ఒత్తిడిలో స్పీక‌ర్ కోడెల‌.. ఇదే కారణమా….!

గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి ఎంతో సెంటిమెంట్‌.. ఇక్క‌డ ఎప్పుడు గెలిస్తే అప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్బ‌వించిన త‌ర్వాత జ‌రిగిన ఎనిమిది ఎన్నిక‌ల్లోనూ ఇదే సెంటిమెంట్ పండింది. అంతేగాకుండా.. టీడీపీ మ‌ద్ద‌తుతో ఇత‌ర పార్టీ అభ్య‌ర్థి గెలిచిన‌ప్పుడు కూడా అధికారం చేప‌ట్టింది. ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో వెయ్యిలోపు ఓట్ల మెజారిటీతో బ‌య‌ట‌ప‌డిన కోడెల‌ను ఇప్పుడు సెంటిమెంట్ వెంటాడుతుందా..? అంటే పార్టీ వ‌ర్గాల్లో ఔన‌నే టాక్ వ‌స్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతుందోన‌నే ఆందోళ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో స‌మీప వైసీపీ అభ్య‌ర్థి అంబ‌టి రాంబాబుపై కేవ‌లం 924 ఓట్ల తేడాతో ఆయ‌న విజ‌యం సాధించారు.

ఎలాగైనా గెలిచి…..

స‌త్తెన‌ప‌ల్లిలో విజ‌యం సాధిస్తేనే.. అధికారంలోకి వ‌స్తామ‌న్న సెంటిమెంట్‌తో కోడెల శివ‌ప్ర‌సాద‌రావు స‌త‌మ‌త‌వుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న తీవ్ర ఒత్తిడికి కూడా గుర‌వుతున్నార‌ట‌. అయితే, ఇదంతా లోలోప‌ల ఉన్నా.. బ‌య‌ట‌కు మాత్రం క‌నిపించ‌కుండా మెయింటెన్ చేస్తూ ఎలాగైనా గెలవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఆయ‌న ముందుకు వెళ్తున్నారు. ఇదే స‌మ‌యంలో కొద్దిపాటి తేడాతో ఓడిపోయిన స్థానాన్నిఈసారి ద‌క్కించుకోవాలని వైసీపీ చూస్తోంది. ఈ నేప‌థ్యంలో స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంపై అంద‌రిదృష్టి ప‌డింది. ఈసారి ఏం జ‌రుగుతుందోన‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేగాకుండా.. ఈ నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్ల‌కు మ‌రో ప్ర‌త్యేక‌త ఉంది. ఎవ‌రు గెలిచినా కూడా కొద్దిపాటి తేడాతోనే కావ‌డం గ‌మ‌నార్హం. 1983 నుంచి 2014ఎన్నిక‌ల వ‌ర‌కు ఏ పార్టీకి కూడా భారీ మెజారిటీ ఇవ్వ‌లేదు.

ఇక్కడ గెలిస్తే ‘‘పవర్’’…?

1983 ఎన్నికల్లో టీడీపీ నుంచి నన్నపనేని రాజకుమారి కాంగ్రెస్ అభ్య‌ర్థిపై 19,668 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో సీపీఎం అభ్యర్థి పుతుంబాక వెంకటపతి కాంగ్రెస్‌పై 9,351 ఓట్లతో గెలిచారు. ఈ రెండుసార్లూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చి ఎన్టీ రామారావు ముఖ్య‌మంత్రి అయ్యారు. ఇక‌ 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి దొడ్డా బాలకోటిరెడ్డి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ మద్దతుతో పోటీచేసిన సీపీఎం అభ్యర్థి పుతుంబాక వెంకటపతిపై 13,928 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. 1994 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీచేసిన సీపీఎం అభ్యర్థి పుతుంబాక భారతి కాంగ్రెస్‌పై 2,337 ఓట్లతో గెలిచారు. అప్పుడు టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. 1999 టీడీపీ అభ్యర్థి వైవీ ఆంజనేయులు కాంగ్రెస్‌పై 10,693 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ మ‌ళ్లీ అధికారంలోకి వచ్చింది.

రెండుసార్లు కాంగ్రెస్ గెలిచి….

ఇక 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డి డాక్టర్‌ అంజిరెడ్డి టీడీపీపై 24,410 ఓట్లతో గెలిచారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డి టీడీపీపై 7,149ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అధికారంలోకి రావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌ రాష్ట్ర విభజన తర్వాత జ‌రిగిన‌ 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై కేవ‌లం 924 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిస్తే.. వారే అధికారంలోకి వ‌స్తార‌నే నానుడి స్థిర‌ప‌డిపోయింది.

సెంటిమెంట్ తో కలవరం…..

వాస్త‌వానికి గ‌తంలో న‌ర‌సారావుపేట నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు గెలిచి రెండుసార్లు ఓడిన కోడెల గ‌త ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లికి మారారు. ఆయ‌న సొంత ఊరు ఉన్న న‌క‌రిక‌ల్లు మండ‌లం స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోకి మార‌డంతో కోడెల ఇక్క‌డ పోటీ చేసి గెలిచారు. ఇక ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచిన పార్టీ సెంటిమెంట్ బేస్ చేసుకునే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తోంది. మ‌రి ఇప్పుడు కోడెల వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం చేస్తారో ? స‌త్తెన‌ప‌ల్లి సెంటిమెంట్ ఏపీలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే పార్టీకి వ‌ర్తిస్తుందా ? లేదా ? అన్న‌ది చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*