‘‘కిరణ్’’కు బేడీలు పడినట్లేనా?

కిరణ్ బేడీ…..ఈతరం వారికి ఆమె గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ పాతతరం వారికి ఈ పేరు అత్యంత సుపరిచితం. దేశంలో తొలి మహిళ ఐపీఎస్ అధికారిగా ఆమె ఎంతోమంది యువతులకు స్ఫూర్తిదాయకం. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నిప్పులాంటి అధికారి. తీహార్ జైలు అధకారిగా ఖైదీల పరివర్తనకు ఎంతగానో కృషి చేశారు. అదే సమయంలో ఢిల్లీ ఏసీపీగా అక్రమార్కుల ఆట కట్టించారు. ఆమె ఉద్యోగ ప్రస్థానం అందరికీ ఆదర్శ ప్రాయమనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కరలేదు. పదవీ విరమణ అనంతరం కూడా వార్తల్లో నిలిచారు. సామాజిక కార్యకర్త అన్నాహజారే లోక్ పాల్ కోసం యూపీఏ-2 హయాంలో చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలో ఆమె క్రియాశీల పాత్రను పోషించారు.

వివాదాలకు కేంద్రబిందువుగా….

గత రెండేళ్లుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్న బేడీ సంచలనాలకు కేంద్రబిందువుగా మారారు. ముఖ్యమంత్రి నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వ రోజు వారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికి తాను జవాబుదారీ కానని పరోక్షంగా చెబుతున్నారు. అయితే తాజాగా ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ అధికార పరిధిలో పరిమితులపై సుప్రీంకోర్టు గట్టిగా తలంటిన నేపథ్యంలో కిరణ్ బేడీ దారికి రావచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి లెఫ్ట్ నెంట్ గవర్నర్ సహాయకారిగా ఉండాలే తప్ప అడ్డంకిగా మారరాదని, అభిప్రాయబేధాలు ఉంటే ముఖ్యమంత్రి, లెఫ్ట్ నెంట్ గవర్నర్ చర్చించుకుని తొలగించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు నేపథ్యంలో మొత్తం గవర్నర్ల దూకుడుకు పగ్గాలు వేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదికేవలం లెఫ్ట్ నెంట్ గవర్నర్ కే పరిమితమైన వ్యవహారం కాదని, యావత్ గవర్నర్ల వ్యవస్థకు వర్తిస్తుందన్న వాదన వినపడుతోంది. గవర్నర్ లేదా లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు ఎన్నికైన ప్రజాప్రభుత్వానికి మించి అదనపు అధికారాలు ఏమీ ఉండవని, అంతిమంగా ప్రభుత్వమే ప్రజలకు జవాబుదారీ అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం విస్పష్టంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా గత రెండేళ్లుగా చెలరేగిపోతున్న కిరణ్ బేడీ దూకుడుకు కొంతవరకైనా అడ్డుకట్ట పడగలదన్న వాదనలు వినపడుతున్నాయి. తాజా తీర్పు ఆసరాగా చేసుకుని ముఖ్యమంత్రి నారాయణస్వామి కూడా స్వరాన్ని పెంచడం గమనార్హం. సుప్రీంతీర్పును విస్మరించి వ్యవహరించినట్లయితే కోర్టు థిక్కార పిటీషన్ వేస్తానని ఆయన పేర్కొనడం విశేషం. రాష్ట్ర పాలన వ్యవహారాల్లో బేడీ మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భిన్నమైన వాదన……

సుప్రీంకోర్టు తీర్పునకు కిరణ్ బేడీ భిన్నమైన భాష్యం చెబుతున్నారు. పుదుచ్చేరిని ఢిల్లీతోపోల్చి చూడలేమని స్వయంగా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తున్నారు. రాజ్యాంగం లోని 239 AA అధికరణం కింద ఢిల్లీ ఉండగా, 239 A అధికరణ కింద పుదుచ్చేరి పాలన సాగుతోందని న్యాయస్థానం ప్రత్యేకంగా పేర్కొన్న విషయాన్ని ఆమె ఎత్తిచూపుతున్నారు. శాసన వ్యవస్థ విధులు నిర్వర్తించేందుకు గాను మంత్రి మండలి లేదా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే అధికారాన్ని 239 A అధికరణ పార్లమెంటుకు కట్టబెడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావిస్తున్నారు. ఎవరి భాష్యాలు ఎలా ఉన్నప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాని కన్నా, కేంద్రం చేత నియమితులైన లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు ఎక్కువ అధికారాలుండవు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల నుంచి వచ్చిన నాయకుడికే ఎక్కువ బాధ్యత, జవాబుదారీ తనం ఉంటుంది తప్ప ఢిల్లీ నుంచి దిగుమతి అయ్యే గవర్నర్లకు ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రపతి సహా గవర్నర్, లెఫ్ట్ నెంట్ గవర్నర్లు ఎవరైనా మంత్రి మండలి సలహాలకు బద్ధులై ఉండాల్సిందే. కేవలం కొన్ని విషయాల్లో మాత్రమే వారికి రాజ్యాంగం విచక్షణాధికారాలను కల్పించింది. అంతేతప్ప అన్ని విషయాల్లో లేదు. రోజువారీ పాలన వ్యవహారాల్లో ప్రజాప్రభుత్వానిదే పైచేయి తప్ప నామమాత్ర అధినేతలైన రాష్ట్రపతి, గవర్నర్, లెఫ్ట్ నెంట్ గవర్నర్లది కాదు. ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇదే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందునా కిరణ్ బేడీ లాంటి అనుభవజ్ఞురాలికి ఈ విషయం తెలియదని అనుకోలేం.

ప్రజలు తిరస్కరించినా……

2014 ఎన్నికల్లో మోదీని సమర్థించి 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన కిరణ్ బేడీని ప్రజలు తిరస్కరించారు. కృష్ణ నగర్ నుంచి పోటీ చేసిన ఆమె రెండు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజకీయ పునరావాసంలో భాగంగా 2016 మేలో పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఆమె ప్రభుత్వంతో గొడవ పడుతూనే ఉన్నారు. అధికారులతో నేరుగా సమావేశాలు నిర్వహించడం, అవినీతి హెచ్చరిల్లుతోందని వ్యాఖ్యలు చేయడం, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అధికారులను ఏదో పేరుతో ‘‘రాజ్ నివాస్’’కు పిలిపించడం వంటి చర్యలు కిరణ్ బేడీ స్థాయికి తగనివి. ఆమె తీరుపై 2017 జూన్ లో ఏకంగా అసెంబ్లీ తీర్మానం చేసింది. 2017 ప్రారంభంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సీఎం నారాయణస్వామి కలిసి ఫిర్యాదు చేశారు. హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ నూ కలిశారు. రాజ్యాంగానికి, కోర్టు తీర్పులకు ఎవరెన్ని భాష్యాలు చెప్పినా గవర్నర్ ది పై చేయి కాదన్నది సత్యం. ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తి అక్షరాలా అదే. దీనిని గుర్తించి గౌరవించడం అందరి బాధ్యత. లేనట్లయితే రామ్ లాల్, రమేష్ భండారీ వంటి అప్రతిష్ట గవర్నర్ గా చరిత్రలో నిలిచిపోక తప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*