సాహసం ఊపిరిగా…!

నాయకుడంటే ఆశయాల మాల గుదిగుచ్చాలి. సిద్ధాంతాల పునాదులు నిర్మించాలి. సంక్షేమానికి సారథి కావాలి. పాలనసౌధానికి పక్కా మేస్త్రీగా పనిచేయాలి. కేవలం ఈ లక్షణాలే కాదు. మరెన్నో మార్గాల కూడలి. అనుసంధాన కడలి కలైంజర్ కరుణానిధి. తొమ్మిదిన్నర దశాబ్దాల జీవన ప్రస్థానంలో ఎనిమిది దశాబ్దాల ప్రజాజీవితం ఎవరికీ దక్కని అరుదైన అవకాశం. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవనసాఫల్యం సాధించిన మహానేత కలైంజర్. ఎన్ని పోరాటాలు, సిద్దాంతవైరుద్ధ్యాలు, అవమానాలు, సంఘర్షణలు, విజయాలు చవిచూశారో లెక్కే లేదు. తుదిశ్వాస వరకూ ప్రజల్లోనే ఉండాలని కలలు కన్నారు. అవిశ్రాంత పథికునిగా నిలిచిపోయారు. చరిత్ర సృష్టించారు. తానే ఒక చరిత్రగా మిగిలిపోయారు. రాజకీయ నాయకత్వానికి ఆయన ఒక పాఠం. అభ్యసించాల్సిన అధ్యయనం. ప్రాంతీయపార్టీలకు మార్గనిర్దేశం. ఆ జీవన పథమే ఒక సమరశంఖం. నిన్నటి తరాన్ని రేపటి తరంతో అనుసంధానం చేసే అద్భుత సజీవ స్రవంతి ఆయన ప్రస్థానం.

సాహసం ఆ పథం…

కరుణానిధి జీవితంలో అడుగడుగునా సాహసం తొంగి చూస్తుంది. పుట్టిన ఊరు పేరు మార్చకూడదని ఉద్యమాన్ని నడిపి జైలు ఊచలు లెక్కపెట్టినప్పుడు ఆయనెవరో ప్రపంచానికి తెలియదు. ఆ పట్టుదల తమిళనాడు రాజకీయానికి మార్గనిర్దేశం చేస్తుందని ఊహించలేదు. ‘నాస్తికతే నా అస్తిత్వము, నా జాతే నాకు జాతీయత. నా గడ్డపై ప్రేమాభిమానాలే నా దేశభక్తి’ అంటూ తన రాజకీయసిద్దాంతాలను స్పష్టంగా ప్రకటించిన మేధావి. ద్రవిడ ఉద్యమాన్ని ఉరకలు పెట్టించిన వారిలో ప్రముఖునిగా నిలిచారు. పెరియార్ రామస్వామి, అన్నాదురై వంటి మార్గదర్శకులు కనుమరుగయ్యాక తమిళనాడు ఏమయిపోతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి. వారసత్వ జ్యోతిని తాను స్వీకరించి ఆ వెలుగులు ఆరిపోకుండా సిద్దాంతభూమిక కొడిగట్టకుండా కాపాడారు. దశాబ్దాల పాటు ఆ కాంతులను తమిళనాట ప్రసరింపచేశారు. హేతువాదం, తమిళ జాతి ఆత్మాభిమానం, భాషాభిమానం వంటి విషయాల్లో రాజీలేని పోరాటం చేశారు. ఫలితంగానే హిందీ విస్తరణను అడ్డుకోవడం, ప్రాంతీయభాషలను పరిరక్షించుకోవడం సాధ్యమైందని చెప్పాలి. దక్షిణాది రాష్ట్రాలకు తమిళనాడు ఒక రోల్ మోడల్ గా నిలవడంలో డీఎంకే పాత్ర ఎనలేనిది. దానికి దీర్ఘకాలం నేత్రుత్వం వహించిన కరుణానిధి చూపిన మార్గం అనితరసాధ్యమైనది.

పోరులో జీవితం….

కరుణానిధి తన జీవితకాలంలో చవిచూసిన ఆటుపోట్లు రాజకీయాల్లో ఎవరికీ ఎదురై ఉండకపోవచ్చు. చిన్నప్పటి నుంచే ద్రవిడ ఉద్యమాల్లో భాగం కావడం ఒక పార్శ్వం. రాజకీయాల్లో ఎదుగుదల , పోటీ దారులుగా భావించేవారిపై ఆధిక్యత సాధించడం మరో పార్శ్వం. ‘అయ్యా’ అంటూ తాను ఆత్మీయంగా పిలుచుకునే గాడ్ ఫాదర్ పెరియార్ రామస్వామిని వదిలిపెట్టి రావడంలో ఒక పంతం కనిపిస్తుంది. లీడర్ అన్నాదురై నాయకత్వంలో పనిచేసి డీఎంకేను అధికారంలోకి తేవడంలో ఒక పట్టుదల తొంగి చూస్తుంది. కామరాజ్ నాడార్ పట్టుపట్టి డీఎంకే నాయకులందర్నీ ఓడించేందుకు ప్రయత్నించినా తాను ఎమ్మెల్యేగా నెగ్గడంలో ఒక వ్యూహం, రాజకీయచాతుర్యం ప్రస్ఫుటమవుతాయి. డీఎంకే వ్యవస్థాపన తర్వాత పదేళ్ల వరకూ అధికారంలోకి రాలేదు. 1957 నుంచి 67 వరకూ డీఎంకేకు ఆర్థిక వనరుల కల్పనలో ప్రధాన భూమిక కరుణానిధిదే. తన సహచరుడు ఎంజీఆర్ పార్టీని విడిచి సొంతకుంపటి పెట్టుకున్న తర్వాత డీఎంకే మళ్లీ పన్నెండేళ్లపాటు అధికారానికి దూరమైంది. అయినా చెక్కుచెదరని విశ్వాసంతో పార్టీని ముందుకు నడిపారు. మళ్లీ ఉజ్జ్వల భవిష్యత్తును సాధించారు. జనసమ్మోహక శక్తి జయలలితను ఎదుర్కోవడంలో నిర్మాణాత్మకమైన పంథాను అనుసరించారు. అనేకసార్లు రాష్ట్రపతి పాలనతో ప్రభుత్వం రద్దయింది. రాజకీయ కారణాలే ఇందుకు దారితీశాయి. అయినా ఎక్కడా అలిసిపోకుండా పోరు సాగించారు. అంతిమ విజేతగా నిలిచారు.

ప్రాంతీయ దిక్సూచి…

‘కేంద్రం పెత్తనానికి చరమగీతం పాడాలి. రాష్ట్రాలు స్వయంపాలన హక్కులు సాధించాలి. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను అర్దాంతరంగా రద్దు చేసే అరాచకత్వం పోవాలి.’ అన్న డిమాండ్లపై అలుపెరుగని కృషి చేశారు కరుణానిధి. జాతీయపార్టీగా కాంగ్రెసు హవా చెలాయిస్తున్న రోజుల్లో దీటుగా నిలిచింది డీఎంకే. ప్రాంతీయపార్టీలు నిలదొక్కుకోగలుగుతాయని నిరూపించింది. సుదీర్ఘకాలం అధికారంలో లేకపోయినా పార్టీ నిర్మాణం పక్కాగా ఉంటే ప్రత్యామ్నాయంగా నిలవగలుగుతుందని చాటి చెప్పింది. ఇది కరుణానిధి రాజకీయ సామర్ద్యం. దక్షిణభారతావని నుంచి జాతీయ పార్టీలకు సవాల్ విసిరారు. జాతీయ రాజకీయాల్లో దక్షిణాది ప్రాముఖ్యం పెరగడంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ప్రాంతీయపార్టీలు డీఎంకే నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి. కరుణానిధి నాయకత్వం నుంచి గ్రహించాల్సిన రాజకీయం అనంతం. బీజేపీ ఒక ప్రబలమైన శక్తిగా ఎదిగి ప్రాంతీయపార్టీలను కబళించివేయాలని చూస్తున్న తరుణంలో కలైంజర్ మరణం కలవరపరిచే ఘట్టమే. ఇప్పటికే అన్నాడీఎంకే ను ఆడిస్తున్న మోడీ, డీఎంకేను ఏం చేస్తారో ననే భయాందోళనలు తమిళనాట వ్యాపించాయి. అంతర్గత కుమ్ములాటలకు పోకుండా తండ్రి ఇచ్చిన పోరాటస్ఫూర్తి, రాజకీయ నైపుణ్యంతో స్టాలిన్, అళగిరి, కనిమొళి కలిసికట్టుగా ముందడుగు వేస్తేనే డీఎంకేకు భవిష్యత్తు. అది తమిళనాడుకూ, ఇతర రాష్ట్రాలకు ఎంతో అవసరం. ముఖ్యంగా ప్రాంతీయపార్టీలకు నైతికస్థైర్యం పంచే కలైంజర్ ప్రేరణను తేజోవంతం చేయాల్సిన బాధ్యత వారసులపై ఉంది.

 

– ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*