కేసీఆర్ కు ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందా ..?

ఫెడరల్ ఫ్రంట్ పేరిట దేశాటన మొదలు పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు. ఈ ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యం ఏమిటి ? కేసీఆర్ ప్రధాని కావడమేనా ?. గతంలో కేసీఆర్ ప్రధాని అవుతారంటూ ఆయన కుమార్తె కవిత వ్యాఖ్యలు చేయడం టీఆర్ఎస్ బాస్ అంతర్గత ఎజెండా అదేనని సూచిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందా అనే వాదన హాట్ టాపిక్ గా మారింది.

దేవెగౌడ, గుజ్రాల్ ఆదర్శంగా ….

కలగూర గంపగా దేశ రాజకీయాలు మళ్ళీ తెరపైకి వస్తాయని రాబోయే ఎన్నికలపై ప్రాంతీయ పార్టీల అంచనా. బిజెపి, కాంగ్రెస్ కు లోక్ సభ లో పూర్తి మెజారిటీ వచ్చేది లేదని ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పే రోజులు వస్తున్నాయని లెక్కలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం ఇప్పటినుంచి జాతీయ రాజకీయాలను సమూలంగా మారుస్తా అంటూ కొత్త నినాదంతో దేశవ్యాప్త పర్యటన ప్రారంభించారు. ముందుగా వాస్తు ప్రకారం తూర్పు ఈశాన్యంలో వున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో సమావేశం అయ్యారు. ఆ తరువాత కర్ణాటక వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ తో భేటీ అయ్యారు. తాజాగా చెన్నై లో డీఎంకే అధినేత స్టాలిన్, వ్యవస్థాపకుడు కరుణానిధి తో. ఇలా ఆయన తన భవిష్యత్తు రాజకీయ సమీకరణాల కోసం పునాది వేసుకునే పనిలో బిజీ గా వున్నారు. సంకీర్ణ రాజకీయ యుగంలో ఎవరైనా ప్రధాని కావొచ్చన్నది గతంలో దేవెగౌడ, ఐకే గుజ్రాల్ నిరూపించారు. 89 – 90 లలో విపి సింగ్ సైతం ప్రధాని కాగలిగారు. వీరంతా గతంలో కాంగ్రెస్ మద్దత్తు తోనే ప్రభుత్వాలు కొద్ది కాలం అయినా సాగించారు.

సెంటిమెంట్ కోసమేనా ……..

అయితే గతంలో వున్న పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు. దేశంలో మమతా బెనర్జీ ప్రధాని పదవిని టార్గెట్ చేశారు. యుపిలో మాయావతి, ములాయంల లక్ష్యం అదే. ఏపీలో తన కుమారుడు లోకేష్ రాజకీయంగా అందిరావడంతో చంద్రబాబు చక్రం తిప్పుతారు. అందుకే ఆయన 25 ఎంపీ సీట్లు స్లోగన్ అందుకున్నారు. కర్ణాటకలో దేవెగౌడ మళ్ళీ ఒక రాయి విసురుదామని చూస్తున్నారు. ఇక తమిళనాడులో స్టాలిన్ ఛాన్స్ వస్తే వదిలే రకమేమి కాదు. ఇందరు ప్రధాని అభ్యర్థులు ప్రాంతీయ పార్టీల్లో వున్నప్పుడు 17 పార్లమెంట్ సీట్లే వున్న కేసీఆర్ ఎలా పోటీదారుడు అవుతారనే ప్రశ్న ఎదురవుతుంది. అయితే సంకీర్ణ రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితుల్లో కేసీఆర్ కొత్త ఆట కు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే సెంటిమెంట్ పునాదులపై నిర్మితమయిన టీఆర్ఎస్ కు ఆ కోరిక నెరవేరాకా ప్రజల్లో మరో సెంటిమెంట్ అంశం లేకుండా పోయింది. దాంతో కేసీఆర్ ప్రధాని అభ్యర్థిగా ఎదగాలంటే తెలంగాణ సమాజం 17 పార్లమెంట్ సీట్లు ఆయనకు సమర్పించుకోవాలి అనేది హిడెన్ అజెండా ఏమి కాదు బహిరంగమే.

ఏపీలో బాబు హిడెన్ ఎజెండా అదే …

మన రాష్ట్రం… మన భవిష్యత్తు అనే స్లోగన్ బాగా వర్క్ అవుట్ అవుతుందనే ఏపీలో చంద్రబాబు సైతం ఇదే నినాదంతో రాబోయే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. అయితే ఆయన ప్రధాని పదవికి పోటీ అన్నది హిడెన్ ఎజెండాగానే అమలు చేస్తున్నారు. ఏపీకి అన్యాయం జరిగింది. అది సరిచేయాలంటే 5 కోట్ల మంది నా వెనుకే ఉండాలంటున్నారు చంద్రబాబు. ఆ విధమైన సెంటిమెంట్ ను ప్రజల్లో బాగా రాజేస్తున్నారు బాబు. ఇప్పుడు కేసీఆర్ సైతం ఈ ఫార్ములాను బహిరంగంగా పెట్టి బంగారు తెలంగాణ రావాలంటే రాష్ట్రం మొత్తం నాకు అండగా వుండండి, దేశ రాజకీయ యవనికపై నా సత్తా తెలంగాణ బిడ్డగా చాటిచెబుతా హైద్రాబాద్ కేంద్రంగా భూకంపం, సునామీలు సృష్టిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు విసురుతున్నారు. తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు జాతీయ రాజకీయాల సెంటిమెంట్ ను రాబోయే ఎన్నికలకు కేసీఆర్ ఉపయోగిస్తున్నారని స్పష్టంగా తేలిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వివిధ ప్రాంతీయ పార్టీల సారధుల కలలు ఎవరికీ సాకారం అవుతాయో చూడాలి.