ఏది న్యాయం? ఏది ధర్మం?

భారతరాజ్యాంగంలో చట్టసభలకు, న్యాయవ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది. ఇవి రెండూ స్వతంత్రంగా పనిచేసేందుకు అవసరమైన అధికారాలు రాజ్యాంగబద్ధంగా దఖలు చేశారు. ప్రభుత్వం కూడా ప్రధాన విభాగమే అయినప్పటికీ చట్టసభకు జవాబుదారీగా వ్యవహరించాలి. స్వేచ్ఛ, సంపూర్ణ నిర్ణయాధికారాలు కలిగినవి మాత్రం న్యాయ,చట్ట సభలే. వీటికి కూడా రాజ్యాంగప్రమాణంగా కొన్ని పరిధులు, పరిమితులు ఉన్నాయి. వీటిని అతిక్రమించి మరో వ్యవస్థ కంటే తామే అధికులమని ఎక్కువగా ఊహించుకున్నప్పుడు భంగపాటు తప్పదు. స్వేచ్ఛ ఉంది కదా? అని ఎదుటివారిపై పెత్తనం చేయాలని ప్రయత్నించినా, అనుచిత నిర్ణయాలు తీసుకున్నా ఘర్షణ తప్పదు. ఇప్పుడు దేశంలో సాగుతున్న రాజ్యాంగ వ్యవస్థల మధ్య పోరుకు తాజా ఉదాహరణ కోమటి రెడ్డి , సంపత్ ల ఉదంతం. ప్రజాతీర్పుతో ఎన్నికైన వీరి సభ్యత్వాల రద్దుపై శాసనసభ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లుగా న్యాయస్థానం ప్రకటించింది. దీనిని శాసనసభ అంగీకరించి దిద్దుబాటు చేసుకుంటుందా? వారిని సభలోకి అనుమతిస్తుందా? లేక తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమై బేఖాతరు చేస్తుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

సహజన్యాయానికి చెల్లుచీటీ….

భారతదేశంలో సుప్రీం కోర్టు, హైకోర్టులను రాజ్యాంగ న్యాయస్థానాలుగా చెప్పుకోవాలి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల చర్యలను ప్రశ్నించేందుకు, ఒకవేళ చట్టసభలు సైతం రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలు చేస్తే వాటిని కొట్టివేసేందుకు కూడా వీటికి అధికారాలున్నాయి. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించేందుకు న్యాయస్థానాలు సంపూర్ణ స్వేచ్చను కలిగి ఉంటాయి. వివిధ రూపాల్లో దాఖలయ్యే రిట్లను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం, విధినిషేధాలు జారీ చేస్తుంటాయి. పౌరులపై కక్ష సాధింపుకు పాల్పడకుండా, పాలన కట్టుతప్పకుండా చూస్తుంటాయి. రాజకీయాలతో ప్రేరేపితమయ్యే చట్టసభలు, ప్రభుత్వాల పట్ల ప్రజల్లో అసంతృప్తి, అపనమ్మకం రోజురోజుకీ పెరుగుతోంది. కానీ న్యాయవ్యవస్థ పట్ల ఇంకా విశ్వాసం పూర్తిగా సన్నగిల్లలేదు. అదే కోర్టులకు నైతికస్థైర్యాన్నిస్తోంది. తెలంగాణ శాసనసభ్యులు కోమటిరెడ్డి, సంపత్ లకు కనీసం నోటీసులు జారీచేసి, వివరణ కోరకుండా శాసనసభ వారి సభ్యత్వాన్ని రద్దు చేయడమంటే సహజన్యాయసూత్రాన్ని ఉల్లంఘించడమేనని కోర్టు భావించింది. తీసుకున్న చర్యలోని హేతుబద్దతను ప్రశ్నించలేదు. వారికి లభించాల్సిన హక్కును నిరాకరించినందుకు సభానిర్ణయాన్ని కొట్టి వేసింది. తీవ్రమైన నేరం చేసి ఉరిశిక్ష వేసేంతటి అభియోగాలు నమోదైన నిందితుడిని కూడా నేరం చేశావా? లేదా? అని ప్రశ్నిస్తారు. విచారణలోభాగంగా అతనిపై నమోదైన అభియోగాలను ముందు పెడతారు. వాటినుంచి తనను తాను రక్షించుకునే అవకాశం కల్పిస్తారు. ఇదే సహజ న్యాయం. ఇక్కడ మాత్రం నేరం ఏమిటో సదరు సభ్యులకు చెప్పకుండానే శిక్ష విధించారనేది నిరూపణ అయ్యింది. దీంతో సభకు ఉండే రద్దు అధికారాలను ప్రశ్నించకుండానే సహజన్యాయసూత్రాన్ని ప్రవచించడం ద్వారా హైకోర్టు రాజ్యాంగబద్దంగా వ్యవహరించిందన్న విషయం తేటతెల్లమవుతుంది. నిజానికి వారికి నోటీసు ఇచ్చి, వివరణ తీసుకుని రద్దు చర్య తీసుకుని ఉంటే కోర్టు జోక్యం చేసుకునేందుకు ఆస్కారం తక్కువగా ఉండేది.

ధిక్కారమేనా?…

హైకోర్టు ఆదేశించినంత మాత్రాన శాసనసభ అమలు చేయాల్సిన అవసరం లేదనేది కొందరు న్యాయనిపుణుల వాదన. అదీ నిజమే. నిజానికి సభానిర్వహణలో బాగంగా సభ్యులపై ఎటువంటి చర్యలు తీసుకునే అధికారమైన సభాపతికి ఉంటుంది. అయినప్పటికీ సభ్యులపై చర్యకు ఒక ప్రొసీజర్ పాటిస్తుంటారు. సభ్యుల బహిష్కరణపై తీర్మానం ప్రవేశపెట్టమని ప్రభుత్వానికి సూచించి సభ ఆమోదంతోనే స్పీకర్లు నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇక్కడ జరిగింది కూడా అదే. సభామోదంతో సంపత్, కోమటిరెడ్డిలను బహిష్కరించారు. ఒక వారం, లేదా బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ వారిని సస్పెండ్ చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. కానీ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారి హక్కులను పూర్తిగా రద్దు చేస్తూ ఎమ్మెల్యేలుగా అనర్హులను చేసేశారు. ఇది అసాధారణమైన నిర్ణయం, అందుకే రాజ్యాంగం, సహజన్యాయం వంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చింది. తమ సొంత సభ్యునికే సంజాయిషీ, వివరణ అవకాశం ఇవ్వకుండా శాసనసభ ఏకపక్షంగా వ్యవహరించిందా? లేక సభ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయడం ద్వారా న్యాయస్థానమే వేరొక రాజ్యాంగ వ్యవస్థ నిర్ణయంలో జోక్యం చేసుకుందా? అన్న విషయం తేలాల్సి ఉంది. రాజ్యాంగానికి భాష్యం చెప్పే సుప్రీం కోర్టు ఈవిషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. ఎందుకంటే రాజకీయాలు ప్రతిపనిలో రాజ్యం చేసే వ్యవస్థకు నిర్దిష్టమైన విధివిధానాలు ఉండటం ఎంతైనా అవసరం. సంపత్; కోమటిరెడ్డి లేవనెత్తిన రాజకీయ కక్ష, చట్టవిరుద్దం వంటి అంశాల జోలికి న్యాయస్థానం పోలేదు. రాజకీయాలు లేకుంటే చట్టసభలు ఎలా అవుతాయి? మెజార్టీ పక్షం ప్రభుత్వంగా ఉంటుంది. ఆ పార్టీ సభ్యులే స్పీకరుగా ఉంటారు. అందువల్ల పూర్తిగా పక్షపాత రహితంగా వ్యవస్థలు పనిచేస్తాయని చెప్పే పరిస్థితి లేదు. అందుకే ప్రత్యర్థులపై రాజకీయాస్త్రంగా చట్టసభలను వినియోగించకుండా రాజ్యాంగపరమైన నియంత్రణ అవసరం.

ఎవరికి మేలు…?

తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు కూడా రాజకీయం రంగప్రవేశం చేసేసింది. న్యాయస్థానం తీర్పు రావడంతోనే ముఖ్యమంత్రి , స్పీకర్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెసు పార్టీ డిమాండ్లు మొదలు పెట్టింది. వ్యక్తులుగా వారు ప్రభుత్వానికి, సభకు నేతృత్వం వహించి ఉండవచ్చు. కానీ ఇది సభా నిర్ణయం . సభనే తప్పు పడతారా? చేసిన పొరపాటును దిద్దుకోవాలని కోరతారా? నాయకులు వ్యవస్థ దిద్దుబాటు కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ కోరుకుంటారు. అందుకే సంపత్, కోమటి రెడ్డి హక్కుల పునరుద్ధరణ కంటే కాంగ్రెసు పార్టీకి ఎంతమేలు చేకూరుతుందనే విషయంపైనే దృష్టి పెరిగింది. కోర్టు తీర్పును అంగీకరిస్తే తాము చేసింది తప్పేనని అంగీకరించినట్లవుతుంది. అందుకే శాసనసభాపతి కూడా న్యాయస్థానం ఉత్తర్వును అమలు చేస్తారని భావించలేం. అయితే న్యాయస్థానానికి ఉన్న విశేషాధికారాల కారణంగా సాంకేతికంగా వారు తిరిగి ఎమ్మెల్యేలుగా పునరుద్దరించబడినట్లే లెక్క. ఎన్నికల కమిషన్ కూడా దీనిని గుర్తిస్తుంది. తిరిగి ఎన్నికలు నిర్వహించదు. అయితే సభలోకి వారిని అనుమతించే అధికారం మాత్రం స్పీకర్ చేతిలోనే ఉంటుంది. మరో నాలుగు నెలల వరకూ సభ జరిగే అవకాశమూ లేదు. అంతవరకూ మౌనం రాజ్యం చేస్తుంది. చర్చ సాగుతూనే ఉంటుంది. కాంగ్రెసుకు కాసింత ప్రయోజనమనే వెసులుబాటు దక్కుతుంది. అనేక సందర్బాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. సర్కారుకు ఎదురుదెబ్బలు తగిలాయి. కొన్ని నిర్ణయాలను ఉపసంహరించుకుని, మరికొన్నిటిని ప్రభుత్వం సవరించుకున్న ఉదంతాలున్నాయి. అయితే ఇప్పుడు శాసనసభ అనే బ్రహ్మాస్త్రం అడ్డుగా ఉండటంతో ప్రభుత్వం న్యాయవ్యవస్థకు చెక్ పెట్టాల్సిందేనని పట్టుదలకు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*