కాసు మళ్లీ గల..గల మంటున్నాడే….!

గుంటూరు జిల్లా రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ద‌శాబ్దాలుగా రెండు కుటుంబాల మ‌ధ్య కొన‌సాగుతున్న వైరానికి కొంత బ్రేక్ ప‌డినా.. మ‌ళ్లీ ఈ విభేదాలు తెర‌పైకి వ‌చ్చేలా క‌నిపిస్తున్నాయి. కాసు, కోడెల వ‌ర్గాల మ‌ధ్య మ‌ధ్య పచ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత‌గా విభేదాలు ఉన్న విష‌యం తెలిసిందే! ప్రస్తుతం ఈ ఫ్యామిలీల నాయ‌కులు చెరో నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నా.. వచ్చే ఎన్నిక‌ల్లో ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌త్య‌ర్థులుగా బ‌రిలోకి దిగాల‌నే ప్ర‌ణాళిక‌లు వేస్తున్నారు. వైసీపీ నుంచి కాసు మ‌హేష్‌ గుర‌జాలపైనే ఫోక‌స్ పెట్టినా.. న‌ర‌సారావుపేట నుంచి పోటీచేయాల‌ని భావిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో స్పీక‌ర్‌ కోడెల శివ‌ప్ర‌సాద్‌రెడ్డి కూడా స‌త్తెన‌ప‌ల్లిని వ‌దిలి న‌ర‌సారావుపేటకు మారాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ట‌. అయితే మ‌హేష్‌రెడ్డి ఆశ‌ల‌కు మాత్రం పార్టీ అధినేత జ‌గ‌న్‌.. గండి కొడుతున్నారు. ఆయ‌న్ను గుర‌జాల నుంచే పోటీ చేయిస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో..ఇప్పుడు ఎవరు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌నేది ఆస‌క్తిగా మారింది.

కుమారుడిని తెరపైకి తెచ్చి……

టీడీపీ, వైసీపీ నాయ‌కులు ఇప్పుడు అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తులు ప్రారంభించారు. ఎక్క‌డ ఎవ‌రిని బ‌రిలోకి దించాల‌నే అంశంపై ఇప్ప‌టికే కొన్నిచోట్ల నిర్ణ‌యానికి వ‌చ్చారు. అయితే అధినేత అభిప్రాయాలు ఒక‌లా ఉంటే.. అభ్య‌ర్థుల అభిప్రాయాలు మ‌రోలా ఉన్నాయి. ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలో కాసు కృష్ణా రెడ్డి ఫ్యామిలీ కేంద్రంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. 2014 నుంచి రాజకీయంగా సైలెంట్ అయిన కృష్ణారెడ్డి తన కుమారుడు కాసు మహేష్ ను తెరపైకి తెచ్చారు. వైసీపీలో చేరిన మ‌హేష్‌రెడ్డిని గురజాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా జ‌గ‌న్‌ నియమించారు. టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరావుపై పోటీ చేసే క్ర‌మంలో మ‌హేష్ గుర‌జాల‌లో వరుస కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. మహేష్ న‌ర‌సారావుపేట నుంచి పోటీ చేయాలని అనుచ‌రులు కోరుతున్నారు.

గోపిరెడ్డి సిట్టంగ్ ఎమ్మెల్యేగా…..

ప్ర‌స్తుతం నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచే గెలిచారు. వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా సౌమ్యుడు అన్న పేరు ఉంది. అయితే ఇక్క‌డే ట్విస్ట్ ఉంది. న‌ర‌సారావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో ద‌శాబ్దాల కాలంగా పోటీ కాసు ఫ్యామిలీ కోడెల ఫ్యామిలీ మ‌ధ్య‌నే ఉండేది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ రెండు ఫ్యామిలీలు ఇక్క‌డ పోటీ చేయ‌లేదు. కోడెల స‌త్తెన‌ప‌ల్లికి మారిపోయారు. కాసు ఫ్యామిలీ పోటీ చేయ‌లేదు. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ వీరిద్ద‌రు ఇక్క‌డ నుంచే పోటీ చేయాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అక్కడ పట్టు లేదని…..

కాసు ఫ్యామిలీకి గుర‌జాల‌లో ప‌ట్టులేదు. ఈ ఫ్యామిలీ నుంచి గ‌తంలో అక్క‌డ పోటీ చేసిన కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి, కృష్ణారెడ్డి ఇద్ద‌రూ ఓడిపోయారు. దీంతో ఇప్పుడు మ‌హేష్‌రెడ్డి సైతం గుర‌జాల‌లో పోటీకి సుముఖంగా లేన‌ట్టే తెలుస్తోంది. అయితే జ‌గ‌న్ మాత్రం ఇక్క‌డ సిట్టింగ్ గోపిరెడ్డిని మార్చేందుకు ఒప్పుకోవ‌డం లేదు. కానీ కాసు అనుచరులు మాత్రం కాసు ఫ్యామిలీ ఇక్క‌డే పోటీ చేయాల‌ని కోరుకోవ‌డం ఎందుకా అనే ప్ర‌శ్న రాక‌మాన‌దు. నర్సారావుపేటలో మూడు దశాబ్ధాలుగా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, కాసు కృష్ణారెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. వాళ్ల అనుచ‌రగ‌ణం ఇక్క‌డ బ‌లంగా ఉంది.

పొత్తులో భాగంగా……

గ‌త ఎన్నిక‌ల్లో న‌ర్స‌రావుపేట‌ను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. దీంతో గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు కోడెల శివప్రసాద్. దీంతో దశాబ్దాల కోడెల వర్సెస్ కాసు వైరానికి 2014 ఎన్నికల్లో బ్రేక్ పడింది. ఇక టీడీపీ విష‌యానికి వ‌స్తే వచ్చే ఎన్నికల్లో న‌ర‌సారావుపేట నుంచి కోడెల కానీ ఆయన కుమారుడు కానీ పోటీచేయవచ్చనే ప్రచారం జోరుగా సాగుతున్నా చంద్ర‌బాబు కోడెల వైపే మొగ్గు చూపుతున్నార‌ట‌. కోడెల‌ను స‌త్తెన‌ప‌ల్లి నుంచి కాకుండా ఇక్క‌డ నుంచే పోటీ చేయించాల‌ని ఆయ‌న చూస్తున్నారు.

కోడెలకు చెక్ పెట్టాలంటే…..

కోడెల కు చెక్ చెప్పేందుకు గోపిరెడ్డి కంటే కాసు మహేష్ గట్టి పోటీ అవుతాడని క్యాడర్ భావిస్తోంది. కానీ గురజాల ఇన్ చార్జిగా మహేష్ ప్రచారం చేసుకుంటూ పోతున్నాడు. అందుకే ఇప్పుడే మహేష్ ను నరసారావుపేటకు మార్చాలని క్యాడర్ కోరుతోంది. జ‌గ‌న్ మాత్రం మ‌హేష్‌ను గుర‌జాల‌లోనే పోటీ చేయిస్తాన‌ని చెప్పారు. ఆయ‌న మాత్రం అక్క‌డ పోటీ చేసేందుకు ఇష్టంతో లేరు. న‌ర‌సారావుపేట‌లోనే పోటీ చేస్తానని స్ప‌ష్టం చేస్తున్నాడ‌ట‌. చివరి నిమిషంలో పంపితే ప్రయోజనం ఉండదని ద్వితీయ శ్రేణి నాయ‌కులు చెబుతున్నారు. కోడెల కూడా న‌ర‌సారావు పేట నుంచి బ‌రిలోకి దిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇవన్నీ గమనిస్తే కాసు వర్సెస్ కోడెల వార్ మళ్లీ నరసారావుపేటలో జరిగే చాన్స్ ఉందంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*