కుమారులను గద్దెనిక్కించడానికి చంద్రుల స్కెచ్…?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేస్తున్న అడుగులు చర్చనీయాంశమవుతున్నాయి. తమ కుమారుల కోసం వారు వేస్తున్న ఎత్తులు ఆసక్తికరంగా మారాయి. ఇద్దరు ముఖ్యమంత్రులూ తమ కుమారులను రెండు రాష్ట్రాలకు 2019లో ముఖ్యమంత్రులను చేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ సారి జరుగనున్న ఎన్నికల్లో ఇద్దరు చంద్రులూ అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెటు స్థానాలకు కూడా పోటీ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.

ప్రాంతీయ పార్టీలే కీలకమని అంచనా…

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో గెలుపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమాతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అంత సులువుగా పరిస్థితులు లేకున్నా చంద్రబాబు నాయుడు కూడా నమ్మకంగానే ఉన్నారు. ఇదే సమయంలో ఇద్దరూ కేంద్రంలో పరిణామాలపై ఒకేరకమైన అంచనాలు వేస్తున్నారు. 2019లో కేంద్రంలో నరేంద్ర మోడీకి ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయిలో స్థానాలు దక్కవనేది వీరి అంచన. ఇదే జరిగే ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని ఉంది. చంద్రబాబుకు మాత్రం ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో కీలకంగా మారాలని ఆశిస్తున్నారు. అంటే జాతీయ పార్టీలకు పూర్తి మెజారిటీ రావద్దనేది ఆయన ఉద్దేశ్యం. మొత్తం మీద కేంద్రంలో ప్రాంతీయ పార్టీల హవా ఉండాలనేది ఇద్దరి ఆశ. ఇదే జరిగితే తాము ఎంపీలుగా పోటీ చేయడం వల్ల కేంద్రంలో చక్రం తిప్పవచ్చని బావిస్తున్నారంట. అంతేకాదు రెండు రాష్ట్రాల్లో తమ కుమారులను సులువుగా ముఖ్యమంత్రులను చేసుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక వారసులదే రాజ్యమా..?

చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ముఖ్యమంత్రి కావాలని ఇప్పటికే ఆ పార్టీ వేదికలపైనే ఎంపీలు జెసీ దివాకర్ రెడ్డి, టీజీ వెంకటేష్ వంటి వారు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇదే సందర్భంలో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని, ప్రధాని కావాలని కూడా ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక తెలంగాణలోనూ సేమ్ సీన్ ఉంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారంట. ఇందులో భాగంగానే కేటీఆర్ ను ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ యేనని మానసికంగా ఫిక్స్ అయ్యారు. రెండు పార్టీలూ, రెండు రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి వస్తే వారసులే ముఖ్యమంత్రులు అవుతారని స్పష్టమవుతోంది.

స్థానాలను ఎంపిక చేసుకున్నారా…

కుమారులను గద్దెనెక్కించడానికి ముఖ్యమంత్రలను చేయడానికి, కేంద్రంలో కీలకపాత్ర పోషించడానికి ఇద్దరు చంద్రులు ఎంచుకున్న మార్గం ఎమ్మెల్యేతో పాటు ఎంపీ స్థానానికి కూడా పోటీ చేయడమేనని సమాచారం. కేసీఆర్ తన ప్రస్తుత నియోజకవర్గం గజ్వేల్ తో పాటు మెదక్ లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన ఇలానే పోటీ చేశారు. మెదక్ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి లేరు. దీంతో గెలుపు సులువు అవుతుందని టీఆర్ఎస్ అంచనా. ఇక చంద్రబాబు నాయుడు కూడా వ్యూహాత్మకంగా పార్లమెంటు స్థానాన్ని ఎంచుకుంటున్నారని వినికిడి. కమ్మ సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న విజయవాడ లోక్ సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో పాటు ఈ ఎంపీ స్థానం పరిధిలోకి వచ్చే ఏదైనా ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీలో ఉండాలనుకుంటున్నారు. ఇదే జరిగితే సుదీర్ఘకాలంగా తనను గెలిపిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాన్ని ఆయన వదిలేసినట్లే. అయితే, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో గట్టి పోటీ ఉన్నందున ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ముందు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నికల తర్వాత రాజ్యసభ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. మరి చూడాలి ఇద్దరు చంద్రుల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*