ఏందీ ఆయన ధీమా?

యడ్యూరప్పకు నిజంగా ఇది అగ్ని పరీక్షే. సుప్రీంకోర్టు తీర్పుతో యడ్డీ కొంత ఇరకాటంలో పడినట్లయింది. తాను చెప్పినట్లుగానే, గవర్నర్ అనుమతితో ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారంచేసిన యడ్యూరప్ప తనకు పూర్తి స్థాయి మద్దతు ఉందనిచెప్పారు. గవర్నర్ పదిహేను రోజులు బలపరీక్షకు గడువు ఇచ్చారు. అయినా యడ్యూరప్ప మాత్రం తనకు అంత సమయం అవసరం లేదని, వారంరోజుల్లోనే తన బలాన్ని నిరూపించుకుంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ లు తమ ఎమ్మెల్యేలు జారి పోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నాయి.

క్యాంపుల్లో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు….

కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ఈరోజు ఉదయమే బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ లోని తాజ్ హోటల్, నోవాటెల్ లో ఈ ఎమ్మెల్యేలు బస చేశారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి 104, కాంగ్రెస్ కు 78, జనతాదళ్ ఎస్ కు 38 మంది సభ్యులు విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ లోని ముగ్గురు శాననసభ్యులు మిస్ అవ్వడంతో వారు బీజేపీకి మద్దతు తెలుపుతారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని కొట్టిపారేస్తుంది. మ్యాజిక్ ఫిగర్ ను దాటే జేడీఎస్, కాంగ్రెస్ బలం ఉందని బలపరీక్షలో తమదే విజయమన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.

సుప్రీంకోర్టును ఆశ్రయించి…..

కాంగ్రెస్ పార్టీ గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కొంత గట్టున పడే పరిస్థితి కన్పిస్తోంది. ఇప్పటి వరకూ బేరసారాలకు పెద్దగా తావులేదు. సమయం లేదు కూడా. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ఇప్పటికే క్యాంపుల్లో ఉంచారు. వారందరినీ రేపు నేరుగా బెంగుళూరులోని విధానసభకు తరలించనున్నారు. బలపరీక్ష సమయానికి బెంగళూరు చేర్చాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ఉంది. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ లలో తామే బలపరీక్షలో నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న విశ్వాసం కనపడుతోంది.

వాళ్లమీదనే ఆశలా?

మరోవైపు యడ్డీ కూడా విశ్వాసంతోనే ఉన్నారు. కుమారస్వామి అంటే గిట్టని కాంగ్రెస్ నేతలున్నారు. ముఖ్యంగా లింగాయత్ లకు కుమారస్వామి అంటే అస్సలు పడదు. దీంతో ఇప్పటికే కాంగ్రెస్ లోని లింగాయత్ ఎమ్మెల్యేలతో యడ్యూరప్ప రహస్య సమావేశం నిర్వహించారని కూడా వార్తలొచ్చాయి. అంతేకాదు కుమారస్వామి ముఖ్యమంత్రి అవుతారంటే తాము అంగీకరించే ప్రసక్తిలేదని కూడా వారు యడ్డీకి మాట ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈకారణంతోనే యడ్యూరప్ప తాను బలపరీక్షలో నెగ్గుతానని ధీమాగా ఉన్నారు. మరి రేపు సాయంత్రం నాలుగు గంటలకు యడ్యూరప్ప భవిష్యత్ ఏంటో తేలిపోనుంది.