కోడెలకు బాబు కండిషన్లు..!

రాజ‌కీయాల్లో సీనియ‌ర్ల‌యినా.. జూనియ‌ర్ల‌యినా.. అదృష్టం లేక‌పోతే.. ప‌రిస్థితి తారుమారే..! ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టు గా ఉంటుంది ప‌రిస్థితి! ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు గుంటూరు కు చెందిన టీడీపీ సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు, స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు. న‌ర‌స‌రావుపేట‌ను కేంద్రంగా చేసుకుని ఆయ‌న ప‌లు మార్లు అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీ పొత్తు పెట్టుకోవ‌డంతో ఈ టికెట్‌ను త్యాగం చేసి (కోడెల సీటు మారేందుకు చాలా కార‌ణాలే ఉన్నాయి ) స‌త్తెనప‌ల్లి నుంచి పోటీ చేసిన కోడెల అక్క‌డ కూడా గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, ఆయ‌న అనుకున్న‌ది మాత్రం సాధించ‌లేక‌పోతున్నారు.

చంద్రబాబు హయాంలో……

గ‌తంలో ఎన్టీఆర్ హ‌యాంలో మంత్రిగా ఉన్న కోడెల చంద్ర‌బాబు హ‌యాంలో మాత్రం దానిని సాధించ‌లేక పోతున్నార‌నే ఆవేద‌న ఉంది. ఓ సీనియ‌ర్‌గా ఉన్న కోడెల 2004, 09 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండుసార్లు ఓడిపోయాక రాజ‌కీయంగా జిల్లాలోనూ, స్టేట్‌లోనూ కాస్త వెన‌క‌ప‌డిన మాట నిజం. 2014లో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కాక‌, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక‌.. త‌న‌కు ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుందని కోడెల అనుకున్నారు. అయితే, చంద్ర‌బాబు మాత్రం ఆయ‌న‌కు కేబినెట్‌లో అవ‌కాశం ఇవ్వ‌కుండా స్పీక‌ర్‌గా అవ‌కాశం ఇచ్చారు. స్పీక‌ర్‌గా అవ‌కాశం ద‌క్కినా త‌న‌కు సంతోషం క‌ల‌గ‌లేద‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో కోడెల త‌న మ‌నసులో మాట‌ను చెప్పుకొచ్చారు.

మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా…..

ఎప్పుడు మంత్రి వ‌ర్గం విస్త‌రిస్తార‌నే ప్ర‌క‌ట‌న వెలువ‌డినా, దాని తాలూకా సంకేతాలు అందినా.. త‌న‌కు బెర్త్ ఖాయం చేసుకునేందుకు ఆయ‌న శ‌త విధాల ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌త ఏడాది జ‌రిగిన విస్త‌ర‌ణ‌లో ఖ‌చ్చితంగా త‌న‌కు కేబినెట్ బెర్త్ ద‌క్కుతుంద‌ని ఆయ‌న అనుకున్నారు., అయితే, చివ‌రి నిముషంలో ఆయ‌న ఆశ‌లు ఆవిర‌య్యాయి. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల ముంగిట మ‌రోసారి మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించ‌నున్నార‌ని, కీల‌క‌మైన నాయ‌కులకు చంద్ర‌బాబు పెద్ద‌పీట వేయ‌నున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో మ‌ళ్లీ కోడెల కుటుంబంలో కేబినెట్ ఆశ‌లు చిగురించాయి.

ఆ రెండు వర్గాలకే…..

అయితే, ఇంత‌లోనే కేవ‌లం ఎస్సీ, మైనార్టీ వ‌ర్గాల‌కు మాత్ర‌మే చంద్ర‌బాబు అవ‌కాశం ఇవ్వ‌నున్నార‌ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డంతో కోడెల బాధ అలా ఇలా లేద‌ని తెలుస్తోంది. ఏం చేయాలో కూడా త‌న‌కు తెలియ‌డం లేద‌ని ఆయ‌నకు అత్యంత స‌న్నిహితంగా ఉండేవారు చెబుతున్నారు. ఇక ఈ ఏడు నెల‌ల్లో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చినా, రాక‌పోయినా వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత కూడా ఆయ‌న‌కు మంత్రి ఛాన్స్ ఉంటుందా ? లేదా ? అన్న‌దానిపై క్లారిటీ లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీలో మ‌ళ్లీ టీడీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డినా (క‌మ్మ సామాజిక‌వ‌ర్గ ప‌రంగా) జిల్లాలో ఇద్ద‌రు సీనియ‌ర్ల‌లోనే ఒక‌రు లేదా ఇద్ద‌రికి ఛాన్స్ రావొచ్చేమో గాని మిగిలిన వాళ్ల‌కు ఛాన్స్ ఉండ‌ద‌నే వాద‌న‌లు బ‌లంగా ఉన్నాయి.

సీటు విష‌యంలోనూ కండీష‌న్లేనా…

కోడెల‌కు మంత్రి ప‌ద‌వి వ‌చ్చే దారులు పూర్తిగా మూసుకుపోయిన‌ట్టు క‌నిపిస్తుంటే ఆయ‌నకు ఎమ్మెల్యే సీటు విష‌యంలోనూ స్వ‌యంగా చంద్ర‌బాబు కండీష‌న్లు పెట్టిన‌ట్టు గుంటూరు జిల్లాలోని పార్టీ విశ్వ‌సనీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది. కోడెల ప్ర‌స్తుతం స‌త్తెన‌ప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉండ‌గా, న‌ర‌సారావుపేట‌కు పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు సీట్ల‌ను త‌న ఫ్యామిలీ గ్రిప్‌లోనే ఉంచుకోవాల‌న్న‌ది ఆయ‌న ప్లాన్‌. ఒక సీటులో ఆయ‌న‌, మ‌రో సీటు నుంచి త‌న వార‌సుడిని పోటీ చేయించాల‌ని ఆయ‌న చూస్తున్నారు. అయితే తాజాగా చంద్ర‌బాబు మీ ఫ్యామిలీకి ఒక సీటు మాత్ర‌మే ఉంటుంది… తండ్రి, కొడుకుల్లో ఎవ‌రు పోటీ చేస్తారో ? చెప్పండి… రెండో సీటు మాత్రం మీరు చెప్పిన వాళ్ల‌కు ఇవ్వ‌న‌ని తెగేసి చెప్పార‌ట‌. కోడెలకు ప్ర‌స్తుతం స‌త్తెన‌ప‌ల్లి కంటే న‌ర‌సారావుపేట‌లోనే సానుకూల‌త ఉంద‌న్న నేప‌థ్యంలో ఆయ‌న తిరిగి అక్క‌డికే వెళ‌తార‌ని కూడా టాక్‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*