బెంగళూరు ఎవరిది….?

బెంగళూరు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఐటీ. భారత సిలికాన్ రాజధానిగా దీనికి పేరుంది. 90వ దశకంలోనే ఐటీ రంగ ప్రవేశంతో నగర రూపురేఖలు మారిపోయాయి. నలుమూలలా వేగంగా విస్తరించింది. 2011 లెక్కల ప్రకారం నగర జనాభా 1.29 కోట్లకు పైగానే. నగరం భారతీయతను తలపిస్తుంది. తమిళులు, తెలుగువారు, మళయాళీలు, ఉత్తర భారతీయులతో బెంగళూరు ఆధునిక భారతావనికి నిదర్శనంగా నిలుస్తోంది. పెరుగుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులకు సమకూర్చడం పాలకులకు అతి పెద్ద సవాల్ గా మారింది.

నగరమే కీలకం….

రాజకీయంగా చూస్తే బెంగళూరు నగరం అన్ని పార్టీలకకు అత్యంత కీలకమైనది. 28 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలు నగర పరిధిలో ఉన్నాయి. నగర పాలకసంస్థకాంగ్రెస్ పరమైంది. 2014 లోక్ సభ ఎన్నికల పరంగా చూస్తే బీజేపీకి గట్టి పట్టుంది. మొదట నుంచి బీజీపీకి ఇక్కడ గట్టి పునాది ఉంది. నాటి ఎన్నికల్లో బెంగళూరు నార్త్, సౌత్, సెంట్రల్ మూడు స్థానాలూ బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. మంచి మెజారిటీలు కూడా లభించాయి. బెంగళూరు నార్త్ నుంచి ప్రస్తుత కేంద్ర మంత్రి సదానందగౌడ రెండు లక్షలకు పైగా మెజారిటీతో ఎన్నికయ్యారు. సెంట్రల్ నుంచి కూడా కమలం పార్టీ అభ్యర్థి పీసీ మోహన్ విజయం సాధించారు. సౌత్ స్థానం నుంచి ప్రస్తుత కేంద్ర మంత్రి అనంతకుమార్ రెండు లక్షలకు పైగా మెజారిటీతో ఎన్నికయ్యారు.

బీజేపీకి పట్టుంది…..

నగరం, నగర శివార్లలో ఉన్న మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను 12 శాతం నియోజకవర్గాలు ఇక్కడే ఉన్నాయి. 1980 నుంచి కాంగ్రెసేతర పార్టీలదే ఇక్కడ పైచేయిగా ఉంది. రామకృష్ణ హెగ్డే, దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్ మొదట్లో నగరంలో పాగా వేసింది. జనతాదళ్ లో కుమ్ములాటల కారణంగా నగరంపై బీజేపీ క్రమంగా పట్టు పెంచుకోసాగింతది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ 16 స్థానాలను సాధించి తన ఆధిక్యాన్నిస్పష్టంగా చాటింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలిచి అధికారాన్ని చేపట్టింది ఆ పార్టీ. హస్తం పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. 2013 ఎన్నికల్లో పరిస్థితి మారింది. కాంగ్రెస్ 13, బీజేపీ 12 సీట్లు గెలుచుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కైవసం చేసుకున్న 40 స్థానాల్లో 12 నగర పరిధిలోనివే కావడం గమనించదగ్గ అంశం. 2014 లోక్ సభ ఎన్నికల్లనూ మొత్తం మూడు లోక్ సభ స్థానాలను గెలుచుకుని బీజేపీ పట్టును కాపాడుకుంది. 2015లో జరిగిన నగర పాలకసంస్థ ఎన్నికల్లోనూ బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది. అయితే జనతాదళ్ (ఎస్) తో పెట్టుకుని కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని తన ఖాతాలో వేసుకుంది. స్థూలంగా చూస్తే గత రెండున్నర దశాబ్దాలుగా నగరంపై బీజేపీ పట్టుకొనసాగిస్తున్న మాట వాస్తవం.

దేవెగౌడ ప్రభావం నామమాత్రం…..

రాజధాని నగరంలో జనతాదళ్ (ఎస్) ప్రభావం నామమాత్రం. గత ఎన్నికల్లో చామరాజ్ నగర్, పులకేశి నగర్ లో మాత్రమే విజయం సాధించింది. అనంతరం ఇద్దరు ఎమ్మెల్యేలు అమీర్ అహ్మద్ ఖాన్, అఖండ శ్రీనివాసమూర్తి కాంగ్రెస్ లోకి ఫిరాయించడంతో దేవెగౌడ పార్టీకి నగరంలో ప్రాధాన్యమే లేకుండా పోయింది. రేపటి ఎన్నికల్లో నగర ప్రజల కోసం ప్రత్యేకంగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేయాలని తలపోస్తోంది. నగరంలో పట్టుకోసం బీజేపీ, కాంగ్రెస్ శ్రమిస్తున్నాయి. ప్రభుత్వ అవినీతిని ప్రధానాంశంగా ఎత్తిచూపుతూ ఇటీవల ‘‘సేవ్ బెంగళూర్’’ పేరుతో నగరంలో పాదయాత్ర నిర్వహించింది. నగరాన్ని ఐటీ రాజధానిగా మార్చిన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ సేవలను వినియోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. నగర ఓటర్లను ఆకట్టుకునే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ సభలను నిర్వహించాలని ఆలోచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా తన వంతు గట్టి ప్రయత్నాలనే చేస్తోంది. బీజేపీ ‘‘సేవ్ బెంగళూరు’’ పేరుతో చేపట్టిన పాదయాత్రకు పోటీగా ‘‘నమ్మ బెంగళూరు’’, ‘‘ నమ్మ హెమ్మె’’ పేరుతో పాదయాత్రలు చేస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నగర ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు.

సమస్యలు ఇవే….

నగర పరంగా ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్నారు. నానాటికీ పెరుగుతున్న ప్రజల రవాణా అవసరాలను ప్రభుత్వ రవాణా సంస్థలు తీర్చలేకపోతున్నాయి. మురికివాడలు పెరిగిపోతున్నాయి. పచ్చదనం హరించుకుపోతోంది. నగర పరిసరాల్లోని చెరువులు కాలుష్య కాసారాలను తలపిస్తున్నాయి. ఆక్రమణలు పెరిగిపోవడం మరో పెద్ద సమస్య. నగరపాలకసంస్థకు మరింత స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ ఓటర్ల వద్దకు వెళుతున్నాయి పార్టీలు. వారు ఎవరిని ఆదరిస్తారో చూడాలి మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*