
రాజకీయాల్లో వారసుల గోల పెరుగుతున్న విషయం తెలిసిందే. సీనియర్ మోస్ట్ నేతలు ఎవరికి వారు తమ తమ వారసు లను రంగంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. తాము ముప్పై ఏళ్లుగా చక్రం తిప్పాం.. ఇక, మా పిల్లలు చక్రం తిప్పితే చూడాలని ఉంది అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ కుటుంబం కోడెల శివప్రసాదరావు కుటుంబం నుంచి కూడా వారసులు అరంగేట్రం చేశారు. ఇప్పటికే కోడెల శివరామకృష్ణ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో ఈయనకు అసెంబ్లీ టికెట్ ఇప్పించి.. తాను రాజ్యసభకో.. లేదా నామినేటెడ్ పదవికో వెళ్లాలని ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న కోడెల శివప్రసాదరావు భావిస్తున్నారు.
నామినేటెడ్ పదవికి…..
ఈయనకు ఎలాగూ టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద మంచి పలుకుబడి, నమ్మకం, చొరవ ఉన్నాయి కాబట్టి.. శివప్రసాద రావు కోరికను బాబు తిరస్కరించే అవకాశం దాదాపు ఉండదు. సో.. డాక్టర్ కోడెల శివరామ కృష్ణకు అసెంబ్లీ టికెట్ ఖరార య్యే అవకాశం మెండుగానే ఉంటుంది. అయితే, ఎక్కడి నుంచి ఈ టికెట్ ఇస్తారు? అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం. వాస్తవానికి అటు సత్తెనపల్లి, ఇటు నరసరావుపేటల్లోనూ కోడెలకు ఫాలోయింగ్ ఉంది. అయితే, గత ఎన్నికల్లో నరసరావుపేటలో బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా కోడెల ఇక్కడ టికెట్‌ను వదులుకున్నారు. దీంతో ఇక్కడ వైసీపీ నుంచి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. దీంతో ఇక్కడ ఈయన పట్టు బిగించారు., ఇప్పుడు నరసరావు పేటలో ఏ ఇద్దరిని కదిలించినా.. మళ్లీ తాము గోపిరెడ్డికే ఓటు వేస్తామని చెబుతున్నారు.
సత్తెన పల్లిలో హోరాహోరీ…..
ఈ నేపథ్యంలో ఇక్కడ టికెట్ సంపాయించుకున్నా.. శివరామకృష్ణ గెలుపు కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడంటూ చేసిన విమర్శల్లో ఏ ఒక్కటినీ శివరామ కృష్ణ నిరూపిం చలేకపోవడం మరో ప్రధాన విషయం. ఈ నేపథ్యంలోనే శివరామకృష్ణకు నరసరావుపేట కేటాయించినా.. విజయం సాధిం చడం అంత ఈజీకాదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక కోడెల ప్రస్తుతం ప్రాథినిత్యం వహిస్తోన్న సత్తెనపల్లి విషయానికి వస్తే.. ఇక్కడ వైసీపీకి అంబటి రాంబాబు ఉన్నారు. ఒకవేళ అంబటే తిరిగి పోటీ చేస్తే కోడెల రంగంలో ఉంటే (చివర్లో సమీకరణలు మారి ఆయనే పోటీ చేయాల్సి వస్తే ) ఆయన గెలుస్తారని…అదే ఆయన కుమారుడు పోటీ చేస్తే హోరా హోరీ పోరు తప్పదని అంటున్నారు.
ఆయన పోటీ చేస్తే……
ఇక మరో టాక్ ఏంటంటే ప్రస్తుత మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ సారి సత్తెనపల్లికి మారే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే ప్లాన్ కూడా చేసుకుంటున్నారట. ఆర్కే సత్తెనపల్లిలో వైసీపీ నుంచి బరిలో ఉంటే ఇటు టీడీపీ తరపున కోడెల తనయుడు శివరామకృష్ణ పోటీ చేస్తే ఇద్దరు యువ నేతల మధ్య సత్తెనపల్లిలో పోరు రంజుగా ఉంటుందనడంలో డౌటే లేదు. ఇక అటు చంద్రబాబు కూడా కోడెల ఫ్యామిలీకి ఇప్పటికే మీలో ఎవరు పోటీ చేస్తారు ? మీకు సత్తెనపల్లి కావాలా ? నరసారావుపేట కావాలా ? మీకు ఇచ్చిన సీటు మాత్రమే మీది.. మరో చోటు మీకు సీటు ఇవ్వను… మీరు చెప్పిన వాళ్లకు కూడా ఇవ్వను తేల్చుకోండని చెప్పినట్టు కూడా తెలుస్తోంది. మరి కోడెల ఫ్యామిలీలో ఎవరు పోటీ చేస్తారు ? ఏ సీటు కోరుకుంటారన్నది చూడాలి.
Leave a Reply