కాసు కసి తీర్చుకుంటారా…??

kasumaheshreddy serious effort in gujajala

పల్నాడు ప్రాంతంలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో హోరా హోరీ తలపడనున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఈ సారి ఎన్నిక ఆషామాషీగా ఉండదన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే అక్కడ తలపడుతున్న వారు సామాన్యులు కాదు. అన్ని విధాలుగా ఆరితేరిన వారు. రాజకీయ నేపథ్యం గాని, ఆర్థికంగా గాని ఇద్దరూ బలమైన నేతలు కావడంతో పందెంకోళ్లలా ఈసారి తలపడతారాని చెప్పకతప్పదు. గురజాల నియోజకవర్గం నరసరాపు పార్లమెంటు పరిధిలో ఉంది. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలతో అట్టుడికిపోయిన గురజాల ఇప్పిడిప్పుడే దాన్నుంచి బయటపడి అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుంది.

యరపతినేని ఉక్కిరిబిక్కిరి…..

గురజాలలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా యరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన సీనియర్ నాయకుడు కావడం, 1994, 2009, 2014 ఎన్నికలలో విజయం సాధించారు. వరుసగా రెండు సార్లు గెలిచి మూడోసారి విజయం సాధించేందుకు యరపతినేని ఇప్పటి నుంచే శ్రమిస్తున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఆయనపై అనేక ఆరోపణలు కూడా ఆయనను మైనస్ లోకి నెట్టేస్తున్నాయి. అక్రమ మైనింగ్ ఆరోపణలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆయన అనుచరులు బినామీ పేర్లతో మైనింగ్ చే్స్తుండటాన్ని ఇటీవల న్యాయస్థానంకూడా తప్పుపట్టడం సిట్టింగ్ ఎమ్మెల్యేను కొంత ఇరకాటంలోనే నెట్టిందనే చెప్పాలి.

టగ్ ఆఫ్ వార్…..

ఇక గురజాల నియోజకవర్గం చరిత్ర చూస్తే 1983 నుంచి ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు, స్వతంత్ర అభ్యర్థి ఒకసారి, తెలుగుదేశం పార్టీ నాలుగుసార్లు విజయం సాధించడం విశేషం. అంటే ఏ పార్టీని ఈ నియోజకవర్గంలో తక్కువగా చూడటానికి వీలులేదు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి ఇక్కడ దాదాపు 87 వేల ఓట్లను సాధించారు. 7,187 ఓట్లతోనే గత ఎన్నికల్లో యరపతినేని గెలుపొందడం విశేషం. అయితే ఈసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలయిన జంగా కృష్ణమూర్తిని పక్కన పెట్టారు. ఆయన స్థానంలో కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్ రెడ్డిని బరిలోకి దించారు.

ఆ ప్రచారం వట్టిదే…..

కాసు మహేష్ రెడ్డి గురజాల నుంచి పోటీ చేయరని, ఆయన నరసరావుపేటవైపు చూస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటున్నారు. నిజానికి కాసు మహేష్ రెడ్డి గత కొద్ది రోజులుగా గురజాలను కేంద్రంగా చేసుకుని అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల గురజాలలో ఆస్తి, ఇంటిపన్నుల పెంపుదలకు నిరసనగా పెద్దయెత్తున ఉద్యమం చేపట్టారు. ఖచ్చితంగా గురాజాలనుంచేతన పోటీ ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. యరపతినేని పై ఉన్న వ్యతిరేకత, తమ కుటుంబానికి ఉన్న ఇమేజ్ తనను ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తుందని కాసు మహేష్ రెడ్డి విశ్వసిస్తున్నారు. మరి పల్నాడులో పందెంకోళ్లు రెడీ అవుతున్నాయి. మరి గెలుపు ఎవరిదో చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*