కేఈ గెలుపు కష్టమేనట..కారణాలివే….!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి కోరిక నెరవేరుతుందా? తన వారసుడు శ్యాంబాబును ఎమ్మెల్యేగా చేయాలనుకుంటున్న తరుణంలో అనేక అవాంతరాలు కేఈకి ఎదురవుతున్నాయి. కేఈ కుటుంబంలోని వ్యక్తులుగా భావించే వారే ఆయనను వ్యతిరేకించడానికి కారణాలేంటి…? శ్యాంబాబు రాజకీయ అరంగేట్రం సాఫీగా జరుగుతుందా? లేదా? ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఇదే హాట్ టాపిక్. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది కేఈ కృష్ణమూర్తి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావించిన నాటి నుంచి నేటి వరకూ పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న వ్యక్తి కేఈ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పార్టీ కూడా ఆయనకు అనేక పదవులు ఇచ్చింది.

శ్యాంబాబాను పోటీకి దింపాలని…..

అయితే వచ్చే ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆయన తన కుమారుడు కెఈ శ్యాంబాబును బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం కేఈ కుటుంబానికి కంచుకోట. గత పదిహేనేళ్లుగా కేఈ కుటుంబమే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. ఇక్కడ వన్ సైడ్ పోలింగ్ జరగడమనేది అన్ని ఎన్నికల్లోనూ చూస్తాం. కేఈకి వన్ సైడ్ పోలింగ్ జరగడానికి కారణాలు కూడా లేకపోలేదు. పార్టీ ఓటింగ్ తో పాటు కేఈ ఫ్యామిలీకి కూడా పట్టుండటమే. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా వెల్దుర్తి, క్రిష్ణగిరి, తుగ్గలి, మద్దికెర, పత్తికొండ మండలాలు ఈ నియోజకవర్గంలో కలిశాయి.

ప్రత్యర్థి ప్రజల్లోకి బలంగా…..

వీటిలో క్రిష్ణగిరి, తుగ్గలి, పత్తికొండ మండలాలు పసుపు పార్టీకి పెట్టని కోట. మిగిలిన మద్దికెర, వెల్దుర్తి మండలాలు వైసీపీ పార్టీకి పూర్తిగా అనుకూలం. కేవలం ఆ మూడు మండలాల కారణంగానే కేఈ కుటుంబం పత్తికొండలో జెండాను ఎగురేస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో కేఈ కృష్ణమూర్తి కేవలం ఏడు వేల ఓట్ల మెజారిటీతోనే గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కోట్ల హరిచక్రపాణిరెడ్డి పోటీ చేశారు. ఇప్పుడు ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాని ఇక్కడ బలమైన వైసీపీ ప్రత్యర్థి ఉండటం కేఈని కలవరపరుస్తోంది. చెరుకులపాడు నారాయణరెడ్డి భార్య శ్రీదేవిని పత్తికొండ అభ్యర్థిగా వైసీపీ అధినేత జగన్ ఆరు నెలల క్రితమే ప్రకటించారు. దీంతో శ్రీదేవి తన భర్తను హత్యచేసిన వారిపై రాజకీయంగా పగ తీర్చుకోవాలని ఊరూరా తిరుగుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు. నారాయణరెడ్డి హత్య కేసులో శ్యాంబాబు నిందితుడని శ్రీదేవి గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఇది కేఈ కుటుంబానికి పెద్దదెబ్బేనన్నది విశ్లేషకుల అంచనా. కేఈ కూడా రాజకీయాల నుంచి విరమించడంతో తమనే ప్రజలు విశ్వసిస్తారని శ్రీదేవి వర్గీయులు భావిస్తున్నారు.

బలమైన నేత దూరమైతే…..

ఒకవైపు ప్రత్యర్థి బలంగా ఉండగా మరోవైపు సొంత పార్టీలోనే విభేదాలు తలెత్తడం కేఈకి చికాకును తెప్పిస్తుంది. కేఈ కృష్ణమూర్తి తన కుటుంబ సభ్యుడిగా భావించే తుగ్గలి నాగేంద్ర కేఈ వర్గానికి దూరమయ్యారని చెబుతున్నారు. ఆయన రాష్ట్ర శాలివాహన ఫెడరేషన్ ఛైర్మన్. తుగ్గలి నాగేంద్రకు, కేఈ కృష్ణమూర్తి సోదరుడు ప్రభాకర్ కు మధ్య పడటం లేదు. గతంలో మినీ మహానాడు సందర్భంగానే వీరిమధ్య విభేదాలు బయటపడ్డాయి. దీంతో నాగేంద్ర దూరంగా ఉంటున్నారు. తుగ్గలి మండలంలో నాగేంద్రకు పట్టుంది. ఆయన అండతోనే కేఈ కుటుంబం సులువుగా ఎన్నికల్లో నెగ్గుకొస్తుందంటున్నారు. తుగ్గలి నాగేంద్ర జడ్పీటీసీగా తన భార్యను భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. దీన్ని బట్టి ఆయనకు ఆ మండలంలో పట్టు అర్థమవుతోంది. కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగానే కేఈ ప్రభాకర్ కు, తుగ్గలి నాగేంద్రకు మధ్య గ్యాప్ ఏర్పడింది. అయితే కేఈ తిరిగి తుగ్గలిని దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. నాగేంద్ర కేఈకుటుంబానికి దూరమైతే పత్తికొండలో కేఈ శ్యాంబాబు విజయం అంత తేలిక కాదన్నది కేఈకి తెలియంది కాదు. మొత్తం మీద తన కుమారుడిని తొలిసారి రాజకీయాల్లోకి తీసుకొస్తున్న సమయంలో పత్తికొండ నియోజకవర్గంలోని టీడీపీలో విభేదాలు తమకు కలసి వస్తాయని వైసీపీ భావిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*