టచ్ లోనే ఉన్నానండోయ్….!!!

kchandrasekhar-rao-third-front-still-alive

చంద్రబాబు నాయుడు కాంగ్రెసుకు చేరువ అయ్యారు. మూడో ఫ్రంట్ ముచ్చట పక్కన పెట్టేశారు. కాంగ్రెసుతో కలిసే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయానికొచ్చేశారు. ఇతర ప్రాంతీయ పార్టీలను సైతం తన వాదనకు మద్దతుగా సమీకరిస్తున్నారు. దేశంలో తనకు సన్నిహితంగా ఉండేవారినందరినీ కలిసి వచ్చేశారు. డిసెంబర్ పదో తేదీన ఢిల్లీలో సమావేశానికి ముహూర్తం నిశ్చయించారు. బాబు దృష్టిలో రెండే కూటములుండాలి. బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ, దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెసు భాగస్వామిగా బలమైన ప్రాంతీయ పార్టీల కూటమి. నాయకత్వ బాధ్యతలు మాత్రం కాంగ్రెసుకు అప్పగించరు. ఈ దిశలో కొంత కదలిక వచ్చిందని భావిస్తున్న పరిస్థితుల్లో కేసీఆర్ బాంబు పేల్చారు. కూటమి కట్టేందుకు తాను కూడా రంగంలోనే ఉన్నానని తేల్చేశారు. ప్రస్తుతం రాజకీయంగా ఇది చర్చనీయమవుతోంది. దేవెగౌడ వంటి నాయకులు దీనిని తోసిపుచ్చడం లేదు. అటువంటి అవకాశాలున్నాయని నొక్కి చెబుతున్నారు. కేసీఆర్ యోచన ఫలిస్తే చంద్రబాబు ఆలోచనకు అది ఆటంకంగా మారుతుంది. త్రుతీయ ప్రత్యామ్నాయం ముందుకు వస్తే కాంగ్రెసు భాగస్వామ్య ఫ్రంట్ వీగిపోతుంది. అనిశ్చిత వాతావరణంలో ఎన్డీఏ ఏకైక పెద్ద కూటమిగా అవతరిస్తుంది. ప్రతిపక్షాలు రెండుగా పోటీ పడాల్సి వస్తుంది. దీంతో కేసీఆర్, చంద్రబాబులు కేంద్రంగా ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫ్రంట్ ల పొజిషన్ పై వేడి రగులుకొంటోంది.

ముసుగు తీసేందుకే…

కొన్ని నెలల క్రితం థర్డ్ ఫ్రంట్ , సెక్యులర్ ఫ్రంట్, డెమొక్రటిక్ ఫ్రంట్ పేరిట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా హడావిడి చేశారు. అప్పటికి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు కిమ్మనకుండా మౌనం వహించారు. అవసరమైతే టీడీపీని కూడా కలుపుకుంటామని కేసీఆర్ అంతర్గతంగా చెబుతూ వచ్చారు. దేశంలో బీజేపీ, కాంగ్రెసు ల ఆధిపత్య ధోరణికి చెక్ చెప్పేలా ప్రజాస్వామిక కూటమి ఏర్పడాలని కేసీఆర్ వాదించారు. ఇందులో ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉండాలనేది ఆయన ఆలోచన. దీని వెనక చాలా దూరాలోచన ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తనకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసు. చంద్రబాబు నాయుడు బీజేపీ కూటమిలో ఉన్నారు. అందువల్ల థర్డ్ ఫ్రంట్ ద్వారా జాతీయంగా ముఖ్యపాత్రలోకి రావాలని కేసీఆర్ భావించారు. మమత, నవీన్ పట్నాయక్, దేవెగౌడ వంటివారిని కలిసి వచ్చారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి కాబట్టి దాంతో సంప్రతింపులు జరపలేదు. టీడీపీ బీజేపీకి దూరమయ్యాక కేసీఆర్ మౌనముద్ర ధరించారు. ఆ ఖాళీని కేసీఆర్ భర్తీ చేస్తారని అందరూ భావించారు. ఢిల్లీ వెళ్లి మూడుసార్లు ప్రధానిని కలిసి వచ్చారు. మూడోఫ్రంట్ ముచ్చట మాట్లాడటం మానేశారు. ముందస్తు ఎన్నికలకు కేంద్రం ఆమోదంతో రంగం సిద్ధం చేసుకున్నారు. దాంతో సెక్యులర్ కూటమి ఆలోచన చెట్టెక్కేసినట్లేనని అందరూ భావించారు.

ఆ తర్వాతే అసలు కథ…

అయితే కేసీఆర్ ఆ ఆలోచనను విరమించుకోలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. కేంద్రంతో సఖ్యతగా ఉంటే తప్ప ముందస్తు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రాదు. అందుకే కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటించారంటున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు. తాను మూడో ఫ్రంట్ ను ముందుకు తెస్తానంటూ తాజాగా కేసీఆర్ బహిరంగసభల్లోనే ప్రకటించారు. ఇందులో రెండు ఉద్దేశాలుండవచ్చనేది రాజకీయ పరిశీలకుల అంచనా. నిజంగానే త్రుతీయ ప్రత్యామ్నాయం అవసరముందని ఆయన బలంగా విశ్వసించడం ఒక కారణం. బీజేపీతో అంటకాగుతున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇది ఎన్నికల గోదాలో మైనారిటీ ఓట్లను దెబ్బతీస్తుంది. అందువల్ల తాను సెక్యులర్ ఫ్రంట్ కట్టబోతున్నానన్న సమాచారం ప్రజల్లోకి వెళ్లాలి. అప్పుడే ముస్లిం ఓట్లు టీఆర్ ఎస్ కు పడతాయి. అందువల్లనే తన స్టాండ్ ను, కాంగ్రెసు, బీజేపీలకు ప్రత్యామ్నాయ ఫ్రంట్ వాదనను, మరోసారి బలంగా ప్రజల ముందుకు తెస్తున్నారంటున్నారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతనే దేశ రాజకీయ ముఖచిత్రంలో కేసీఆర్ ఏ పాత్ర పోషించబోతున్నారన్న విషయం స్పష్టమవుతుంది. కాంగ్రెసు, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ కడతారో, లేదా కేంద్రంలో సమీకరణలు చూసుకుని ఏదో ఒక కూటమిలో ప్రాతినిధ్యం పొందుతారో పరిశీలకులు చెప్పలేకపోతున్నారు.

టచ్ లో అగ్రనేతలు…

కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలపైనే పూర్తిగా దృష్టి సారించారు. ముందస్తుగా ఎన్నికలకు వెళ్లడంలోనే వ్యూహం దాగి ఉంది. తెలంగాణ రాష్ట్రానికి వనరుల పరంగా సమృద్ధి ఉంది. రాజకీయ స్థిరత్వాన్ని సాధించి తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ ను నిలపగలిగితే చాలు. జాతీయంగా కీలక పాత్ర పోషించే అవకాశం దక్కుతుంది. తెలంగాణ సాధన సమయంలో జాతీయంగా అనేక పార్టీలతో కేసీఆర్ సంప్రతింపులు జరిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ఆయా నాయకుల సమ్మతి రాబట్టగలిగారు. ఆ చొరవను రాజకీయ అవకాశంగా మలచాలనే యోచనలో ఉన్నారు. ముందుగా తెలంగాణ ఎన్నికలు పూర్తయిపోతే ఒత్తిడి తగ్గిపోతుంది. నేషనల్ పాలిటిక్స్ పై కాన్సంట్రేషన్ పెంచవచ్చు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సమరాన్ని కేటీఆర్, హరీశ్, కవితలు చూసుకుంటారు. హిందీ లో సైతం వాగ్ధాటి కలిగిన నేత కావడంతో ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు చేయవచ్చు. అదే ఉద్దేశంతో ఇప్పటికీ వివిధ పార్టీల అగ్రనేతలతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ తాజాగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ సైతం ఫ్రంట్ లోకి వస్తారంటూ ప్రకటించారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*