తెలుగు ఓట్లు…. ఎన్ని పాట్లు…?

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో తెలుగురాష్ట్రాలకు చెందిన నేతలు దూకుడుగా వెళుతున్నారు. తెలుగు ఓటర్లున్న ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన తెలుగు రాష్ట్రాల నేతలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. తెలుగు ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంగానే వారు ముందుకెళుతున్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడి వారిని తమ పార్టీ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర ఎన్నికలు ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి. గత కొద్దిరోజులుగా కర్ణాటకలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలను రెండు పార్టీలూ బాధ్యులుగా నియమించాయి.

పురంద్రీశ్వరి ప్రచారం….

ఎంపిక చేసిన కొన్ని నియోజకవర్గాలను వారికి కట్టబెట్టాయి. బీజేపీలో ఇప్పటికే తెలంగాణకు చెందిన మురళీధరరావు పార్టీ రాష్ట్ర వ్యవహారాలను చూస్తున్నారు. ఆయనతో పాటు మాజీ కేంద్రమంత్రి పురంధ్రీశ్వరి తెలుగు వారుండే క్యాంప్ ల్లో పర్యటిస్తున్నారు. పురంద్రీశ్వరి ఆ క్యాంప్ పెద్దలతో గెస్ట్ హౌస్ లలో సమావేశమై బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం న్యాయం చేస్తామని చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రత్యేక హోదా తప్పించి అన్ని హామీలు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ ఉందని ఆమె చెబుతున్నారు.

కాంగ్రెస్ తరుపున….

ఇక కాంగ్రెస్ తరుపున తెలంగాణకు చెందిన మధు యాష్కీగౌడ్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాకే శైలజానాధ్ గత కొద్దినెలలుగా అక్కడే తిష్టవేశారు. తెలుగువారుండే ప్రాంతాల్లో పర్యటిస్తూ వారి నాడిని తెలుసుకుని ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు అందిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని వారు వివరిస్తున్నారు. కాంగ్రెస్ తరుపున కనుమూరిబాపిరాజు, నాదెండ్ల మనోహర్ తదితరులు రంగంలోకి దిగారు. వారు ఎక్కువగా గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ కు ఓటువేయాలని అభ్యర్థిస్తున్నారు.

నైట్ మీటింగ్ లతో….

తెలుగువారు ఎక్కువగా ఉండే బళ్లారి సిటీ, బళ్లారి రూరల్, గంగావతి, హోస్ పెట్, రాయచూరు, సింధనూరు, సిరుగుప్ప, కంప్లి తదితర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాల్లోనే ఎక్కువగా తెలుగు ఓటర్లు ఉండటంతో వారు అక్కడే తిష్టవేసి ప్రచారంతో పాటు నైట్ మీటింగ్ లు జరుపుతున్నారు. నాదెండ్ల మనోహర్, శైలజానాధ్ ఏపీకి చెందిన వారు ఉన్న చోట ఎక్కువగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు వారి ఓట్లు కీలకం కావడంతో రెండు పార్టీలూ వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలను రంగంలోకి దించాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*