కోడెల కష్టాలు అన్నీ ఇన్నీ కావు..!

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన ఆ పార్టీతోనే ఉన్నారు. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నిక అయిన సుదీర్ఘ‌మైన రాజకీయ అనుభవం ఆయనది. తన జిల్లా రాజకీయాలను నిన్నటి వరకు కనుసైగలతో శాశించిన ఆ సీనియర్‌ రాజకీయ నేత ఇప్పుడు తాను పోటీ చేసేందుకు అనువైన నియోజకవర్గం వెతుక్కునేందుకు ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి. ఇంతకు అంత సీనియర్‌ నేతకు ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటి ? ఏపీ రాజధాని జిల్లా అయిన గుంటూరు జిల్లా టీడీపీ ఏం జరుగుతుందో తెలుగు పోస్ట్‌ ప్రత్యేక సమీక్షలో చూద్దాం. ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు మూడున్నర దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసారావుపేట కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించి నరసారావుపేటను తన కంచుకోటగా మార్చుకున్నారు.

అత్తెసర మెజారిటీతోనే….

కోడెల గత ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గాన్ని వదులుకుని పక్కనే ఉన్న సత్తెనపల్లికి మారాల్సి వచ్చింది. కోడెల నరసారావుపేటను వదులుకున్నప్పుడే ఆయనక అక్కడ పట్టు తగ్గిందా ? లేదా పట్టు పూర్తిగా కోల్పోయారా అన్న సందేహాలు కలిగాయి. గుంటూరు జిల్లాల్లో బలమైన టీడీపీ గాలులు వీచి తన తోటి ఎమ్మెల్యేలందరూ మంచి మెజారిటీతో గెలుపొందినా కోడెల సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు మీద 700 ఓట్ల పైచిలుకు అత్తెసర మెజారిటీతో గెలుపొందారు. కోడెల గెలిచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లు పూర్తి అయ్యాయి. ఇటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సత్తెనపల్లితో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న నరసారావుపేటలో కోడెల గ్రాఫ్‌ ఎలా ఉంది? అని పరిశీలిస్తే కోడెలపై మెజారిటీ వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేఖతే కనిపిస్తోంది. ఇందుకు అనేక రకరకాల కారణాలు దోహ‌దం చేస్తున్నాయి.

రెండు నియోజకవర్గాలపై…..

గత ఎన్నికల్లో కోడెల సత్తెనపల్లి నుంచి గెలవగా ఆయన పాత నియోజకవర్గం నరసారావుపేటలో విజయం సాధించింది. చంద్రబాబు నరసారావుపేటలోనూ కోడెలనే ఇన్‌చార్జ్‌గా కొనసాగించారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవెయ్యడంతో పాటు పార్టీని పటిష్టం చేసే బాధ్య‌త ఆయనపై పడింది. నాలుగున్నర ఏళ్లలో కోడెల స్పీకర్‌ హోదాలో ఉండడంతో భారీగా నిధులు రాబట్టి రెండు నియోజకవర్గాలను టీడీపీకి కంచుకోటగా చేసే మంచి ఛాన్స్‌ ఆయనకు వచ్చింది.అయితే ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న వాస్తవ పరిస్థితిని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఉన్న బలంతో పోలిస్తే కోడెల అండ్ ఆయ‌న‌ తనయుడు శివరాం తీరుతో టీడీపీ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి. రెండు నియోజకవర్గాల్లో కోడెల తన మార్క్‌ అభివృద్ధిని కొంత వరకు చేసినా ఆయనకు సన్‌ స్ట్రోక్‌ గట్టిగా తగిలిందని కుమారుడు తీరుతో సత్తెనపల్లితో పాటు నరసారావుపేట నియోజకవర్గాల్లో ఆ ఎఫెక్ట్‌ కోడెల మీద తీవ్రంగా ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

సత్తెనపల్లి కన్పర్మ్ చేశారా…?

ఈ రెండు నియోజకవర్గాల్లో కోడెల & ఫ్యామిలీ పని తీరుపై ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న సీఎం చంద్రబాబు ఇటీవల కోడెలను పిలిచి మీకు నరసారావుపేట కంటే సత్తెనపల్లిలోనే సానుకూలత కనిపిస్తోంది. మీరు అక్కడే పోటీ చెయ్యాలని చెప్పగా కోడెల మీ ఇష్టమే నా ఇష్టమని నర్మగర్భంగా చెప్పినట్టు కూడా సమాచారం. ఇదే టైంలో కోడెల‌తో చంద్ర‌బాబు న‌రాసారావుపేట‌కు చెందిన కాసు ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకునే విష‌యంలో మీకేమైనా అభ్యంత‌రాలు ఉన్నాయా ? అని కూడా ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది. ఈ విష‌యంలో ఆయ‌న త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కూడా చెప్పార‌ట‌. వాస్తవంగా ఈ రెండు నియోజకవర్గాల్లో సన్‌ స్ట్రోక్‌ ఎక్కువగా ఉండడంతో సత్తెనపల్లి, నరసారావుపేటలో పోటీ చేసేందుకు ఇష్టపడని ఆయన గుంటూరు వెస్ట్‌ నుంచి పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఆయన ఇప్పటికే లీకులు కూడా ఇస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వెస్ట్ సీటు కోసం…..

ప్రస్తుతం గుంటూరు వెస్ట్‌ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డి వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చెయ్యనని ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన నరసారావుపేట ఎంపీ లేదా జిల్లాల్లో మరో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మోదుగులతో ఖాళీ అయ్యే గుంటూరు వెస్ట్‌ సీటుపై కోడెల కన్ను పడినట్టు తెలుస్తోంది. మూడున్నర దశాబ్దాల సుదీర్ఘ‌మైన రాజకీయ చరిత్రతో పాటు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కీలక పదవులు చేపట్టి ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న కోడెల శివప్రసాద్‌రావుకు ఇలాంటి దుస్థితి రావడం విచిత్రమే అని సొంత పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ఏదేమైనాన కోడెల సంగతి ఎలా ఉన్నా ఆయనకు సన్‌ స్ట్రోక్‌ ఎఫెక్ట్‌ వల్లే నరసారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుందని జిల్లా జనాలు చర్చించుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*