉన్నారు. ఇలా రాజకీయ వారసులను బరిలోకి దించడం ద్వారా అన్ని పార్టీలూ కుటుంబాల వలలో చిక్కుకుపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కుబుంబాలను కాదని పార్టీలను మనుగడ సాగించడం కష్టమే మరి….!

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*