కోడెల‌ను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్‌!

దాదాపు 40 ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానం. అందునా ఒకే పార్టీలో ఉన్న నేప‌థ్యం. దీంతో ఇటు పార్టీలోనూ అటు ప్ర‌జ‌ల్లోనూ కూడా ప్ర‌స్తుత స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద రావుకు మంచి ఫాలోయింగ్ ఉంది. నేరుగా చంద్ర‌బాబుతో చ‌ర్చించ‌గ‌ల దిట్ట కూడా. టీడీపీ ప్ర‌స్థానంలో ఆది నుంచి ఉన్న నాయ‌కుల్లో కోడెల ఒక‌రు. అయితే, ఆయ‌న‌కు ఇప్పుడు ఎదురు గాలి వీస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ప్రాతినిధ్యం వ‌హించాల‌న్న ఆయ‌న ఆశ‌ల‌పై రెండు ప్ర‌ధాన కార‌ణాలు నీళ్లు జ‌ల్లుతు న్నాయి. వీటిలో ఒక‌టి.. ఆయ‌నను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్‌. రెండు ఆయ‌న కొడుకు డాక్ట‌ర్ కోడెల శివ‌రామ‌కృష్ణ పై వస్తున్న ఆరోపణలు! ఇదేదో ఊసుపోక రాసుకున్న విష‌యం కాదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ఒక్క‌రిని ప్ర‌శ్నించినా చెబుతున్న విష‌య‌మే!

అన్నగారి పిలుపుతో…..

డాక్ట‌ర్ గా సేవ‌లందిస్తున్న కోడెల‌కు అనూహ్యంగా రాజ‌కీయ ఎంట్రీ ల‌భించింది. అది కూడా అన్న‌గారు ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన ద‌శ‌లోనే కోడెల ఆ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్ప‌టి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని అనూహ్య మ‌లుపులు తిరిగినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఆయ‌న పార్టీలోనే ఉన్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్యే తిరుగుతున్నారు. న‌ర‌స‌రావు పేట నుంచి వ‌రుస‌గా గెలుపొందిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేయాల్సి వ‌చ్చింది. అక్క‌డ కూడా అనూహ్య విజ‌యం న‌మోదు చేసిన కోడెల‌.. ఇటు న‌ర‌స‌రావు పేటలోను, ఇటు స‌త్తెనప‌ల్లిలోనూ త‌న దైన మార్కు రాజకీయం చేస్తున్నారు. నిజానికి ఆయ‌నకు న‌ర‌స‌రావు పేట‌తో సంబంధాలు తెగిపోయాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ గెలుపొందింది.

రెండు నియోజకవర్గాల్లోనూ….

అయినా కూడా కోడెల ఈ సీటు నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడిని నిల‌బ‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందుకే ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆయ‌న త‌న‌దైన శైలిలో విజృంభిస్తున్నారు. అయితే, చాప‌కింద నీరులా ఆయ‌న‌ను సెంటిమెంట్ వేధిస్తోంది. ఇంత‌కీ ఆ సెంటిమెంట్ ఏంటంటే.. స్పీక‌ర్‌గా ప‌ద‌విలో ఉన్న‌వారు త‌దుప‌రి ఎన్నిక‌ల్లో పోటీ చేసినా.. ప‌రాజ‌యం పాల‌వుతుండ‌డ‌మే! సో.. ఇప్పుడు స్పీక‌ర్‌గా ఉన్న కోడెల‌.. త‌దుప‌రి 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే.. గెలుస్తారా? ఓడ‌తారా? అనే సందేహం నెల‌కొంది. కాసింత హిస్ట‌రీలోకి వెళ్తే.. 1978లో స్పీకర్‌ పదవి నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దివి శివరాం తండ్రి దివి కొండయ్య చౌదరి మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేదు. ఆయన తరువాత ఆ పదవి నిర్వహించిన ఎ.ఈశ్వరరెడ్డి(తిరుపతి) ఘోరంగా ఓడిపోయి రాజకీయంగా తెరమరుగు అయ్యారు.

స్పీకర్లుగా చేసి వరుసగా…..

టీడీపీ హయాంలో స్పీకర్‌ పదవి నిర్వహించిన సత్యనారాయణ 1984లో నాదెండ్లకు మద్దతు ఇచ్చి.. మంత్రి అయి.. రాజకీయంగా పూర్తిగా తెరమరుగు అయ్యారు. 1985లో స్పీకర్‌ పదవి చేపట్టిన జి.నారాయణరావు తరువాత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి మరణించారు. 1990లో స్పీకర్‌ పదవి నిర్వహించి రామచంద్రారెడ్డి మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. 1999లో స్పీకర్‌ పదవి నిర్వహించిన శ్రీమతి ప్రతిభాభారతి..మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయంగా దెబ్బతిన్నారు. 2004లో స్పీకర్‌ పదవి చేపట్టిన కె.ఆర్‌.సురేష్‌రెడ్డి తరువాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోయారు. 2009లో స్పీకర్‌ పదవి చేపట్టిన ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి..తరువాత ముఖ్యమంత్రి అయి.. తరువాత ఎన్నికల్లో..పోటీ చేయలేదు.

యనమలకు మాత్రం మినహాయింపు…..

తరువాత స్పీకర్‌ అయిన నాదెండ్ల మనోహర్‌ 2014 ఎన్నికల్లో ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. మనోహర్‌ తరువాత స్పీకర్‌ అయిన కోడెల తిరిగి విజ‌యం సాధిస్తారా? లేదా ? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, ఏపీ స్పీక‌ర్లుగా ప‌నిచేసిన వారిలో ఒకే ఒక్క‌డు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మాత్రం 1999లో కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిపై విజయం సాధించారు. మ‌రి ఈ లెక్క‌న కోడెల ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుస్తారా? అనేది తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తున్న విష‌యం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*