అటు నేనే ..ఇటు నేనే….!

రాజకీయమంటే కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలి. రెండు భిన్నమైన రాజకీయ సైద్దాంతిక శక్తులతో సమ స్నేహం చేయగల నైపుణ్యం ఆయన సొంతం. అదే సమయంలో ఇద్దరి చేతా తమ వాడేనని భావింపచేసుకోగల చాతుర్యమూ చూపగలరు. బయటినుంచి చూసే ఇతరులకు మాత్రం ఇరువురికీ ప్రత్యర్థే అని భ్రమింపచేయనూ గలరు. ఇందుకు అనుగుణమైన రాజకీయ గణితాన్ని సరిచూసుకోవడంలోనూ, రాజకీయ రసాయనశాస్త్రాన్ని మదించి సమీకరణలు మార్చడంలోనూ ఆయనకు ఆయనే సాటి. బీజేపీ పై నిప్పులు కురిపిస్తున్నట్లు కనిపిస్తారు. కానీ చర్యలు మాత్రం కరుణరసం పొంగిస్తాయి. ఆపత్కాలంలో గట్టున పడేస్తుంటాయి. వామపక్షాలను ఏకిపారేస్తున్నట్లు అభినయిస్తారు. వారికి తెలియకుండానే వారినే వశం చేసుకుంటారు. తన వ్యతిరేకశక్తుల ఓట్లు సంఘటితం కాకుండా చేసుకోవడంలోనూ, ప్రత్యర్థుల చీలికలను బలోపేతం చేయడం ద్వారానూ ఒకే కేంద్రంగా ఓట్ల సమీకరణ జరగకుండా గందరగోళ పరచడంలోనూ ఆయన దిట్ట. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సాగుతున్న తంతు టీఆర్ఎస్ కు అనుకూలంగా కేసీఆర్ వ్యూహరచనకు అద్దం పడుతోంది.

కస్సుబుస్సు ..కథాకమామిషు….

బీజేపీ, కాంగ్రెసులు రెంటినీ దూరం పెట్టాలి. దేశం సర్వనాశనం కావడానికి, అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోవడానికి ఈ రెండు పార్టీలే కారణమంటూ కొన్ని రోజుల క్రితం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ స్థాపిస్తానంటూ ప్రతినబూనారు. ఆ మేరకు కొన్ని ప్రయత్నాలు కూడా చేశారు . ఆయన వేగం చూసినవారు చిత్తశుద్దిని శంకించలేరు. ఆయన మాట విన్నవారు నిజమే కదా? అని తలొగ్గకమానరు. కానీ రెండు జాతీయ పార్టీలపైనా ఈ కస్సుబుస్సుల వెనక పెద్ద కథాకమామిషు దాగి ఉందనేది రాజకీయ అంచనా. దళితులు, మైనారిటీలు బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కాంగ్రెసు వైపు మొగ్గు చూపే వాతావరణం నెలకొంది. దీనిని గండి కొట్టకపోతే కేవలం లోక్ సభ ఎన్నికలకే పరిమితం కాకుండా శాసనసభ ఓట్ల విషయంలోనూ ఈ సమీకరణ కాంగ్రెసుకు లాభిస్తుంది. అందుకే కాంగ్రెసుకే కాదు, బీజేపీకి కూడా తాను ప్రధాన ప్రత్యర్థి అన్న తరహాలో కేసీఆర్ ధ్వజమెత్తారు. మన నేత జాతీయ నాయకుడు అవుతున్నారన్న భావన రేకెత్తించడం ద్వారా రాష్ట్రస్థాయి సెంటిమెంటునూ రేకెత్తించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అవిశ్వాస ప్రతిపాదన సందర్బంగా లోక్ సభలో రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తించి గందరగోళ పరిచి బీజేపీకి ఒకింత సాంత్వన చేకూర్చారు. కేసీఆర్ కీలక సమయానికి ఆదుకుంటారనే భరోసాను కల్పించగలిగారు.

వామపక్షాలకు వత్తాసు…..

బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలు ఏమైనా ఉన్నాయంటే దేశంలో అవి వామపక్షాల తర్వాతనే. అటువంటి పార్టీలను సైతం ఆయన మాటలతో మెప్పించగలిగారు. జాతీయ మహాసభలు హైదరాబాదులో నిర్వహిస్తున్న సందర్భంగా సహకారాన్ని అర్థించడానికి వెళ్లిన వామపక్ష నేతలకు ఆయనే సుద్దులు చెప్పారు. అసలు కార్మిక,శ్రామిక, రైతు ప్రయోజనాలకు కట్టుబడిన కమ్యూనిస్టులు లేకపోతే దేశమనుగడే కష్టమని చెప్పేశారాయన. ప్రత్యామ్నాయ విధానాలతో దేశం రూపురేఖలు మార్చడానికి వామపక్షాలు కలిసి రావాలని కోరారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వంటి కూటములతో కిందమీద పడుతున్న వామపక్షాలు కేసీఆర్ మాటలకు డంగై పోయాయి. మరింత పటిష్టంగా మీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి . మా నిర్బంధం ఏమీ ఉండదంటూ భరోసానిచ్చారు. లాల్ నీల్ నినాదానికి సైతం ఆయన జైకొట్టారు. ఏతావాతా చూస్తే బీఎల్ఎఫ్ నల్గొండ, ఖమ్మం సహా ఇంకో రెండు మూడు జిల్లాల్లో బలపడినా అది కాంగ్రెసు ఓటు బ్యాంకును దెబ్బతీస్తుందని కేసీఆర్ కు తెలుసు. ప్రధాన ప్రత్యర్థి దెబ్బతింటే అది అధికారపక్షానికే మేలు చేస్తుంది. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు అవుతుంది. టీఆర్ఎస్ అధికారయాత్ర సునాయాసంగా సాగిపోతుంది.‘ బీజేపీని విమర్శిస్తున్నాడు. ఆపార్టీతో కలవడం లేదు. మనకిది చాలు’ అనుకునే అల్పసంతోషం వామపక్షాలది. ఆ వైఖరితో కాంగ్రెసుకు చిల్లుపెట్టే వ్యూహం కేసీఆర్ ది.

కాంగ్రెసుతోనే కయ్యం…

తెలంగాణ రాష్ట్రసమితికి నిజమైన ప్రత్యర్థి కాంగ్రెసు పార్టీ మాత్రమే. బీజేపీ సహా మిగిలిన పార్టీలు ఓట్లు చీల్చడానికే పనికొస్తాయి తప్ప టీఆర్ఎస్ కు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కాదు. కానీ ఈ విషయాన్ని ప్రజలంతా గ్రహిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కాంగ్రెసు వైపు పోలరైజ్ అవుతాయి. అది అధికారపక్షానికి చాలా డేంజర్. అందుకే పోటీలో ఉన్న మిగిలిన పార్టీలు కూడా బలంగా ఉన్నాయన్న భావన ఓటర్లలో రేకెత్తించాలి. తద్వారా వారు కొంత గందరగోళానికి గురవుతారు. తాము సంప్రదాయకంగా నమ్ముకున్న పార్టీలకే ఓట్లు వేస్తారు. ఈ స్ప్లిట్ అయ్యే ఓటు టీఆర్ఎస్ విజయాన్ని ఖాయం చేస్తుంది. ప్రధాన ప్రత్యర్థిని చిన్నబరిచి బహుముఖంగా బలమైన పోటీదారులు ఉన్నట్లుగా ప్రచారం చేయగలిగితే వచ్చే అడ్వాంటేజీని వాడుకోవాలనుకుంటున్న టీఆర్ఎస్ వ్యూహాన్ని కనిపెట్టి కట్టడం చేయడం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెసుకు అంత సులభమేమీ కాదు. బీఎల్ఎఫ్, కోదండరామ్ పార్టీ సహా మిగిలిన చిన్నాచితక పార్టీలను కూడా ఒకే తాటిపైకి తేగలిగితేనే కాంగ్రెసుకు లాభిస్తుంది. సామదానభేదోపాయాలతో ప్రత్యర్థి పార్టీల వైరుద్ధ్యాలను పెంచి, వాటిని చీల్చగల కేసీఆర్ అంతటి అవకాశం కాంగ్రెసుకు ఇస్తారనుకోవడం అత్యాశే.

 

-ఎడిటోరియల్ డెస్క్