కోడెలను వెంటాడుతోందా…??

kodela sivaprasadarao andhrapradesh assembly speaker

అవును! ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌, టీడీపీ రాజ‌కీయ దిగ్గజం కోడెల శివ‌ప్ర‌సాద్‌ను సెంటిమెంట్ రాజ‌కీయాలు వెంటాడుతున్నా యి. ప్ర‌స్తుతం ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాధినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే, మ‌రో నాలుగు నెల‌లోనే ఆయ‌న ఎన్నిక‌లకు వెళ్ల‌నున్నారు. అయితే, ఆయ‌నను సెంటిమెంట్ బూచీ త‌రుముతోంది. రాష్ట్రంలో అటు ఉమ్మ‌డి కావొచ్చు. ఇప్పుడు రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కావొచ్చు.. స్పీక‌ర్లుగా ప‌నిచేసిన వారు త‌ర్వాత ఎన్నిక‌ల్లో విజయం సాధించిన దాఖ‌లా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అయితే, ఒక్క య‌న‌మ‌ల రామ‌కృష్ణ‌డు త‌ప్ప‌. మిగిలిన వారంతా కూడా ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న‌వారే. తాజాగా తెలంగాణాలో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ అక్క‌డి స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి ఘోరంగా ఓడిపోయారు.

పనిచేసినా…..

పోనీ.. మ‌ధుసూద‌నాచారి ప్ర‌జ‌ల్లో లేరా ? అంటే ఉన్నారు. వారాంతంలో ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే మ‌కాం వేశారు. అక్క‌డి ప‌రిస్థితుల‌పై స్పందించి నేరుగా సీఎం కేసీఆర్‌తోనే మాట్లాడి నిధులు తెప్పించుకుని అభివృద్ధి చేశారు. అయినా కూడా సెంటిమెంట్ ఆయ‌న‌ను ఓడించింది. ఇక‌, ఉమ్మడి రాష్ట్రంలోనూ అనేక మంది స్పీక‌ర్లు ప‌రాజయం పాల‌య్యారు. కొంద‌రు రాజ‌కీయాల‌కు కూడా దూర‌మ‌య్యారు. స్పీక‌ర్‌గా చేసిన మ‌హిళ‌, ద‌ళిత నాయ‌కురాలు ప్ర‌తిభా భార‌తి స్పీక‌ర్ ప‌ద‌వి అనంత‌రం ఇప్ప‌టి వ‌ర‌కు గెలిచింది లేదు. ఇక‌, మ‌రో స్పీక‌ర్ సురేష్ రెడ్డి కూడా ఓట‌మి పాలై రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. ఇటీవ‌లే ఆయ‌న టీఆర్ ఎస్‌లో చేరినా.. త‌గిన గుర్తింపు మాత్రం ఇంకా రాలేదు.

గతంలో స్పీకర్ గా ఉండి…

అదేవిధంగా గుంటూరు జిల్లాకు చెందిన నాదెండ్ల మ‌నోహ‌ర్ కూడా స్పీక‌ర్ పాత్ర పోషించిన త‌ర్వాత ఎన్నిక‌ల్లో గెలిచింది లేదు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న తెనాలిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈయ‌న కూడా ఇటీవ‌ల రాజ‌కీయ అస్తిత్వాన్ని నిలుపుకొనేందుకు జ‌న‌సేనకు జై కొట్టారు. ఇక‌, మ‌రోస్పీక‌ర్ కిర‌ణ్ కుమార్ రెడ్డి… త‌ర్వాత కాలంలో సీఎంగా రాష్ట్రాన్ని పాలించినా గ‌త ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. సొంత పార్టీ పెట్టుకుని కూడా ప‌రాజ‌యం పాల‌య్యారు. ఉనికిలో కూడా లేకుండా పోయారు. ఛీత్క‌రించిన కాంగ్రెస్‌లోకే తిరిగి చేరారు.

గెలుపు అంత ఈజీకాదని….

మ‌రి ఏపీలో ఇప్పుడు స్పీక‌ర్‌గా ఉన్న కోడెల శివ‌ప్ర‌సాద్ ప‌రిస్థితి ఏంటి ? అనేది చ‌ర్చ‌కు వ‌స్తోంది. స‌త్తెన‌ప‌ల్లిలో ఆయ‌న ప‌నితీరుకు మంచి మార్కులే ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న అవినీతిపై దృష్టి పెట్ట‌క‌పోవ‌డం మాత్రం ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. దీనికి తోడు కొంత‌మంది నియోజ‌క‌వ‌ర్గంలో చేస్తోన్న పెత్త‌నం కూడా ఆయ‌న‌కు మైన‌స్ అయ్యేలా ఉంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లిలో పోటీ చేస్తారా ? న‌ర‌సారావుపేట‌లో పోటీ చేస్తారా ? అన్న‌ది కూడా క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న‌కు గెలుపు అంత న‌ల్లేరుమీద న‌డ‌క కాద‌ని అక్క‌డ రాజ‌కీయ వాతావ‌ర‌ణం చెపుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*