కన్నడ ఎమ్మెల్యేలకు గెలిచినా ఆనందం లేదా?

వారు ఎమ్మెల్యేగా గెలిచినా సంతోషం లేదు. గెలిచిన ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోలేరు. నియోజకవర్గ ప్రజల విజయోత్సవాల్లో భాగస్వామ్యులు కాలేరు. కర్ణాటకలో జనతాదళ్ (ఎస్), కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈనెల 15వ తేదీన కర్ణాటక ఫలితాలు వెలువడ్డాయి. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జేడీఎస్, కాంగ్రెస్ లు క్యాంపులను నిర్వహిస్తున్నాయి.

వారం రోజుల నుంచి….

తొలుత యడ్యూరప్ప బలపరీక్ష వరకూ క్యాంప్ ఉంటుందని భావించారు ఎమ్మెల్యేలు. కాని యడ్యూరప్ప బలపరీక్షకు దిగకుండానే రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో జేడీఎస్, కాంగ్రెస్ ల నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకాబోతోంది. కుమారస్వామి ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోగా తాను బలాన్ని నిరూపించుకుంటానని కుమారస్వామి చెప్పేశారు. అంటే గురువారం మళ్లీ అసెంబ్లీ సమావేశమై కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోనున్నారు.

ఎమ్మెల్యేలు చేజారి పోకుండా…..

దీంతో ఎమ్మెల్యేలందరూ చేజారి పోకుండా రెండు పార్టీలూ క్యాంప్ లను ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ శాననసభ్యులందరూ మాజీ మంత్రికి చెందిన హిల్టన్ హోటల్ లో బస చేశారు. జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రెస్టేజి రిసార్ట్స్ లో ఉంచారు. ఈ క్యాంపుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండు పార్టీలకు చెందిన శాసనసభ్యలందరూ ఈ నెల 16వ తేదీ నుంచి క్యాంపుల్లోనే ఉన్నారు. ఈ నెల 16న హైదరాబాద్ కు తరలించారు. 17న యడ్యూరప్ప బలపరీక్ష ఎదుర్కొనాలని సుప్రీంకోర్టు సూచించడంతో తిరిగి అదే రాత్రి బెంగుళూరు బయలుదేరి వెళ్లారు.

ఇప్పటికీ రిసార్ట్స్ లోనే….

అప్పటి నుంచి కాంగ్రెస్ కు చెందిన 74 మంది ఎమ్మెల్యేలు, జనతాదళ్ కు చెందిన 36 మంది ఎమ్మెల్యేలు క్యాంపుల్లోనే ఉన్నారు. క్యాంపుల వద్దకు ఎవరినీ రానివ్వడం లేదు. కుటుంబ సభ్యులు వచ్చినా వారు కేవలం కొద్దిసేపు మాత్రమే ఉండాలని గట్టిగా చెబుతున్నారు. గురువారం కుమారస్వామి బలపరీక్ష పూర్తయ్యాకే వీరికి క్యాంపుల నుంచి విముక్తి లభిస్తుంది. కమలం పార్టీ మరోసారి ఆపరేషన్ ప్రారంభిస్తుందన్న సమాచారం తెలియడంతో రెండు పార్టీలు క్యాంపులతో జాగ్రత్తలు తీసుకున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలు వారం రోజుల నుంచి క్యాంపుల్లోనే కాలక్షేపం చేస్తున్నారు. బలపరీక్ష పూర్తయిన తర్వాత వారు నేరుగా నియోజకవర్గాలకు వెళతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద కర్ణాటక ఎమ్మెల్యేలకు గెలిచినా ఆ ఆనందం పంచుకునే వీలులేకుండా పోయిందని వారు కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*