ఎమ్మెల్యే ను పాయింట్ బ్లాంక్ లో చంపారు….!

మావోయిస్టులు కాచుకూర్చున్నారు. ఇటీవల వరుసగా ఆంధ్రా ఒడిశా బార్డర్ లో మావోయిస్టుల ఏరివేత, ఎదురు కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు విరుచుకుపడతారని ఇంటలిజెన్స్ వర్గాలు ముందుగానే హెచ్చరించాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తమకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలకు వెళ్లవద్దని కూడా ఇంటలిజెన్స్ సూచించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో కూడా ఇంటలిజెన్స్ ఇలాంటి హెచ్చరికలే చేయడంతో అందులో ఒక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు.

గ్రామదర్శినికి వెళుతుండగా……

ఈ నేపథ్యంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరరావును పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపారు. అరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరారు. గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు భోజనం చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయటకు వస్తుండగా సుమారు యాభై మంది మావోయిస్టులు ఎమ్మెల్యే కిడారిని చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఆయనకు అతి సమీపానికి వచ్చి పాయింట్ బ్లాంక్ లో కాల్పులు జరపగా కిడారి సర్వేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన తోపాటు అరకు మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను మావోయిస్టులు టార్గెట్ చేసుకున్నారు.

వాహనాన్ని ఆపి మరీ……

ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపిన మావోయిస్టులు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను వాహనం లో ఉంచి మిగిలిన వారిని దించేశారు. వాహనం నుంచి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలు దిగుతుండగా సమీపం నుంచి కాల్పులు జరిపారు. కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఆయనను అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. కిడారి సర్వేశ్వరరావు తొలిసారి 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి మారారు. నిన్ననే మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహించారు. ఎమ్మెల్యే తో పది నిమిషాలు మావోయిస్టులు అటవీ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను వివరించిన తర్వాత కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో హై అలెర్ట్

అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకు ఎమ్మెల్యే మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. ఎమ్మెల్యేలు ఎవరు తమకు తెలియకుండా పర్యటనకు వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామాలను వదిలి పట్టణ ప్రాంతాలకు రావాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*