కన్నడ యుద్ధం నేడే

కర్ణాటక అసెంబ్లీకి నేడు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 222 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కన్నడ ఓటర్ల తీర్పు ఎవరి వైపు ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కర్ణాటకలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు హోరాహోరీ తలపడ్డాయి. ప్రచారంలోనూ నువ్వా? నేనా? అన్న రీతిలో ముందుకు సాగాయి. జాతీయ స్థాయి నేతలందరూ కన్నడనాట కాలుమోపి మరీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. తాము అధికారంలోకి వస్తే చేసేదేంటో చెబుతూనే, ప్రత్యర్థి పార్టీపై కూడా ఆరోపణలను గుప్పిస్తూ ప్రచారాన్ని సాగించారు.

కాంగ్రెస్ దూకుడుగా…..

అధికార కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముందునుంచి దూకుడుగానే ఉంది. ప్రభుత్వంలో ఉండటంతో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఇందిర క్యాంటిన్లు ఎన్నికలకు ఏడాది ముందే ఇక్కడ ప్రారంభించడం విశేషం. అలాగే లింగాయత్ లకు మైనారిటీ హోదా కల్పించాలని కోరుతూ తీర్మానం చేసి ఆమోదం కోసం పంపడం కూడా ఎన్నికల మహిమే. రాహుల్ గాంధీ రోడ్ షోలు, మఠాల సందర్శనతో ఆకట్టుకున్నారు. మోడీపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తూ రాహుల్ ముందుకు సాగారు. యడ్యూరప్పపై గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలను కన్నడ ప్రజలకు గుర్తుకు తెచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్రమంత్రలు సయితం ప్రచారంలో పాల్గొన్నారు.

కమలం పుంజుకుని…..

ఇక బీజేపీ కూడా ప్రచారంలో ఏ మాత్రం వెనుకబడి లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 20 రోజులు అక్కడే మకాం వేసి మరీ వ్యూహాలను రచించారు. అమిత్ షారోడ్ షోలకు విపరీతమైన స్పందన వచ్చింది. ఇక ప్రధాని నరేంద్రమోడీ చివరి నాలుగురోజుల ప్రచారం పార్టీకి మంచి హైప్ తెచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ రాహుల్ ప్రధాని పదవికి అనర్హుడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోనియా ఇటాలియన్ అంటూ కఠినమైన కామెంట్స్ చేశారు. గాలి జనార్థన్ రెడ్డి అనుచరులకు సీట్లు కేటాయించి బళ్లారి ప్రాంతంలో బీజేపీ పట్టు పెంచుకునే ప్రయత్నం చేసింది.

జనతాదళ్ కన్నేసి…..

ఇక కన్నడనాట ప్రాంతీయ పార్టీ అయిన జనతాదళ్ ఎస్ కూడా ప్రచారంలో ముందుంది. దేవెగౌడ బ్యాక్ సపోర్ట్ తో కుమారస్వామి నియోజకవర్గాలన్నీ చుట్టి వచ్చారు. ప్రీపోల్ సర్వేల్లోనూ జనతాదళ్ ఎస్ కింగ్ మేకర్ గా నిలుస్తుందన్న ఫలితాలు రావడంతో రెట్టించిన ఉత్సాహంతో కుమారస్వామి ప్రచారాన్ని నిర్వహించారు. లోకల్ పార్టీకి మద్దతు తెలపాలని ప్రజల్లో సెంటిమెంట్ ను రాజేశారు. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్, బీజేపీలు ఎన్నికల మ్యానిఫేస్టోలో ప్రజలపై వరాల జల్లు కురిపించాయి. మొత్తం మీద కన్నడ ప్రజలుమరికాసేపట్లో తమ తీర్పును చెప్పబోతున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కీలకంగా మారనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*