ఫైరింగ్ అక్కడి నుంచే…..!!

kcrmodi-loksabah-election-stratagy

తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగానే కదులుతున్నారు. తాను ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లిందీ చెప్పేశారు. భవిష్యత్తు ప్రస్థానాన్నీ ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెసులు ప్రజల అంచనాలను అందుకోలేకపోతున్నాయన్నదీ చెప్పేశారు. ఏదేమైనప్పటికీ జాతీయ స్థాయిలో పాత్ర పోషణకు తాను సిద్ధమైపోతున్నానని స్పష్టం చేసేశారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ వివిధాంశాలపై తన మనోభావాలను వెల్లడించారు. 2019 రాజకీయ ముఖచిత్రానికి జోస్యం చెప్పారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో తనకు ప్రధానప్రత్యర్థి. బీజేపీతో పూర్తిగా జట్టుకట్టే స్థితి లేదు. ముస్లిం ఓట్లు పూర్తిగా దూరమైతే తెలంగాణలో గట్టెక్కడం అంత ఈజీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ వంటి పార్టీలు బీజేపీతో జట్టు కట్టినప్పటికీ పెద్దగా దాని ప్రభావం పడలేదు. విశాలమైన రాష్ట్రం కావడం వల్ల మైనారిటీలు ప్రభావవంతమైన ఓటింగుగా మారలేదు. అందులోనూ తెలుగుదేశం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆంధ్రాలోని మైనారిటీలను మచ్చిక చేసుకుంటూ తెలంగాణలో ఓట్లు,సీట్లు తగ్గినా కనిపించనీయకుండా చూసుకొనేది. 1999లో కార్గిల్ కలిసొచ్చింది. 2014లోనూ తెలివిగానే ప్రవర్తించింది. రాష్ట్రవిభజన అనే భావోద్వేగంతో మిగిలిన సెంటిమెంట్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కమలం దోస్తీ మంచే చేసింది. కేసీఆర్ కు అటువంటి వెసులుబాటు లేదు. అందువల్ల మిగిలిన పార్టీలు ఏరకమైన బీజేపీతో కలిసిపోతున్నారంటూ విమర్శలు చేసినా దూరం నుంచే నియంత్రించే ఛాన్సులు ఎక్కువ.

కుడిఎడమలు…

తెలంగాణ రాష్ట్రసమితి మిగిలిన పార్టీలతో దోబూచులాడుతోందని చెప్పాలి. 2019 లోక్సభ ఎన్నికల్లో సంపూర్ణమైన ఆధిక్యత రాకపోతే టీఆర్ఎస్ వంటి పక్షాలపై ఆధారపడాల్సి వస్తుందని బీజేపీ అధినాయకత్వం గ్రహించింది. అందులో భాగంగా ఆంధ్రాలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని, తెలంగాణలో టీఆర్ఎస్ ను , ఒడిసాలో బిజూజనతాదళ్ ను, తమిళనాడులో ఏఐఏడీఎంకేను దగ్గర చేసుకోవాలని చూస్తోంది. ఈపార్టీలన్నీ ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలో లేవు. ఇవన్నీ కలిసి కనీసం 60 లోక్ సభ స్థానాలు తెచ్చుకుంటాయని బీజేపీ అంచనా. ఇప్పటికున్న సర్వేల ప్రకారం 2019 లో బీజేపీ 200 సీట్లలోపునకు పరిమితం కావచ్చని భావిస్తున్నారు. మిగిలిన ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కలిపినా 30 సీట్లు మించి తెచ్చుకోలేవనేది వాస్తవిక అంచనా. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అదనంగా 40 సీట్లకు పైగానే అవసరమవుతాయి. ప్రస్తుతం కాంగ్రెసు సారథ్యంలోని యూపీఏ లోనూ, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలోనూ లేకుండా తటస్థంగా ఉన్న పార్టీలపై దృష్టి పెడుతున్నారు. కేసీఆర్ గతంలో బీజేపీకి అనేక సందర్భాల్లో మద్దతు పలికారు. బేషరతుగా కేంద్రప్రభుత్వ నిర్ణయాలను సమర్థించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ నుంచి సానుకూల స్పందన లభిస్తుందని బీజేపీ భావిస్తోంది. అయితే కేసీఆర్ ఆలోచన మరోవిధంగా ఉంది. ఎంఐఎం సైతం టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్న దృష్ట్యా ఇప్పటికిప్పుడు కమలానికి సంబంధించి నిర్ణయం ప్రకటించే అవకాశం లేదు. ఏరకంగానూ అంటకాగేందుకూ ప్రయత్నించరు. ఇదే విషయాన్ని అన్యాపదేశంగా మీడియాతో చెప్పేశారు.

రిలాక్స్ డ్ రోల్….

2019 ఎన్నికల్లో ఎటువంటి ఆందోళన, ఆతృత లేని రిలాక్స్ డ్ పాత్ర పోషించాలని కేసీఆర్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వ పగ్గాలు దక్కితే ఆపై రాజకీయాధికారం స్థిరపడిపోతుంది. బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి కడతానంటూ తిరుగుతున్న చంద్రబాబు నాయుడు తన రాష్ట్రానికే పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అక్కడి అసెంబ్లీ ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్య. బలమైన పోటీదారులు బరిలో ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ కు మాత్రం అటువంటి టెన్షన్ లేదు. కేటీఆర్, హరీశ్, కవితలు ఇక్కడి లోక్ సభ ఎన్నికలను మేనేజ్ చేసేస్తారు. ఆంధ్రాసహా దేశవ్యాప్తంగా పర్యటించేందుకు అవకాశం చిక్కుతుంది. ప్రధానంగా ఏపీపై దృష్టి సారించి తనకు అనుకూలమైన ప్రభుత్వం అక్కడ నెలకొనేందుకు కృషి చేసే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి నడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని అక్కడి ప్రజలను కన్విన్స్ చేసేందుకు కేసీఆర్ ప్రచారం ఉపకరించవచ్చు. వైసీపీ వంటి పార్టీలను ఇందుకు వేదికలుగా మలచుకునే చాన్సులు ఎక్కువ. అటు కాంగ్రెసు, ఇటు బీజేపీ కూటముల్లో కలవని పార్టీలు చాలా ఉన్నాయి. వాటిని కూడా కన్విన్స్ చేసి , ఒక బలమైన కూటమిగా ఉంటేనే రాష్ట్రాల డిమాండ్లు నెరవేర్చుకోవడం సాధ్యమవుతుందని చెప్పేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే ఎంఐఎంతో దోస్తీ ఉన్నట్లు బహిరంగంగానే చెప్పేశారు. దీనిని ఆసరాగా చేసుకుంటూ తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లోని మైనారిటీలను మచ్చిక చేసుకుని ఆయా ప్రాంతీయపార్టీలకు అనుకూలంగా మద్దతు సమీకరించే యత్నాలు కూడా చేయవచ్చు.

పర్మినెంట్ చెక్…

రాజకీయాల్లో రెండు వైపులా పదునున్న కత్తిలా వ్యవహరించాలని భావిస్తున్నారు కేసీఆర్. నాలుగైదు పార్టీలతో జట్టుకట్టి లోక్ సభలో 40 నుంచి 50 స్థానాలు కిట్టీలో పెట్టుకోగలిగితే కేంద్రప్రభుత్వాన్ని శాసించే అవకాశం దక్కుతుంది. తమ కూటమి సమాన భాగస్వామిగా కేంద్రంలో ప్రాతినిధ్యం వహించవచ్చని భావిస్తున్నారు. ఉప ప్రధాని పదవిసహా కీలకశాఖల్లో వాటా కోరేందుకు వీలుంటుంది. ఇదే యోచనతో మిగిలిన ప్రాంతీయ పార్టీలను కూటమికి ఒప్పించే పని పెట్టుకోబోతున్నట్లు కేసీఆర్ ఆంతరంగిక వర్గాల సమాచారం. మమతాబెనర్జీ, మాయావతి వంటివారికి నరేంద్రమోడీతోనే విభేదాలున్నాయి. బీజేపీతో పెద్దగా వైముఖ్యం లేదు. బీజేపీ 200 లోపు సీట్లకు పడిపోతే మోడీ హవా పూర్తిగా అడుగంటిపోతుంది. ప్రత్యామ్నాయ ప్రధాని అభ్యర్థిని తెరపైకి తెచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పుడు బీజేపీతో కలిసేందుకు కూడా పెద్దగా ఆటంకాలుండవు. కాంగ్రెసు, బీజేపీల ఆధిపత్య ధోరణికి పర్మినెంట్ చెక్ పెడుతూ దేశ రాజకీయాల దశదిశ మార్చాలనేది కేసీఆర్ ఆలోచనగా సన్నిహితులు పేర్కొంటున్నారు. రానున్న నాలుగైదు నెలలు ఇందుకోసమే వెచ్చించబోతున్నట్లు సమాచారం.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*