కూల్చేస్తారా? కొనసాగనిస్తారా?

కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ కూల్చివేతకు కుట్ర జరుగుతోందా? దీని వెనక బీజేపీ ప్రమేయం ఉందా? కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే ఈడీ దాడులు నేతలపై జరుగుతున్నాయా? లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఐటీ, ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇవి ఎవరో సామాన్య నేతలనుంచి వచ్చిన ప్రశ్నలు కాదు. ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ఉన్న అనుమానాలు. గత కొద్దిరోజులుగా కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కుమారస్వామిని కలవరపెడుతున్నాయి.

కాంగ్రెస్ లో అసమ్మతి…..

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఇటీవలే వందరోజుల పండగ పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వందరోజుల్లోనూ సంకీర్ణ సర్కార్ లో ఏదోఒక అలజడి జరుగుతూనే ఉంది. కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య విభేదాలు తలెత్తుతాయని బీజేపీ ముందు ఊహించింది. విభేదాలు తలెత్తినా కూడా సంకీర్ణ ప్రభుత్వం సజావుగానే సాగుతోంది. అయితే కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి మాత్రం ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంది. ఇప్పటికే కొందరు అసంతృప్త నేతలు బీజేపీతో టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు.

ఇప్పటికే టచ్ లో…..

కర్ణాటకలో బీజేపీకి 104 మంది సభ్యుల బలం ఉంది. మరో ఎనిమిది మంది సభ్యులు వస్తే ప్రభుత్వ కుప్పకూలిపోవడం ఖాయం. అయితే దాదాపు 20 మంది వరకూ కాంగ్రెస్ నుంచి వచ్చేందుకు రెడీ అయిపోయినట్లు బీజేపీ నేతలే ఆఫ్ ది రికార్డులో చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ నేతలు అంత వరకూ వెయిట్ చేసేందుకు ఇష్టపడటం లేదు.

అందుకేనా అవి జరగడం…..

ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన యడ్యూరప్ప ఈ విషయంపై అమిత్ షాతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే అమిత్ షా ఎలాంటి నిర్ణయం చెప్పారో తెలియనప్పటికీ, ఢిల్లీలో బీజేపీ సమావేశంలో యడ్యూరప్ప ఉండగానే కర్ణాటకలో మంత్రి డీకే శివకుమార్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈడీ అధికారులు శివకుమార్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరగడంతో కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు. శివకుమార్ కూడా తనపై రాజకీయ కుట్ర జరుగుతుందని చెబుతున్నారు. గతఏడాది ఆగస్టు నెలలో డీకే శివకుమార్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేసి 8.47 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు సంబంధించి డీకే 40 లక్షలకే ఐటీ రిటర్న్ దాఖలు చేశారని, మిగిలిన మొత్తానికి లెక్కలు చూపలేదని, అందుకే డీకేపై ఎఫ్ఐఆర్ కేసు నమోదయినట్లు ప్రచారం జరిగిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద కర్ణాటకలో త్వరలోనే రాజకీయంగా మార్పులు చోటు చేసుకుంటాయన్న ఊహాగానాలు మాత్రం పెద్దయెత్తున చెలరేగుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*