కేసీఆర్ ఏం చేసినా? అందుకేనా?

దేశంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీల‌కు ప్ర‌త్యామ్నాయంగా రాజ‌కీయ‌శ‌క్తిని కూడ‌గ‌ట్ట‌డం..దేశ రాజ‌కీయాల్లో గుణాత్మక మార్పుకోసం జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరే పార్టీలు, ఆ పార్టీ అధినేతలతో దశలవారీగా భేటీ కావడానికి ఇప్పటికే సీఎం ప‌క్కా ప్ర‌ణాళిక‌ రూపొందించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవేగౌడలతో కేసీఆర్‌ భేటీ అయి ప్రస్తుత రాజకీయాలు, జాతీయ స్థాయిలో పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.

వచ్చే నెలలో ఒడిషాకు…..

వ‌చ్చే నెల‌లో సీఎం కేసీఆర్‌ ఒడిశాలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌తో ఆయన సమావేశం కానున్నారు. ఒడిశాలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో మే మొదటి వారంలో నవీన్‌ పట్నాయక్‌తో భేటీ కావాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే మొద‌ట ఇప్ప‌టికే దేశ రాజ‌కీయాల్లో మంచి ప‌ట్టున్న ప్రాంతీయ పార్టీల నేత‌ల‌ను క‌లిసేందుకే ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఒడిశాలో తిరుగులేని నేత‌గా ఉన్న న‌వీన్ ప‌ట్నాయ‌క్‌తో ఆయ‌న మీట్ అవుతున్నారు.

రిటైర్డ్ ఉద్యోగులతో……

బీజేపీ అంటే అస్స‌లు గిట్ట‌ని న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఇప్పుడు ఆ పార్టీకి వ్య‌తిరేకంగా కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే అందులోకి వెళ్లే ఛాన్సులు కూడా ఉన్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా. ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌ల్లో కీల‌కంగా ప‌నిచేసిన రిటైర్డ్ ఉన్న‌తాధికారుల‌తో కూడా ఆయ‌న స‌మావేశం కానున్నారు. ఇక్క‌డి నుంచే దేశంలో ఉన్న అపార‌మైన వ‌న‌రులు, వినియోగం, ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భుత్వాలు అవ‌లంబించిన త‌ప్పుడు విధానాల‌పై కీల‌క స‌మాచారం, స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకునేందుకు ఆయ‌న క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

కర్ణాటకలో జేడీఎస్ కు…..

ఇప్ప‌టికే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో జేడీఎస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు కేసీఆర్‌. తెలుగు ప్ర‌జ‌లు జేడీఎస్‌కే ఓటు వేయాల‌ని కోరారు. అంతేగాకుండా దేవేగౌడ ఆహ్వానిస్తే.. పార్టీ త‌రుపున ప్ర‌చారం కూడా చేస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇక్క‌డి నుంచే తానంటే ఏమిటో నిరూపించుకోవాల‌ని కేసీఆర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎంఐఎం కూడా జేడీఎస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇక హైద‌రాబాద్ వ‌ర‌కు అండ‌ర్ స్టాండింగ్ ఉండాలంటే ఎంఐఎం కూడా కేసీఆర్‌కు స‌పోర్ట్ చేసిన‌ట్టే.

ప్లీనరీలో కీలక ప్రకటనలు…

క‌ర్ణాట‌క‌లో ఉన్న తెలుగు మాట్లాడే ప్ర‌జ‌ల్ని, ఉర్దూ మాట్లాడే ప్ర‌జ‌ల్ని జేడీఎస్‌కు ద‌గ్గ‌ర చేసి, ఆ పార్టీకి అండ‌గా నిలవాల‌న్నదే కేసీఆర్ ప్లాన్ అని ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు టీఆర్ఎస్ పార్టీ ప్లీన‌రీని ఈనెల 27 నిర్వ‌హించేందుకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్లీన‌రీలో కూడా సీఎం కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్లీన‌రీ వేదిక నుంచి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ శంఖారావం పూరిస్తార‌ని అంటున్నాయి. ఈ ప్లీన‌రీకి దేశంలోని ప‌లు ప్రాంతీయ పార్టీల నేత‌ల‌ను కూడా ఆహ్వానించే ఆలోచ‌న‌లో కూడా కేసీఆర్ ఉన్న‌ట్లు స‌మాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*