మళ్ళీ మొదటికొచ్చిందే…!

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్యెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ సభ్యత్వాల రద్దు వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. 12 మంది టీఆరెస్ ఎమ్మెల్యేలు శాసనసభకు స్పీకర్ సుప్రీం అని ఆయన తీసుకునే నిర్ణయంపై కోర్టు కి అధికారం లేదంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. దాంతో ఈ వివాదంపై తెగేదాకా లాగాలని టి సర్కార్ భావిస్తున్నట్లు తేలింది. ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు ను రద్దు చేస్తే సర్కార్ పరువు పోతుందనే యోచనతో కేసీఆర్ సర్కార్ ఈ కేసును ప్రతిష్టగా తీసుకుంది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ మరోసారి హై కోర్టు ముందు నిలిచింది ప్రభుత్వం. హై కోర్టు కోమటిరెడ్డి, సంపత్ కుమార్ లకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును ఇద్దరూ కేంద్ర ఎన్నికల సంఘానికి వెంటనే ఇచ్చి వచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం వీరిద్దరికి అండగా నిలవడంతో పోరు రసవత్తరంగా మారింది.

సుప్రీం న్యాయవాదులు దిగుమతి …

అటు కాంగ్రెస్, ఇటు టి సర్కార్ కి అత్యంత ప్రతిష్ట గా మారిన ఈ కేసును న్యాయ దిగ్గజాలు వాదించనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ప్రఖ్యాత సుప్రీం న్యాయవాది వైద్యనాధన్ ను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ అధిష్టానం సైతం ఢిల్లీ నుంచి మరో ప్రముఖ న్యాయ వాదిని బరిలోకి దించనుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వాదన ఆసక్తికరంగా మారింది. న్యాయవ్యవస్థ – శాసన వ్యవస్థల నడుమ యుద్ధంగా ఇది మారుతుందా లేక సామరస్యంగా ఈ అంశం పరిష్కారం అవుతుందా అన్న ఆసక్తి అందరిలో మొదలైంది. ఇప్పటికే ప్రజల్లో సభ్యత్వాల రద్దు వివాదం బాగా వెళ్ళింది. కాంగ్రెస్ మొదట్లో డీలా పడినా హై కోర్టు ఇచ్చిన తీర్పు జోష్ తో జనంలోకి వెళ్ళింది. ఇప్పుడు కేసు అటూ… ఇటూ అయితే ఆ పార్టీకి మరోసారి నిరుత్సాహం రావొచ్చు. ఈ కేసు సుప్రీం కోర్టు గడపతొక్కినా ఆశ్చర్యం లేదు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఫైల్ చేసిన పిటిషన్ హై కోర్ట్ డివిజన్ బెంచ్ స్వీకరించింది. గురువారం దీనిపై విచారణ మొదలు కావలిసి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*