కన్నడిగులు ఎవరికి జై కొడతారు…?

ఉప ఎన్నికలు ముగిశాయి. ఇక ఓటరు తీర్పు తేలాల్సి ఉంది. అయితే ఏ పక్షానికి విజయంపై ధీమాగా లేదు. ప్రధానంగా శివమొగ్గ, బళ్లారి పార్లమెంటు నియోజకవర్గాలపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక్కడ హోరాహోరీ పోరు జరిగింది. కర్ణాటకలో శివమొగ్గ, మాండ్య, బళ్లారి పార్లమెంటు స్థానాలకు, రామనగర, జమఖండి అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలపైనే సంకీర్ణ ప్రభుత్వ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలను బట్టే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలున్నాయి.

నువ్వా…నేనా….?

శివమొగ్గ పార్లమెంటు స్థానంలో నువ్వా? నేనా? అన్నట్లు పోటీ జరిగింది. ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప తనయుడు రాఘవేంద్ర పోటీ చేయగా, మాజీ ముఖ్యమంత్రి మధు బంగారప్ప జనతాదళ్ ఎస్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇక్కడ మధు బంగారప్పకు బాగానే ప్రచారం చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ ఇక్కడే దాదాపుగా మకాం వేశారు. అయితే ఇది యడ్యూరప్ప సొంత నియోజకవర్గం కావడం, తన సామాజిక వర్గం ఓటర్ల పట్టు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ తమకు డౌట్ లేదన్నది బీజేపీ అభిప్రాయం. అయితే కాంగ్రెస్, జేడీెఎస్ ల కలయికతో తాము సునాయాసంగా విజయం సాధిస్తామని ఇరు పార్టీ నేతలు చెబుతున్నారు.

బళ్లారిలోనూ….

ఇక బళ్లారిలోనూ అంతే. బళ్లారిలో బీజేపీ తరుపున మాజీ ఎంపీ శ్రీరాములు సోదరి శాంత పోటీ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప బరిలో ఉన్నారు. ఉగ్రప్ప మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన అక్కడే ఎక్కువ సమయం ప్రచారాన్ని నిర్వహించారు. గాలి జనార్థన్ రెడ్డి సిద్ధరామయ్య పైన చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా తమకు కలసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరూ పోటీ పడుతుండటంతో ఎవరిది గెలుపు అన్నది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అంటున్నారు.

రెండు అసెంబ్లీ స్థానాలు…..

మాండ్య పార్లమెంటు నియోజకవర్గంలో కూడా గెలుపు ఎవరదనేనది చెప్పటం కష్టమే. మామూలుగా అయితే ఇక్కడ జనతాదళ్ అభ్యర్థికి మాత్రమే విజయావకాశాలు తొలినుంచి కన్పిస్తున్నాయి. అయితే అభ్యర్థి ఎంపిక పట్ల రెండు పార్టీల క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో దేవెగౌడ స్వయంగా రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక రామననగర అసెంబ్లీ స్థానం దాదాపు జేడీఎస్ పక్షమే. ఇక్కడ బీజేపీ అభ్యర్థి చంద్రశేఖర్ బరిలో నుంచి తప్పుకోవడంతో అక్కడ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య అనిత గెలుపు లాంఛనమే అని చెప్పకతప్పదు. జమఖండిలో కూడా సానుభూతి పవనాలు బలంగా వీస్తున్నాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద న్యామగౌడ విజయం తధ్యమన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఓటరు ఎటు వైపు తీర్పు చెబుతారో? ఓటరు నాడి ఎలా ఉందో? అన్న ఉత్కంఠ అన్ని పార్టీల్లో నెలకొని ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*