ఆయనతో ఈయనకు పోలికేంటి?

ఈ స్పీక‌ర్ ఇక మార‌రా ? ఆయ‌న శైలి ఇక మార‌దా ?- ఈ మాట‌లు అంటున్నది ఏ సామాన్య జ‌న‌మో.. లేదా.. విప‌క్షానికి చెందిన మీడియానో కాదు.. రాష్ట్రంలోని మేధావులే! రాజ‌కీయాల‌కు అతీతంగా వ్యవ‌హ‌రించాల్సిన అసెంబ్లీ స్పీక‌ర్ ఇలా అధికార పార్టీ అధినేత‌, సీఎం చంద్రబాబుకు స్పీక‌ర్ (గొంతు)గా మారారా ? అని వారు ప్రశ్నిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చినందుకే స్పీక‌ర్ ఇలా చేస్తున్నారా? లేక రాబోయే ఎన్నిక‌ల్లోనూ త‌న‌కు త‌న‌కుమారుడుకి, కుదిరితే.. త‌న కుమార్తెకు కూడా టికెట్లు ఇప్పించుకోవాల‌ని చూస్తున్న కోడెల ఇలా రాజ్యాంగం ప్రసాదించిన ప‌ద‌విని అపహాస్యం పాలు చేస్తున్నారా? అని నిప్పులు చెరుగుతున్నారు.

బాబును పొగడ్తలతో……

వాస్తవానికి త‌న‌కు పార్లమెంటు స్పీక‌ర్‌గా వ్యవ‌హ‌రించి ఇటీవ‌ల మృతి చెందిన సోమ‌నాథ్ చెట‌ర్జీ ఆద‌ర్శమ‌ని చెప్పుకొనే కోడెల ఇలా వ్యవ‌హ‌రించ‌డం ఏంట‌ని మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ బహిరంగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అవ‌కాశం వ‌చ్చిన ప్రతి చోటా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పోలవరం వేగంగా పూర్తి కావడానికి చంద్రబాబే కారణమంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ‘పోలవరం ప్రాజెక్టు 80 సంవత్సరాల ఆలోచన. దీని కోసం 30 ఏళ్లుగా ప్రయత్నాలు జరిగాయి. మరో ఏడునెలల్లో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుంది.’ అని కోడెల ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు.

బాబు చిత్రానికి పాలాభిషేకం…..

ఇక‌, ఈ నెల‌లోనే తొలి వారంలో చంద్రబాబు యువ‌నేస్తం ప‌థ‌కాన్ని ప్రక‌టించిన సంద‌ర్భంలో ఓ స‌భ‌లో పాల్గొన్న కోడెల శివ‌ప్రసాద‌రావు.. ఏకంగా చంద్రబాబు చిత్రప‌టానికి పాలాభిషేకం చేశారు. ఇది మ‌రింత దారుణ‌మ‌ని, రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద వుల్లో ఉన్నవారికి అంద‌రూ స‌మాన‌మేన‌ని తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నార‌ని మేథావులు, రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం తీవ్రస్థాయిలో ఫైర‌య్యా రు. అయినా శివ‌ప్రసాద్‌రావు మాత్రం ఈ విమ‌ర్శలేవీ త‌న‌కు తెలియ‌న‌ట్టుగా త‌న ద‌రికి చేర‌న‌ట్టుగా త‌న మానాన తాను భ‌ట్రాజుగా మారిపోయి.. ఇలా వ్యవ‌హరిస్తుండ‌డంపై మేదావులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

సోమ్ నాథ్ ఛ‍టర్జీని …….

సోమ‌నాథ్ చ‌ట‌ర్జీ విష‌యాన్నే తీసుకుంటే.. పార్టీకి అతీతంగా ఆయ‌న ఐదేళ్లు స్పీక‌ర్‌గా ప‌నిచేశారు. సీపీఎం త‌ర‌ఫున ఆయ‌న ఎంపీగా ఎన్నికైనా .. స్పీక‌ర్ స్థానంలో ఉండ‌డంతో పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయ‌న వ్యతిరేకించారు ఫ‌లితంగా దేశ రాజ‌కీయ చ‌రిత్రలో తిరుగులేని చ‌రిత్రను సృష్టించారు. మ‌రి ఆయ‌న త‌న‌కు ఆద‌ర్శమ‌ని ప‌దేప‌దే చెప్పే స్పీక‌ర్ కోడెల ఇలా పార్టీ అధినేత భ‌జ‌న‌లో ఆరితేర‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్రశ్నిస్తున్నారు మేధావులు. ఇప్పటికైనా ఆయ‌న త‌న పంథా మార్చుకోవాల‌ని అంటున్నారు. మ‌రి ఈ రాజ‌కీయ దురంధ‌రుడు వింటారా? లేదా ? అన్నది చూడాలి.

వారసుడి ఫ్యూచర్ కోసమేనా?

చంద్రబాబుకు కోడెల వీర‌భ‌జ‌న వెన‌క చాలా క‌థే ఉంద‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కోడెల త‌న‌తో పాటు త‌న కుమారుడికి కూడా టిక్కెట్లు ఇప్పించుకోవాల‌ని చూస్తున్నారు. న‌ర‌సారావుపేట‌, స‌త్తెన‌ప‌ల్లి రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఆయ‌న వ‌దులుకునేందుకు ఇష్టంగా లేరు. అయితే చంద్రబాబు ఇద్దరిలో ఒక‌రికే…అది కూడా ఒక సీటే అని ఇప్పటికే చెప్పేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రస‌న్నం కోసం… ఇటు వార‌సుడి ఫ్యూచ‌ర్ కోస‌మే కోడెల బాబు వీర భ‌జ‌న చేస్తున్నార‌న్న టాక్ టీడీపీ వ‌ర్గాల్లోనే ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*