బీజేపీపై క‌త్తిదూస్తోన్న తెలుగోడు

అస‌లే సోష‌ల్ మీడియా కాలమిది.. ఏదైనా చిన్న ఘ‌ట‌న జ‌రిగినా క్షణంలో ప్రపంచానికి తెలిసిపోతోంది.. భావ‌జాల వ్యాప్తిని రాకెట్ వేగంతో తీసుకెళ్తున్న వేదిక‌. ఇప్పడు దీనిని వేదిక‌గా చేసుకుని క‌న్నడలో స్థిరప‌డిన తెలుగు ప్రజ‌లు ఉద్యమిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాద‌ని తేల్చి చెప్పిన బీజేపీకి క‌న్నడ ఎన్నిక‌ల్లో షాకిచ్చేందుకు సిద్ధమ‌వుతున్నారు. ఏపీలో జ‌రుగుతున్న రాజకీయ ప‌రిణామాల‌ను క‌న్నడ‌లో స్థిర‌ప‌డిన తెలుగు ప్రజ‌లు నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ స‌రిహ‌ద్దు జిల్లాల్లో బీజేపీకి గ‌ట్టి ఎదురు దెబ్బత‌ప్పద‌ని ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో వీరి ప్రభావం….

బ‌ళ్లారి, కోలార్ త‌దిత‌ర ఏపీ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో తెలుగు ప్రజ‌ల ప్రభావం ఎక్కువ‌గా ఉంటుంది. వేలాది సంఖ్యలో తెలుగు ఓట‌ర్లు ఉన్నారు. ఇప్పుడు క‌న్నడ‌లో ఎన్నిక‌ల సంరంభం సాగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి వ్యతిరేకంగా క‌న్నడ‌లో తెలుగు ప్రజ‌లు ఏక‌మ‌వుతున్నట్లు ప్రచారం జ‌రుగుతోంది. ప్రత్యేక ఉద్యమం రూపం దాల్చకున్నా.. సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ఏపీకి బీజేపీ చేసిన మోసాన్ని ఎండ‌గ‌డుతున్నారు. క‌మ‌ల‌ద‌ళానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాల‌నే ప్రచారం జోరందుకుంది. ఇదే స‌య‌మంలో ఏపీ టీడీపీ కూడా క‌న్నడ‌లో బీజేపీని ఓడించేందుకు త‌మ వంతుగా సాయం చేస్తున్నారు.

టీడీపీ శ్రేణులు కన్నడ నాట….

ఇదే విష‌యంపై కొద్ది రోజులుగా చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణుల్నిక‌న్నడ‌కు పంపి, బీజేపీ ఓట‌మికి ప్రయ‌త్నం చేస్తున్నార‌ని క‌మ‌ల‌నాథులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా బెంగ‌ళూరు టీడీపీ ఫోరం వ్యవ‌స్థాప‌కుడు క‌న‌క‌మేడ‌ల వీరా మాట్లాడుతూ వెంట‌నే కేంద్ర ప్రభుత్వం ఏపీకి సానుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే బెంగ‌ళూరులో నిర‌స‌న కార్యక్రమాలు చేప‌డుతామ‌ని హెచ్చరించారు. తెలుగు ప్రజ‌ల ప్రభావం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ఏపీకి బీజేపీ ఎలా అన్యాయం చేసింద‌నే విష‌యాన్ని బ‌లంగా తీసుకెళ్తున్నారు.

సిద్ధరామయ్య తెలుగు ఓటర్లపై…..

ఇదే స‌య‌మంలో తాము అధికారంలోకి వ‌స్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామ‌ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పటికే ప్రక‌టించారు. ఇదే ఇప్పుడు అక్కడ తెలుగు వారిలో… ముఖ్యంగా ఆంధ్రా ప్రాంత ప్రజ‌లు, విద్యార్థులు, ఉద్యోగులు, యువ‌త‌ను ఆలోచింప జేస్తోంది. తెలుగు ప్రజ‌లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపే అవ‌కాశం ఉన్నట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామ‌య్య కూడా తెలుగు ప్రజ‌లు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఏదేమైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వక‌పోవ‌డంతో దేశ‌వ్యాప్తంగా బీజేపీపై ఎంతోకొంత‌ ప్రభావం ప‌డుతోంది.

కసితీరా ఓడించేందుకు….

ఇప్పటికే చంద్రబాబు జాతీయ స్థాయిలో కొంతమంది నాయ‌కుల‌తో పాటు పార్టీల మ‌ద్దతు కూడా కూడ‌గ‌డుతున్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ లాంటి వాళ్లు ఓపెన్‌గానే ఏపీకి హోదా ఇవ్వనందుకు బీజేపీ తీరును ఎండ‌గ‌డుతూ చంద్రబాబు ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినందుకు మ‌ద్దతు ప్ర‌క‌టించారు. ఇక ఇప్పుడు క‌ర్ణాక‌టలో ఉన్న తెలుగు వాళ్లు కూడా బీజేపీని ఈ ఎన్నిక‌ల్లో క‌సితీరా ఓడించేందుకు త‌మ వంతుగా ప్రయ‌త్నాలు ప్రారంభించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*