రోజు గడిస్తే చాలు….!

సంకీర్ణ ప్రభుత్వం అంటేనే అలా ఉంటుంది కాబోలు… పాలన కన్నా పట్టు సాధించడం కోసమే అధికారంలో ఉన్న పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. సర్వసాధరణమే అయినా తమ కుర్చీని పదిలంగా ఉంచుకోవడం కోసమే సమయమంతా వెచ్చిస్తుండటంతో పాలన గాడి తప్పుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ఐదేళ్ల పాలనకు, ఇప్పటి మూడు నెలల పాలనకు ప్రజలు బేరీజు వేసుకుంటే సమాధానం దొరకక మానదు. కర్ణాటకలో ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో అధికారాన్ని కాపాడుకోవడానికి ఒకరు, దక్కించుకోవడానికి మరొకరు నిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

కునుకుతీయని కమలం పార్టీ…….

కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీకి అధికారం దక్కలేదు. కేవలం మ్యాజిక్ ఫిగర్ కు ఎనిమది సీట్ల తేడాతో పవర్ చేజారిపోయింది. ఇది కమలనాధులకు మింగుడపడటం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తమ చెంతకు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వస్తారని కమలనాధులు ఊహించారు. అందుకే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఆత్మవిశ్వాసంతో ప్రమాణస్వీకారం చేశారు. కానా కాంగ్రెస్, జేడీఎస్ లు క్యాంపులను నిర్వహించి తమ సభ్యులను కాపాడుకోగలిగాయి. దీంతో సభ విశ్వాసాన్ని పొందలేనని భావించిన యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత జేడీఎస్, కాంగ్రెస్ లు కలసి సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశాయి. అయితే మూడు నెలలు గడుస్తున్నా కర్ణాటకలో ప్రభుత్వం కుదుటపడలేదనే చెప్పొచ్చు.

నేరుగా కూల్చకూడదని…..

భారతీయ జనతా పార్టీ మాత్రం నేరుగా ప్రభుత్వాన్ని పడకొట్టకూడదనే ఉద్దేశ్యంతో ఉంది. అందుకే సమయం కోసం కాచుక్కూచుని వేచి చూస్తోంది. లోక్ సభ ఎన్నికల తరుణంలో బీజేపీ వల్ల ప్రభుత్వం పడిపోయిందన్న అపప్రధ రాకుండా ఉండేందుకే ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికల తర్వాత ఆపరేషన్ కమల స్టార్ట్ చేస్తారన్నది ఆ పార్టీ నేతలు అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. యడ్యూరప్ప మాత్రం ఎప్పుడెప్పుడు సర్కార్ కూలిపోతుందా? ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిద్దామా? అని గుళ్లు గోపురాలు, మఠాలు తిరుగుతూనే ఉన్నారు. కేంద్ర నాయకత్వం వారించడంతోనే సర్కార్ కూల్చివేతకు తాత్కాలిక విరామమిచ్చినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ మల్లగుల్లాలు…..

మరోవైపు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న అతి పెద్ద పార్టీ కాంగ్రెస్ చేసిన తప్పులు చేస్తూనే ఉంది. ఎక్కువ మంది గెలవడం, సంకీర్ణ సర్కార్ ఏర్పడటంతో అందరికీ మంత్రి పదవులు ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ ది. మంత్రి వర్గ విస్తరణ ఉంటుందంటూ ఎప్పటికప్పుడు వాయిదాలు వేయడం కూడా అసంతృప్తులకు నచ్చడం లేదు. దీంతో తాడో పేడో తేల్చుకునేందుకు హస్తిన బయలుదేరి వెళ్లారు కాంగ్రెస్ నేతలు. మంత్రి వర్గ విస్తరణ జరిపితే ప్రభుత్వం కుప్ప కూలడం ఖాయమన్న నిఘా నివేదికలు పార్టీ హైకమాండ్ ను ఆందోళకు గురిచేస్తున్నాయి. మలి దశ మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కని వారు ఖచ్చితంగా తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతారని, వైరి వర్గంతో చేతులు కలిపే అవకాశముందని తెలియడంతో కాంగ్రెస్ అధిష్టానం మంత్రివర్గ విస్తరణను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తోంది. కాని కర్ణాటక కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, పరమేశ్వర్ తదితరులు మంత్రివర్గ విస్తరణ జరిపితే పరిస్థితులు కుదుటపడతాయని చెబుతున్నారు. మొత్తం మీద కర్ణాటకలో ప్రతిరోజూ కుర్చీకోసం కొట్లాట ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉండటం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*