ఏ టర్న్ తీసుకుంటుందో…..?

పార్టీ అగ్రనేతల సమావేశాలు, క్యాంపులు, శాసనసభ్యులతో అత్యవసర మీటింగ్ లు…. ఇదీ కర్ణాటకలో సీన్. కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో చెప్పలేకుండా ఉంది. దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పోయారు. వీరంతా ముంబయి చేరుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న రిసార్ట్స్ లో వీరు బస చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం తమ డిమాండ్లను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోక పోవడమేనంటున్నాయి పార్టీ వర్గాలు.

కారణం హైకమాండేనా?

కర్ణాటక కాంగ్రెస్ లో అసమ్మతి పతాక స్థాయికి చేరుకుంది. మంత్రి వర్గ విస్తరణ జరపకపోవడం, నామినేషన్ పదవులను భర్తీ చేయకపోవడం వంటి అంశాలతో పాటు కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలు అసమ్మతి వాదులు పార్టీపై తిరుగుబాటు చేయడానికి కారణమని చెప్పక తప్పదు. జార్ఖిహోళి బ్రదర్స్ వివాదంలో మంత్రి డికే శివకుమార్ తలదూర్చడం. బెళగావి రాజకీయాల్లో మంత్రుల జోక్యం పెరగడంతోనే అసమ్మతి ఊపందుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ లో కొనసాగినా తమకు భవిష్యత్ లేదని భావించిన నేతలు ముంబయి వైపు వెళ్లిపోయారని చెబుతున్నారు.

ముంబయికి ఎమ్మెల్యేలు…..

ముంబయికి ఎమ్మెల్యేలు విమానంలో వెళుతున్న ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ముఖ్యమంత్రి కుమారస్వామి కాంగ్రెస్ నేతలను అప్రమత్తం చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించి సిద్ధరామయ్య ప్రత్యేకంగా నేతలతో సమావేశమయ్యారు. ముంబయి వెళ్లిన ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినా స్పందన లేదు. మహారాష్ట్రకు వెళ్లకుండా అసంతృప్తితో ఉన్న నేత ఆనంద్ సింగ్ ను ఆయన బుజ్జగించే చర్యలు చేపట్టారు. వరుసగా ఎమ్మెల్యేలు మహారాష్ట్రకు వెళ్లిపోతుండటంతో కంగుతిన్న హస్తం పార్టీ ఈ నెల 23వ తేదీన కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ మెసేజ్ లు వెళ్లాయని చెబుతున్నారు.

క్లాస్ పీకిన దేవెగౌడ…….

అలాగే జనతాదళ్ (ఎస్) కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి, పార్టీ అధినేత దేవెగౌడ ఈ సమావేశానికి హాజరుకావడం గమనార్హం. హాసన్ లో జరిగిన ఈ సమావేశంలో దేవెగౌడ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఫిరాయింపులకు పాల్పడితే ప్రజలు విశ్వసించరని, రాజకీయ భవిష్యత్ కోల్పోతారని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఈ సమావేశానికి కూడా ఎనిమిది మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు గైర్హాజరుకావడం గమనార్హం. మరోవైపు భారతీయ జనతా పార్టీ తమ ఎమ్మెల్యేలను విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరింది. వారం పాటు నగరం విడిచి వెళ్లవద్దని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఎమ్మెల్యేలను ఆదేశించారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో కుదుపులు ఖాయమంటున్నారు విశ్లేషకులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*